విశాలాంధ్ర, ఉరవకొండ (అనంతపురం జిల్లా) : భక్తుల సౌకర్యం, విశ్వాస పరిరక్షణను దృష్టిలో ఉంచుకుని పెన్నహోబిలంలోని శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం కీలక నిర్ణయం తీసుకుంది. స్వామివారి లడ్డు ప్రసాదాన్ని ఇకపై దేవస్థానం ఆవరణంలోనే శుచిశుభ్రతతో, అత్యున్నత నాణ్యత ప్రమాణాలతో తయారు చేయనున్నట్లు ఆలయ కమిటీ చైర్మన్ శ్రీ రేగాటి నాగరాజు ప్రకటించారు. గురువారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ దేవస్థాన ప్రతిష్టను మరింతగా పెంపొందించడమే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన తెలిపారు. ఆలయ కమిటీ సభ్యులు, కార్యనిర్వాహణాధికారి సమక్షంలో నిర్వహించిన సమావేశంలో విస్తృతంగా చర్చించిన అనంతరం ఈ నిర్ణయానికి వచ్చినట్లు వివరించారు. ప్రస్తుతం భక్తులకు అందించే ప్రసాదంపై మరింత నాణ్యత, పవిత్రతను తీసుకురావాల్సిన అవసరం ఉందని భావించిన కమిటీ, వేదోక్త విధానాలతో బ్రాహ్మణుల చేత తయారు చేసే విధంగా ప్రత్యేక చర్యలు చేపట్టిందని చెప్పారు. ప్రసాదం తయారీ ప్రక్రియలో శుభ్రత, ప్రమాణాలు, సంప్రదాయ విధానాలు కచ్చితంగా పాటించేలా పర్యవేక్షణ వ్యవస్థను కూడా ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు.“భక్తులు స్వామివారి దర్శనం తర్వాత పొందే ప్రసాదం అతని విశ్వాసానికి ప్రతీక. ఆ విశ్వాసాన్ని నిలబెట్టడం మా బాధ్యత” అని చైర్మన్ నాగరాజు స్పష్టం చేశారు. ఇకపై భక్తులు ఆలయ ప్రాంగణంలోనే తయారయ్యే శుభ్రమైన, రుచికరమైన, పవిత్రమైన లడ్డు ప్రసాదాన్ని సులభంగా పొందగలరని తెలిపారు. ఈ కొత్త విధానం త్వరలోనే అమల్లోకి రానుందని వెల్లడించారు. ఈ చర్యలతో భక్తుల్లో దేవస్థానంపై నమ్మకం మరింత బలపడటంతో పాటు, పెన్నహోబిలం దేవస్థానం రాష్ట్రవ్యాప్తంగా మరింత ప్రత్యేక గుర్తింపు పొందుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ విలేకరు సమావేశంలో ఆలయ కార్య నిర్వహణ అధికారి సాకే రమేష్ బాబు పాల్గొన్నారు.


