ఎన్‌ఐఏ ఛార్జ్షీట్‌లో హఫీజ్ సయీద్ పేరు
న్యూదిల్లీ: పహల్గాం ఉగ్రదాడికి సంబంధించిన దర్యాప్తులో కీలక పరిణామం చోటుచేసుకుంది. దాడికి ప్రధాన సూత్రధారి లష్కరే తోయిబాయే అని జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) స్పష్టం చేసింది. ఆధారాలతో సహా చార్జ్‌షీట్‌లో బహిర్గతం చేసింది. ఈ ఘటనలో లష్కరే తోయిబా వ్యవస్థాపకుడు హఫీజ్ సయీద్ను ప్రధాన కారకుడుగా పేర్కొంటూ ఎన్‌ఐఏ సోమవారం అనుబంధ ఛార్జిషీట్ దాఖలు చేసింది. ఈ దాడికి ఉగ్రవాదులను ఆదేశించడం దగ్గర్‌నుంచి…కుట్రకు ప్రణాళిక రూపొందించడం, దాన్ని అమలు చేసేలా సయీద్ ఎప్పటికప్పుడు సమీక్షించినట్లు ఆధారాలున్నాయని ఎన్‌ఐఏ తన చార్¨ షీట్‌లో పేర్కొంది. పహల్గాం ఉగ్రదాడి కేసులో ఇప్పటికే 1597 పేజీల ఛార్జిషీట్‌ను ఎన్‌ఐఏ కోర్టుకు సమర్పించింది. దీనికి అనుబంధంగా నేడు మరోసారి అభియోగపత్రాలను దాఖలు చేసింది. ఇందులో సీమాంతర ఉగ్రవాదం, హఫీజ్ సయీద్ పాత్ర, ఉగ్రవాదులకు పాక్ అండ వంటి అంశాలను పొందుపర్చింది. గతేడాది డిసెంబరు 15న దాఖలైన తొలి ఛార్జిషీట్‌లో పాకిస్థానీ హ్యాండ్లర్ సాజిద్‌తో పాటు, 2025 జులైలో జరిగిన ఆపరేషన్ మహాదేవ్లో భద్రతా బలగాలు హతమార్చిన ముగ్గురు ఉగ్రవాదులు, అరెస్టయిన ఇద్దరు నిందితులను ఎన్‌ఐఏ పేర్కొంది. దాడిలో లష్కరే తయ్యిబా, దాని అనుబంధ సంస్థ అయిన టీఆర్‌ఎఫ్ సంస్థల పాత్ర గురించి అభియోగపత్రంలో చేర్చింది. జమ్మూకశ్మీర్‌లోని పహల్గాంలో ఏప్రిల్ 22, 2025న జరిగిన ఉగ్రదాడిలో 26 మంది మృతి చెందిన విషయం తెలిసిందే.


