ప్రారంభంలో వరాల జల్లులు… ముగింపులో ఫీజులు ముక్కుపిండి!…..
విశాలాంధ్ర – నార్పల :- మండలంలో ప్రైవేట్ పాఠశాలల వ్యవహారం వివాదాస్పదంగా మారుతోంది. ప్రతి విద్యా సంవత్సరం ప్రారంభంలో పాత్రికేయుల పిల్లలకు ఫీజు మినహాయింపు ఉంటుందని జిల్లా కలెక్టర్, విద్యాశాఖ అధికారులు హామీలు ఇస్తుండగా, విద్యా సంవత్సరం ముగిసే సరికి పాఠశాల యాజమాన్యాలు అలాంటి మినహాయింపులు ఏవీ లేవని చెబుతూ ఫీజులు ముక్కు పిండి వసూలు చేస్తున్న ఘటనలు షరా మామూలుగా మారాయి.ఈ సమస్యను పాత్రికేయులు పలుమార్లు విద్యాధికారుల దృష్టికి తీసుకెళ్లినా ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం పట్ల సీనియర్ జర్నలిస్టులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సమాజ సమస్యలపై ప్రశ్నించే పాత్రికేయుల పరిస్థితి ఇలా ఉంటే, సాధారణ తల్లిదండ్రుల పరిస్థితి ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు.ప్రశ్నించిన వారికి “మీకు నచ్చిన చోట ఫిర్యాదు చేసుకోండి” అంటూ పాఠశాల యాజమాన్యాలు బహిరంగంగానే సవాల్ విసురుతున్నట్లు విశ్వసనీయ సమాచారం. విద్యా సంవత్సరం ప్రారంభంలో రసీదులు ఇవ్వకుండా పుస్తకాలు, యూనిఫామ్‌ల పేరుతో వేల రూపాయలు వసూలు చేయడం కూడా బహిరంగ రహస్యంగా మారింది.ఇక స్థానిక విద్యాధికారుల వైఖరి కూడా ప్రశ్నార్థకంగా మారింది. ఇతర పాఠశాలల విషయంలో వెంటనే స్పందించే అధికారులు, ఒక్క పాఠశాల విషయంలో మాత్రం చర్యలకు వెనుకడుగు వేస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. రాజకీయ పలుకుబడి, స్థానిక ప్రభావం కారణంగా అధికారులపై ఒత్తిడి తెచ్చి చర్యలు ఆపిస్తున్నారని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ అంశంపై విద్యాశాఖ మంత్రి నారా లోకేష్, జిల్లా కలెక్టర్, జిల్లా విద్యాధికారులు వెంటనే స్పందించి కఠిన చర్యలు తీసుకోవాలని పాత్రికేయులు డిమాండ్ చేస్తున్నారు.
The post హామీలు మాటల్లోనే… ఫీజులు మాత్రం కఠినంగా వసూలు!……. appeared first on Visalaandhra.


