YS Jagan: మహిళల పట్ల అవమానకర వ్యాఖ్యలు.. వైఎస్ జగన్ తీవ్ర ఆగ్రహం | ఆంధ్రప్రదేశ్ వార్తలు


Last Updated:

YS Jagan: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అధికార కూటమి నాయకుల ప్రవర్తన, మీడియా ప్రతినిధుల వ్యాఖ్యలు మహిళల గౌరవానికి భంగం కలిగించేలా ఉన్నాయని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మండిపడ్డారు.

ys jagan
ys jagan

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అధికార కూటమి నాయకుల ప్రవర్తన, మీడియా ప్రతినిధుల వ్యాఖ్యలు మహిళల గౌరవానికి భంగం కలిగించేలా ఉన్నాయని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మండిపడ్డారు. బుధవారం తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన తాడేపల్లిగూడెం నియోజకవర్గ స్థాయి కేడర్ సమావేశంలో ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా ఏబీఎన్ ఆంధ్రజ్యోతి అధినేత వేమూరి రాధాకృష్ణ ఇటీవల మహిళలను ఉద్దేశించి చేసిన వివాదాస్పద వ్యాఖ్యలను జగన్ తీవ్రంగా ఖండించారు.

వైఎస్సార్‌సీపీ శ్రేణుల కుటుంబ సభ్యులను, ముఖ్యంగా వారి భార్యల పట్ల రాధాకృష్ణ మాట్లాడిన తీరు అత్యంత దుర్మార్గంగా ఉందని జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. “వైఎస్సార్‌సీపీ నాయకుల భార్యల పట్ల ఇంత నీచంగా మాట్లాడతారా? ఇలాంటి వ్యాఖ్యలు ఒక జర్నలిస్టు స్థాయికి తగునా?” అని ఆయన ప్రశ్నించారు. రాధాకృష్ణ చేసిన వ్యాఖ్యలు తప్పని వారించాల్సింది పోయి.. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, నారా లోకేష్, పవన్ కళ్యాణ్ వంటి వారు వాటిని మౌనంగా సమర్థించడం వారి ద్వంద్వ వైఖరిని సూచిస్తోందని దుయ్యబట్టారు. ఈ ప్రభుత్వానికి మహిళల పట్ల కనీస గౌరవం లేదన్నది ఈ ఘటన ద్వారా స్పష్టమవుతోందని ఆయన విమర్శించారు.

రాష్ట్రంలో కూటమి నేతలు మహిళలను వేధిస్తున్నా ప్రభుత్వం చోద్యం చూస్తోందని జగన్ ఈ సందర్భంగా పలు ఉదంతాలను ప్రస్తావించారు. జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ అరాచకాలను ప్రశ్నించినందుకు ఒక బాధిత మహిళను ఏకంగా పోలీసుల సమక్షంలోనే కొట్టడం దారుణమని ఆయన పేర్కొన్నారు. ఏకంగా ఎస్పీ కార్యాలయంలోకి ఎమ్మెల్యే చొరబడి దౌర్జన్యం చేస్తుంటే, చర్యలు తీసుకోకుండా చంద్రబాబు నాయుడు స్వయంగా పంచాయితీ చేయడం ఏ రకమైన న్యాయమని నిలదీశారు. బాధితులకు అండగా ఉండాల్సిన వ్యవస్థలే వేటగాళ్లకు రక్షణ కల్పిస్తున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

అంతేకాకుండా, కేజీబీవీ ప్రిన్సిపాల్‌ను వేధించిన కూన రవిపై ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని జగన్ గుర్తు చేశారు. మహిళలతో అశ్లీల వీడియో కాల్స్ మాట్లాడి పట్టుబడిన గుంటూరు ఈస్ట్ ఎమ్మెల్యే అహ్మద్‌పై కూడా ప్రభుత్వం మెతక వైఖరి అవలంబిస్తోందని విమర్శించారు. మంత్రి సంధ్యారాణి పీఏ వ్యవహారంలో బాధితురాలైన మహిళపైనే తిరుగు కేసులు పెట్టడం కూటమి పాలనలో జరుగుతున్న అరాచకానికి పరాకాష్ట అని ఆయన ధ్వజమెత్తారు. నిందితులకు శిక్ష పడకపోగా, ప్రశ్నించిన వారిని ఇబ్బందులకు గురిచేయడం ఈ ప్రభుత్వంలో పరిపాటిగా మారిందన్నారు.

ఇవి కూడా చదవండి: YS Jagan: అమరావతి వద్దు.. ‘మావిగన్’ ముద్దు.. రాజధానిపై జగన్ సరికొత్త అస్త్రం

చివరగా, టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు ఒక మహిళ జీవితంతో ఆడుకున్నారన్న ఆరోపణలు వచ్చినా, చంద్రబాబు ఆయనను తన వెంటేసుకుని తిరుగుతున్నారని జగన్ ఎద్దేవా చేశారు. ఉన్నత స్థానాల్లో ఉన్న వ్యక్తులే ఇలాంటి అకృత్యాలకు పాల్పడుతుంటే, వారిని చూసి మిగిలిన నేతలు మరింత బరితెగిస్తున్నారని ఆయన వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో మహిళలకు భద్రత లేని వాతావరణం నెలకొందని, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ మహిళల పక్షాన ఉండి వారి గౌరవం కోసం పోరాడుతుందని జగన్ పార్టీ శ్రేణులకు భరోసా ఇచ్చారు.

Click here to add News18 as your preferred news source on Google.

ఆంధ్రప్రదేశ్‌లోని ముఖ్యమైన వార్తలు, లేటెస్ట్ న్యూస్, స్థానిక వార్తలు, ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ప్రకటనలు, అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించిన స్టోరీలను న్యూస్18 తెలుగు ఆంధ్రప్రదేశ్ కేటగిరీలో చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *