పల్ల వెంకన్న చారిటబుల్ ట్రస్ట్ సేవలు ఆదర్శనీయం


–జిల్లా విద్యాశాఖాధికారి

విశాలాంధ్ర – కడియం : పల్ల వెంకన్న చారిటబుల్ ట్రస్ట్ సేవలు ఆదర్శనీయమని తూర్పుగోదావరి జిల్లా విద్యాశాఖాధికారి కె వాసుదేవరావు అన్నారు. దివంగత పల్ల వెంకన్న 90 వ జయంతి సందర్భంగా కడియపులంకలో ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం జరిగిన కార్యక్రమంలో వాసుదేవరావు మాట్లాడుతూ జిల్లా విద్యాశాఖకు పల్ల వెంకన్న చారిటబుల్ ట్రస్ట్ అందిస్తున్న సహాయ సహకారాలు విలువ కట్టలేనివని పేర్కొన్నారు. ఉత్తమ ర్యాంకులు సాధించిన విద్యార్థులను ప్రోత్సహిస్తూ 1, 50, 000 రూపాయలు నగదు బహుమతులతో పాటు, ప్రశంసా పత్రాలు, జ్ఞాపకాలు అందించడం ఒక గొప్ప కార్యక్రమం అని కొనియాడారు. ఏపిఐఐసి డైరెక్టర్ మార్గాని సత్యనారాయణ మాట్లాడుతూ పల్ల వెంకన్న చారిటబుల్ ట్రస్ట్ పాఠశాలల అభివృద్ధికి, దేవాలయాల నిర్మాణానికి చేస్తున్న సేవలు ప్రశంసనీయమన్నారు. మాజీ సర్పంచ్ పాటంశెట్టి రాంజీ మాట్లాడుతూ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు పల్లా వెంకన్న జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల అని నామకరణం చేయాలని సూచించారు. పల్ల వెంకన్న చారిటబుల్ ట్రస్ట్ సభ్యులు పల్ల సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ మా నాన్న ఆశయాలను ముందుకు తీసుకు వెళతామని, జిల్లా స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు పోటీలు నిర్వహించి ప్రతిభావంతులైన విద్యార్థులను ప్రోత్సహించాలన్నదే మా ట్రస్ట్ ఆశయమన్నారు. ఈ సందర్భంగా వక్తలు చిలుకూరి శ్రీనివాసరావు, సొసైటీ అధ్యక్షులు గట్టి నరసయ్య, పంతం గణపతి, తాడాల చక్రవర్తి, బొరుసు సుబ్రహ్మణ్యం, తిరుమలశెట్టి శ్రీనివాస్, జగదీశ్వర్రావు, సుబ్రమణ్యం తదితరులు మాట్లాడుతూ పల్ల వెంకన్న ట్రస్ట్ సేవా కార్యక్రమాల్ని కొనియాడారు. జిల్లా స్థాయిలో 10వ తరగతి ప్రథమ స్థానం సాధించిన చిన్నారులకు 10,000, మండలంలో ఉన్న 10 జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలు, రెండు ప్రభుత్వ జూనియర్ కాలేజీలలో ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాలు సాధించిన విద్యార్థులకు 10,000, 7500, 5000 రూపాయలు అందజేశారు. అలాగే జిల్లాస్థాయి వ్యాసరచన, డ్రాయింగ్, వక్తృత్వం పోటీల్లో విజేతలకు 4,000, 2500, 2000 నగదు బహుమతులు అందజేశారు. పారిశుద్ధ్య కార్మికులను ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమానికి వ్యాఖ్యాతగా వ్యవహరించి, ఆధ్యంతం రక్తి కట్టించిన గొల్లపల్లి సత్యనారాయణ మాస్టర్ ను ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ అధ్యక్షులు పల్ల వీర వెంకట సత్యనారాయణ, ట్రస్ట్ సభ్యులు పల్ల గణపతి, పాటశెట్టి శ్రీనివాస్ చక్రవర్తి, పల్ల వినయ్, పల్ల వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *