Last Updated:
ఆంధ్రప్రదేశ్లో డీజిల్, పెట్రోల్ కొరత తీవ్రం, ఉమ్మడి గోదావరి జిల్లాల్లో బంకుల వద్ద కిలోమీటర్ల క్యూలు, రైతుల సాగు దెబ్బతింది, ప్రభుత్వం వైఫల్యమని విపక్షాల విమర్శ
ఆంధ్రప్రదేశ్లో ఇంధన సెగలు పుడుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా డీజిల్, పెట్రోల్ కొరత సామాన్యుల నుంచి రైతుల వరకు అందరినీ ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. అధికార యంత్రాంగం “కొరత లేదు” అని ప్రకటనలు గుప్పిస్తున్నప్పటికీ, క్షేత్రస్థాయిలో వాస్తవ పరిస్థితులు మాత్రం అందుకు భిన్నంగా ఉన్నాయి. ముఖ్యంగా ఉమ్మడి గోదావరి జిల్లాల్లో పరిస్థితి దారుణంగా మారింది. ఇంధనం కోసం కిలోమీటర్ల మేర బారులు తీరుతున్న వాహనాలు, ‘నో స్టాక్’ బోర్డులతో దర్శనమిస్తున్న బంకులు ఏపీలో నెలకొన్న ఇంధన సంక్షోభానికి అద్దం పడుతున్నాయి.
రాజమండ్రి కేంద్రంగా గత మూడు రోజులుగా పెట్రోల్ బంకుల వద్ద దృశ్యాలు చూస్తుంటే “వామ్మో” అనక తప్పడం లేదు. ఆటోలు, మోటార్ సైకిళ్లు, కార్లు.. ఇలా వాహనం ఏదైనా గంటల తరబడి క్యూ లైన్లలో వేచి ఉండాల్సిన పరిస్థితి నెలకొంది. తెల్లవారుజామున ఖాళీగా ఉంటుందని వెళ్తే, అక్కడ అప్పటికే కిలోమీటర్ల మేర వాహనాలు నిలబడి ఉండటం వాహనచోదకులను ఆందోళనకు గురిచేస్తోంది.
కొన్ని బంకుల్లో “నో డీజిల్” అని బోర్డులు పెడితే, మరికొన్ని చోట్ల పెట్రోల్ అయిపోయిందని బంకులను పూర్తిగా మూసివేశారు. డాక్టర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో స్వయంగా కలెక్టర్ గారు “డీజిల్ కొరత లేదు” అని హామీ ఇచ్చినప్పటికీ, బంకుల వద్ద జనం ఎగబడటం తగ్గడం లేదు.
ప్రస్తుత సంక్షోభానికి ప్రధాన కారణం ఇంధనంపై వస్తున్న అపోహలేనని అధికార యంత్రాంగం ‘ఆఫ్ ద రికార్డు’గా చెబుతోంది. రేపు డీజిల్ దొరకదు అన్న భయంతో ప్రజలు తమ అవసరానికి మించి ఇంధనాన్ని నిల్వ చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. సాధారణంగా వంద, రెండు వందల రూపాయల పెట్రోల్ కొట్టించే వారు ఇప్పుడు ఫుల్ ట్యాంక్ చేయించుకుంటున్నారు. ఇంధనం నిండుకుందన్న చిన్న వార్త సోషల్ మీడియాలో దావానంలా వ్యాపిస్తోంది. దీంతో ఒక్కసారిగా జనం బంకులకు పోటెత్తడం వల్ల ఉన్న స్టాక్ కూడా గంటల్లోనే ఖాళీ అవుతోంది.
మరోవైపు, ఈ డీజిల్ కొరత వ్యవసాయ రంగంపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ప్రస్తుతం వరి సాగు పనులు ప్రారంభమయ్యే సమయం కావడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ఒక్కో ఎకరా పొలాన్ని ట్రాక్టర్ ద్వారా దున్నాలంటే కనీసం 10 లీటర్లకు పైగా డీజిల్ అవసరమని రైతులు చెబుతున్నారు.
ట్రాక్టర్లు తీసుకుని లైన్లలో నిలబడలేక, ప్లాస్టిక్ డబ్బాలతో బంకుల వద్ద రైతులు బారులు తీరుతున్నారు. చేతికి అందవచ్చిన సాగు సమయం వృధా అవుతుందని, డీజిల్ దొరకకపోతే సాగు పనులు ఆగిపోయే ప్రమాదం ఉందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
నిన్న మొన్నటి వరకు గ్యాస్ సిలిండర్ల కొరతతో ప్రజలు, ముఖ్యంగా హోటల్ వ్యాపారులు ఇబ్బందులు పడ్డారు. గ్యాస్ సమస్య ఇంకా పూర్తిగా సర్దుమణగక ముందే ఇప్పుడు డీజిల్, పెట్రోల్ సమస్య తెరపైకి రావడం ప్రభుత్వ వైఫల్యంగా విపక్షాలు విమర్శిస్తున్నాయి. సరైన పర్యవేక్షణ లేకపోవడం, ఆయిల్ కంపెనీలతో సమన్వయ లోపం వల్లే ఈ పరిస్థితి ఏర్పడిందన్న వాదనలు వినిపిస్తున్నాయి.
ఆంధ్రప్రదేశ్లోని ముఖ్యమైన వార్తలు, లేటెస్ట్ న్యూస్, స్థానిక వార్తలు, ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ప్రకటనలు, అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించిన స్టోరీలను న్యూస్18 తెలుగు ఆంధ్రప్రదేశ్ కేటగిరీలో చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.
Hyderabad,Telangana
Apr 26, 2026 11:22 AM IST


