ఆరోగ్యం కోసం కోలాటం.. మహిళల్లో కొత్త ట్రెండ్‌గా మారిన సంప్రదాయం..! | ఈస్ట్ గోదావరి వార్తలు (East Godavari News)


Last Updated:

కాకినాడ గోదావరి జిల్లాల్లో మహిళలు కోలాటాన్ని ఆధ్యాత్మిక వినోదం నుంచి పూర్తి వ్యాయామంగా మార్చి బీపీ షుగర్ నియంత్రణతో ఆరోగ్య సంరక్షణకు వినియోగిస్తున్నారు

+

ఇలా

ఇలా కోలాటం చేస్తే మీఆరోగ్యానికి డోకా లేదు

మహిళలు కేవలం వంటింటికే పరిమితమైతే ఆరోగ్య సమస్యలు తప్పవని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ప్రతిరోజూ కనీసం 30 నిమిషాలు వాకింగ్ లేదా యోగా చేయాలని సూచిస్తున్న ఈ సమయంలో, ఆధ్యాత్మికత, ఆహ్లాదం, ఆరోగ్యం మూడు కలిసేలా ఒక ప్రత్యేక కార్యక్రమం మహిళల్లో కొత్త ఉత్సాహాన్ని నింపుతోంది. పాతకాలపు సంప్రదాయమైన కోలాటాన్ని ఆధునిక అవసరాలకు అనుగుణంగా మార్చుకుని, ఆరోగ్య సాధనంగా ఉపయోగించుకుంటూ కాకినాడ జిల్లాలో మహిళలు ముందుకు రావడం విశేషంగా మారింది.

దేవాలయాల్లో జరిగే జాతరలు, పూజలు, వివాహ వేడుకల్లో కోలాటం ఒక సాధారణ అంశంగా మారింది. గతంలో మగవారు ఎక్కువగా పాల్గొనేవారు, కానీ ఇప్పుడు మహిళలే పెద్ద సంఖ్యలో కోలాట బృందాలుగా ఏర్పడి ఈ కళను కొనసాగిస్తున్నారు. ముఖ్యంగా డబ్బుల కోసం కాకుండా సేవాభావంతో ముందుకు వస్తున్న మహిళా బృందాలు గోదావరి జిల్లాలో ప్రత్యేక గుర్తింపు పొందుతున్నాయి.

కోలాటం కేవలం వినోదం మాత్రమే కాదు, అది ఒక సంపూర్ణ వ్యాయామం అని కోలాట గురువు రాజ్యలక్ష్మి చెబుతున్నారు. దైవసన్నిధిలో సేవ చేస్తున్నామనే ఆధ్యాత్మిక తృప్తి ఒక వైపు ఉంటే, మరోవైపు శారీరక ఆరోగ్యానికి ఇది ఎంతో మేలు చేస్తుందని ఆమె వివరించారు. సాధారణంగా గంటకు పైగా జరిగే కోలాటంలో చేతులు, కాళ్లు, శరీరమంతా కదలడం వల్ల ఇది ఒక పూర్తి శరీర వ్యాయామంగా మారుతుందని పేర్కొన్నారు.

ఈ ప్రక్రియలో శరీరానికి మంచి శ్రమ కలుగుతుందని, దీని ద్వారా బీపీ, షుగర్ వంటి సమస్యలను నియంత్రించవచ్చని ఆమె తెలిపారు. కనీసం వారానికి ఒక్కసారైనా కోలాటంలో పాల్గొంటే శారీరకంగా, మానసికంగా ఉత్సాహం పెరుగుతుందని చెప్పారు. ఆధ్యాత్మిక ఊరేగింపుల్లో పాల్గొంటూ వ్యాయామం చేయడం వల్ల ఆనందం, ఆరోగ్యం రెండూ కలిసి వస్తాయని వివరించారు. కాకినాడ జిల్లాలో మహిళలను ఈ దిశగా ప్రోత్సహిస్తూ ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. కోలాటం ద్వారా ఆరోగ్యాన్ని కాపాడుకోవడంతో పాటు సంప్రదాయాలను కూడా కాపాడుతున్నామని మహిళలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ఈ కార్యక్రమాలు మంచి స్పందన పొందుతున్నాయి.

ప్రస్తుతం వేగంగా మారుతున్న జీవనశైలిలో మహిళలు తమ ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయకుండా ఇలాంటి సంప్రదాయాల ద్వారా శ్రద్ధ పెట్టడం అవసరమని నిపుణులు సూచిస్తున్నారు. కోలాటం లాంటి కార్యక్రమాలు కేవలం శరీరానికే కాదు, మనసుకు కూడా ఉపశమనం ఇస్తాయని చెబుతున్నారు. మొత్తానికి పాత సంస్కృతిని కొత్త కోణంలో ఉపయోగించుకుంటూ మహిళలు ఆరోగ్యవంతమైన జీవనశైలికి బాటలు వేస్తున్నారు. కోలాటం ఇప్పుడు కేవలం ఒక కళ కాదు.. మహిళల ఆరోగ్యానికి ఒక కొత్త మార్గంగా మారుతోంది.

Click here to add News18 as your preferred news source on Google.

ఆంధ్రప్రదేశ్‌లోని ముఖ్యమైన వార్తలు, లేటెస్ట్ న్యూస్, స్థానిక వార్తలు, ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ప్రకటనలు, అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించిన స్టోరీలను న్యూస్18 తెలుగు ఆంధ్రప్రదేశ్ కేటగిరీలో చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *