ముదిగుబ్బ సిపిఐ పార్టీ మండల కార్యదర్శి చల్లా శ్రీనివాసులు
విశాలాంధ్ర ముదిగుబ్బ/ధర్మవరం : ధర్మవరం నియోజకవర్గంలోని ముదిగుబ్బ మండల కేంద్రంలో నాలుగు కిలోమీటర్ల దూరంలో గుట్టంపల్లి తాండ గ్రామం వద్ద జరుగుతున్న జిల్లేడు బండ ప్రాజెక్టు నిర్మాణంలో భాగంగా భూములను నష్టపోయిన రైతన్నలకు తక్షణమే నష్టపరిహారం అందించాలని ముదిగుబ్బ సిపిఐ మండల కార్యదర్శి చల్లా శ్రీనివాసులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా వారు విలేకరులతో మాట్లాడుతూ ముదిగుబ్బ,బుక్కపట్నం మండలాల పరిధిలోని పలు గ్రామాలకు సాగునీరు, త్రాగునీరు అందించడంలో భాగంగా 2020 సంవత్సరంలో అప్పటి వైసిపి ప్రభుత్వం 680 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో 2 1/2 టీఎంసీ నీటి సామర్ధ్యంతోఈ నిర్మాణ పనులు ప్రారంభించి కేవలం 150 కోట్ల రూపాయలు మాత్రమే ఖర్చు పెట్టి అనంతరం గత మూడేళ్ల నుంచి ఎక్కడి పనులు అక్కడే నిలిపివేసి డ్యామ్ నిర్మాణ పనులను పూర్తి చేయకపోవడమే గాక భూములు కోల్పోయిన రైతన్నలకు కూడా నేటికీ ఒక్క రూపాయి కూడా నష్టపరిహారం చెల్లించకపోవడం దారుణమని వారు తీవ్రంగా విమర్శించారు.ఈ నేపథ్యంలో ఇటీవల రాష్ట్ర మంత్రి సత్య కుమార్ యాదవ్ తో పాటు టిడిపి ధర్మవరం నియోజకవర్గ ఇంచార్జ్ పరిటాల శ్రీరామ్ తదితరులు రాష్ట్ర నీటిపారుల శాఖ మంత్రి రామానాయుడు కు
ఈ జిల్లేడు బండ ప్రాజెక్టు పరిస్థితి గురించి విన్నవించడంతోపాటు
ఈ ప్రాజెక్టు దుస్థితి, రైతుల నష్టపరిహారం గురించి పత్రికల్లో కూడా తరచూ కథనాలు వస్తున్నా నేటికీ ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పందన రాకపోవడం విచారకరమన్నారు. కనుక కూటమి ప్రభుత్వం తక్షణమే స్పందించి
ఈ ప్రాజెక్టు నిర్మాణ పనులను పునః ప్రారంభించడమే గాక రైతన్నలకు తగినంత నష్టపరిహారం అందించడానికి చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఆయన డిమాండ్ చేశారు.లేని పక్షంలో భూములు నష్టపోయిన రైతులతో కలిసి సిపిఐ పార్టీ రైతు సంఘం ఆధ్వర్యంలో త్వరలోనే సత్యసాయి జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం చేపడతామని హెచ్చరించారు.


