జిల్లా ఎస్పీ సతీష్ కుమార్
విశాలాంధ్ర ధర్మవరం;; ఫ్యాక్షన్ కు దూరంగా ఉండి ప్రశాంతమైన జీవనమును గ్రామ ప్రజలు గడపాలని ఇలా ఎస్పీ సతీష్ కుమార్ తెలిపారు. ఈ సందర్భంగా ఫ్యాక్షన్ ప్రభావిత ఓబులనాయనపల్లి గ్రామంలో ఎస్పీ పర్యటించారూ. ప్రజలతో నేరుగా మాట్లాడి స్థానిక పరిస్థితులను తెలుసుకున్నారు. గ్రామంలో నెలకొన్న శాంతిభద్రతల పరిస్థితులపై అధికారులను అడిగి తెలుసుకోవడంతో పాటు ప్రజల అభిప్రాయాలు, సమస్యలను స్వయంగా విన్నారు.
ముఖ్యంగా మహిళలతో ప్రత్యేక సమావేశం నిర్వహించి గ్రామంలో గత పరిస్థితులు, ప్రస్తుతం నెలకొన్న వాతావరణం, ప్రజల జీవన విధానంలో వచ్చిన మార్పులపై చర్చించారు. మహిళలు ప్రస్తావించిన సమస్యలను శ్రద్ధగా విన్న ఎస్పీ , ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా నిర్భయంగా పోలీసులను సంప్రదించాలని సూచించారు. మహిళలు, చిన్నారుల భద్రతకు పోలీసు శాఖ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని భరోసా కల్పించారు. పాత కక్షలు, కుటుంబ విభేదాలు, ఫ్యాక్షన్ గొడవలు గ్రామాల అభివృద్ధికి అడ్డంకిగా మారుతాయని అన్నారు. ప్రతీకార భావాలు, హింసాత్మక చర్యలు వ్యక్తులకే కాకుండా కుటుంబాల భవిష్యత్తును కూడా దెబ్బతీస్తాయని పేర్కొన్నారు.
యువత చెడు అలవాట్లు, మద్యం వ్యసనం, నేరప్రవృత్తులకు దూరంగా ఉండాలని సూచించారు. క్రిమినల్ కేసుల్లో చిక్కుకోవడం వల్ల ఉద్యోగ అవకాశాలు వంటి కోల్పోయే ప్రమాదం ఉంటుందని వివరించారు.తల్లిదండ్రులు పిల్లలపై ప్రత్యేక శ్రద్ధ చూపి విద్య, ఉపాధి, సత్సంస్కారాల వైపు ప్రోత్సహించాలని సూచించారు. గ్రామాల్లో అనుమానాస్పద వ్యక్తుల సంచారం, వివాదాలు లేదా శాంతిభద్రతలకు భంగం కలిగించే ఘటనలు గమనించిన వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని కోరారు.ప్రజల సహకారంతోనే గ్రామాల్లో శాంతి భద్రతలు మరింత బలోపేతం అవుతాయని పేర్కొన్న ఎస్పీ , సమస్యల పరిష్కారానికి చట్టబద్ధంగా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. గ్రామస్తులు పరస్పర సహకారం, సామరస్యంతో ప్రశాంత వాతావరణాన్ని కొనసాగించాలని విజ్ఞప్తి చేశారు.
అనంతరం ధర్మవరం రూరల్ పోలీస్ స్టేషన్ను తనిఖీ చేసిన ఎస్పీ గారు, పెండింగ్ కేసుల పురోగతిని సమీక్షించి సిబ్బంది ప్రజలకు మరింత బాధ్యతాయుతంగా సేవలందించాలని సూచించారు.ఈ కార్యక్రమంలో ధర్మవరం రూరల్ సీఐ ప్రభాకర్, ఎస్ఐ రాజశేఖర్, పోలీసు సిబ్బంది, గ్రామ పెద్దలు, మహిళలు , గ్రామస్తులు పాల్గొన్నారు.


