టీవీకేకు డీఎంకే కూటమి పక్షాలు మద్దతుపై స్టాలిన్ వివరణ
చెన్నై: తమిళనాడులో టీవీకే ప్రభుత్వ ఏర్పాటుకు కాంగ్రెస్ సహా డీఎంకే కూటమి పక్షాలు మద్దతు ఇవ్వడంపై మాజీ ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ స్పందించారు. రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించడాన్ని నివారించాలనే ఉద్దేశంతోనే టీవీకేకు మద్దతిచ్చేందుకు తమ కూటమిలోని భాగస్వామ్య పక్షాలను అనుమతించామని పేర్కొన్నారు. ఏఐఏడీఎంకే పార్టీకి చెందిన కొందరు నేతలు డీఎంకేలో చేరిక సందర్భంగా చెన్నైలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో స్టాలిన్ ఈ విధంగా మాట్లాడారు.
‘టీవీకేతో వెళ్లే విషయాన్ని కూటమిలోని కొన్ని పార్టీలు తన దృష్టికి తీసుకురాగా…‘మీరు వెళ్లొచ్చు. అది మీ ఇష్టం…ప్రజాస్వామ్యం కల్పించిన హక్కు. మిమ్మల్ని ఆపను’ అని చెప్పాను. అలా చేయకపోతే తమిళనాడులో బీజేపీ పాలనకు మార్గం సుగమం అయ్యేది’ అని స్టాలిన్ అన్నారు.
కూటమిలోని పార్టీల మద్దతుతోనే ప్రభుత్వం నడుస్తోంది…
తమ కూటమిలోని పార్టీలు మద్దతు ఇవ్వడం వల్లే ప్రస్తుత ప్రభుత్వం నడుస్తోందని స్టాలిన్ పేర్కొన్నారు. డీఎంకే అధికారంలోకి రావాలనే ఆ పార్టీలు కోరుకున్నాయని, అందుకే తమతో పొత్తు పెట్టుకున్నాయని అన్నారు. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు తమ పార్టీని నిరుత్సాహపరచలేవని, ప్రతిపక్షంలో ఉంటూనే ప్రజలకు సేవ చేస్తామన్నారు.


