ఆంధ్రప్రదేశ్‌లో నిమ్మకాయల ధరలు ఒక్కసారిగా భారీగా పెరిగి వినియోగదారులను ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి. ముఖ్యంగా నెల్లూరు జిల్లాలోని గూడూరు మార్కెట్‌లో ధరలు రికార్డు స్థాయికి చేరుకున్నాయి. అక్కడ 50 కిలోల నిమ్మకాయల బస్తా ధర ఏకంగా 10 వేల రూపాయల వరకు పలుకుతోంది. గత కొన్ని రోజులుగా ధరలు క్రమంగా పెరుగుతూ ఈ స్థాయికి చేరడం గమనార్హం.
గత వారంతో పోల్చితే నిమ్మకాయల ధరలు గణనీయంగా పెరిగాయి. క్రితం వారం కిలో నిమ్మకాయలు 130 నుంచి 150 రూపాయల మధ్య ఉండగా,ప్రస్తుతం 200 రూపాయల మార్కును తాకాయి.ఎండలు తీవ్రంగా పెరగడంతో ప్రజలు చల్లని పానీయాల కోసం నిమ్మరసం వినియోగం పెంచుతున్నారు.
దీంతో మార్కెట్‌లో డిమాండ్ ఒక్కసారిగా పెరిగి,ధరలు కూడా అదే స్థాయిలో ఎగసిపడ్డాయి.
దిగుబడి తగ్గుదలే ప్రధాన కారణం
నిమ్మకాయల ధరలు పెరగడానికి ప్రధాన కారణం మార్కెట్‌కు సరఫరా తగ్గిపోవడమే.ఈ సంవత్సరం దిగుబడి ఆశించిన స్థాయిలో లేకపోవడంతో మార్కెట్‌కు వచ్చే నిమ్మకాయల పరిమాణం తగ్గింది.
ఒకవైపు సరఫరా తక్కువగా ఉండటం,మరోవైపు వేసవి కాలంలో వినియోగం అధికంగా ఉండటం ధరల పెరుగుదలకు దారితీసింది.ఈ పరిస్థితుల్లో నిమ్మ ధరలు సాధారణ ప్రజలకు భారంగా మారాయి.


