
కూలీల పొట్ట కొడితే సహించం
సీపీఐ జాతీయ నేత డాక్టర్ కె. నారాయణ
(విశాలాంధ్ర – తిరుపతి) : మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం నీరుగారుస్తోందని, నిబంధనల పేరుతో పేద కూలీల నోటికాడి కూడును లాగేసుకుంటోందని సీపీఐ జాతీయ కమిటీ కంట్రోల్ మిషన్ ఛైర్మన్ డాక్టర్ కె. నారాయణ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. మంగళవారం నగరి నియోజకవర్గంలో సాగుతున్న ఉపాధి హామీ పనులను ఆయన క్షేత్రస్థాయిలో పరిశీలించారు. మండుటెండలో పని చేస్తున్న కూలీలతో కలిసి కూర్చుని వారి కష్టాలను అడిగి తెలుసుకున్న ఆయన, ప్రభుత్వం అనుసరిస్తున్న మొండి వైఖరిపై ‘హాట్ కామెంట్స్’ చేశారు.
గాంధీ పేరు తొలగింపు… పథకం నిర్వీర్యం
పథకం నుంచి మహాత్మా గాంధీ పేరును సైతం తొలగించే కుట్ర జరుగుతోందని నారాయణ మండిపడ్డారు. “ప్రభుత్వమే పనిముట్లు ఇవ్వాల్సిన చోట, పేద కూలీలే స్వయంగా తెచ్చుకోవాలని వేధించడం దుర్మార్గం. గతంలో ఉన్న వెసులుబాటులను రద్దు చేస్తూ, లొసుగులతో పథకాన్ని నామమాత్రం చేస్తున్నారు” అని ధ్వజమెత్తారు.
డిజిటల్ వేధింపులు.. ఎండలో ఐరిస్ కష్టాలు
పని ప్రదేశంలో ఉదయం, మధ్యాహ్నం ఫోటోలు, ఐరిస్ స్కాన్ల పేరిట కూలీలను యాతన పెడుతున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. సాంకేతికత పేరుతో సమయాన్ని వృధా చేస్తూ, ఎండలో అలమటించే వారిని మానసిక వేధింపులకు గురి చేయడం ప్రభుత్వ నిర్లక్ష్యానికి పరాకాష్ట అని విమర్శించారు.
నీడ లేదు.. ఓఆర్ఎస్ లేదు
ఎండ తీవ్రతకు కూలీలు అల్లాడుతున్నా కనీసం షామియానాలు వేయకపోవడం, డీహైడ్రేషన్ బారిన పడకుండా ఇవ్వాల్సిన ఓఆర్ఎస్ ప్యాకెట్లు ఫీల్డ్ అసిస్టెంట్లకు చేరకపోవడంపై నారాయణ నిలదీశారు. “గుంతలు తవ్వేటప్పుడు పాములు, తేళ్ల భయం పొంచి ఉంది. కనీసం ప్రథమ చికిత్స కిట్లు కూడా అందుబాటులో లేకపోవడం శోచనీయం. తక్షణమే మెడికల్ కిట్లు ఏర్పాటు చేయాలి. ప్రమాద బీమా పథకాన్ని అమలు చేయాలి” అని నారాయణ డిమాండ్ చేశారు.
కార్పొరేట్లకు ‘మాఫీ’.. కూలీలకు ‘కోతలా’?
కేంద్ర బడ్జెట్‌పై నారాయణ నిప్పులు చెరుగుతూ.. “కోటీశ్వరులకు రూ.29 లక్షల కోట్లు రుణాలను రైటాఫ్ (మాఫీ) చేసిన మోదీ ప్రభుత్వం, రెక్కాడితే గాని డొక్కాడని కూలీల బడ్జెట్లో కోతలు విధించడం సిగ్గుచేటు. ఒకే ఇంట్లో భార్యాభర్తలు ఉంటే పని దినాలను 50 రోజులకు కుదించడం ఏ చట్టంలో ఉంది? ప్రతి కూలీకి 120 రోజుల పని కల్పించాల్సిందే” అని నారాయణ స్పష్టం చేశారు. వారానికోసారి వేతనాలు చెల్లించాలని, నిబంధనల పేరుతో విధిస్తున్న ఆంక్షలను తక్షణమే ఎత్తివేయాలని ఆయన హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సీపీఐ నేత కోదండయ్య, స్థానిక నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.


