Last Updated:
చిత్తూరు వన్‌టౌన్ సీఐ మహేశ్వర బెట్టింగ్ మామూల్ల ఆరోపణలతో సస్పెండ్, ఎస్పీ తుషార్ డూడీ జీరో టాలరెన్స్ నడుమ ఘటన సంచలనం, పోలీస్ విశ్వసనీయతపై చర్చ
చిత్తూరు పోలీస్ విభాగంలో ఒక్కసారిగా కలకలం రేపిన ఘటన చోటుచేసుకుంది. వన్‌టౌన్ సీఐగా పనిచేస్తున్న మహేశ్వరపై తీవ్ర ఆరోపణలు వెల్లువెత్తడంతో ఆయనను ఉన్నతాధికారులు సస్పెండ్ చేయడం సంచలనంగా మారింది. జిల్లా ఎస్పీ తుషార్ డూడీ బెట్టింగ్, లాటరీలపై కఠిన వైఖరి అవలంబిస్తూ “జీరో టాలరెన్స్” విధానాన్ని అమలు చేస్తున్న సమయంలో ఈ పరిణామం చోటుచేసుకోవడం మరింత షాకింగ్‌గా నిలిచింది. బెట్టింగ్ కారణంగా కుటుంబాలు ఆర్థికంగా నాశనం అవుతున్నాయని పదేపదే హెచ్చరిస్తూ, ప్రజల్లో అవగాహన కల్పిస్తున్న ఆయన, పోలీసు అధికారులను కూడా అప్రమత్తం చేస్తున్నారు. ఇప్పటికే పలుచోట్ల నిఘా పెంచి, దాడులు కూడా నిర్వహించారు.
అయితే ఇదే సమయంలో వన్‌టౌన్ సీఐ మహేశ్వర వ్యవహారం వెలుగులోకి రావడం తీవ్ర చర్చకు దారి తీసింది. ఐపీఎల్ సీజన్‌కు ముందే నగరంలోని బెట్టింగ్ నిర్వాహకులను ఆయన పిలిపించుకుని, వారి కార్యకలాపాలపై పూర్తి సమాచారం సేకరించినట్లు తెలుస్తోంది. గత అనుభవాలను గుర్తు చేస్తూ, బెట్టింగ్ ద్వారా వచ్చే లాభాలు, బుకీల వివరాలు తెలుసుకున్న ఆయన, వారి కార్యకలాపాలకు అనుమతిగా భారీ మొత్తంలో మామూల్లు తీసుకున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
ఈ సమాచారం ఉన్నతాధికారుల దృష్టికి చేరడంతో, వెంటనే చర్యలు ప్రారంభమయ్యాయి. ఇటీవల నిర్వహించిన దాడుల్లో 16 మందిని అదుపులోకి తీసుకుని విచారించగా, ఏడుగురిపై కేసులు నమోదు చేశారు. ఈ క్రమంలో సీఐ పాత్రపై కూడా ప్రత్యేకంగా విచారణ జరిపిన అధికారులు, ఆయనపై వచ్చిన ఆరోపణలను తీవ్రంగా పరిగణించి సస్పెన్షన్ వేటు వేశారు.
ఇక మహేశ్వరపై ఇది మొదటి వివాదం కాదు. గతంలో నగరిలో పనిచేసిన సమయంలో కూడా అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్న ఆయనపై అప్పటి ఎమ్మెల్యే గాలి భానుప్రకాష్ ఫిర్యాదు చేయడంతో లూప్లైన్కు బదిలీ చేశారు. అనంతరం కొంతకాలానికే మళ్లీ చిత్తూరులో వన్‌టౌన్ సీఐగా నియమితులైన ఆయన, ఇప్పుడు మరోసారి వివాదాల్లో చిక్కుకుని సస్పెండ్ కావడం విశేషం.
ఈ ఘటనతో పోలీస్ శాఖలో అంతర్గత కట్టుదిట్టతపై చర్చ మొదలైంది. ఒకవైపు బెట్టింగ్‌పై కఠిన చర్యలు కొనసాగుతుండగా, మరోవైపు ఇలాంటి ఆరోపణలు రావడం ప్రజల్లో నమ్మకాన్ని దెబ్బతీసే ప్రమాదం ఉందని విశ్లేషకులు చెబుతున్నారు. ఇకపై ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉన్నతాధికారులు మరింత కఠినంగా వ్యవహరించే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ఆంధ్రప్రదేశ్‌లోని ముఖ్యమైన వార్తలు, లేటెస్ట్ న్యూస్, స్థానిక వార్తలు, ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ప్రకటనలు, అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించిన స్టోరీలను న్యూస్18 తెలుగు ఆంధ్రప్రదేశ్ కేటగిరీలో చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.
Chittoor,Chittoor,Andhra Pradesh



