Last Updated:
Tirumala Temple: తిరుమలలో పోలీస్, టీటీడీ విజిలెన్స్ సంయుక్తంగా ఆపరేషన్ వజ్రపహార్ నిర్వహించి దుకాణాలు, వాహనాలు, వ్యక్తులను తనిఖీ చేసి ఉల్లంఘనలపై చర్యలు తీసుకున్నారు
తిరుమల శ్రీవారి ఆలయ పవిత్రతను కాపాడటంతో పాటు భక్తుల భద్రతకు అత్యున్నత ప్రాధాన్యతనిస్తూ, పోలీస్ టీటీడీ విజిలెన్స్ విభాగాలు సంయుక్తంగా ‘ఆపరేషన్ వజ్రపహార్’ పేరుతో భారీ తనిఖీలు చేపట్టాయి. తిరుమల కొండపై అసాంఘిక కార్యకలాపాలకు తావులేకుండా చేయడమే లక్ష్యంగా ఈ ప్రత్యేక నాఖాబందీ కార్యక్రమాన్ని నిర్వహించారు.
జిల్లా ఎస్పీ శ్రీ ఎల్. సుబ్బరాయుడు, ఐపీఎస్, టీటీడీ చీఫ్ విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ ఆఫీసర్ (CVSO) శ్రీ మురళీకృష్ణ, ఐపీఎస్ పర్యవేక్షణలో ఈ ఆపరేషన్ అత్యంత పకడ్బందీగా సాగింది. తిరుమల డీఎస్పీ ప్రత్యక్ష నేతృత్వంలో సుమారు 45 మంది సిబ్బంది రెండు బృందాలుగా విడిపోయి తనిఖీల్లో పాల్గొన్నారు. ఇందులో కేవలం పోలీస్ విభాగమే కాకుండా.. టీటీడీ విజిలెన్స్, అటవీ శాఖ, అగ్నిమాపక దళం, రెవెన్యూ, ఎక్సైజ్ శాఖలు, ఆరోగ్య శాఖ.
బాంబ్ డిస్పోజల్ బృందాలు: భాగస్వామ్యం వహించాయి. ఉదయం 6 గంటల నుంచే ఆకాశగంగ, వేణుగోపాలస్వామి ఆలయం వంటి కీలక పరిసరాల్లో తనిఖీలు మొదలయ్యాయి. ఈ తనిఖీల్లో భాగంగా సుమారు 44 వాణిజ్య దుకాణాలను అధికారులు క్షుణ్ణంగా పరిశీలించారు. ఈ క్రమంలో కొన్ని కీలక ఉల్లంఘనలను గుర్తించి కఠిన చర్యలు తీసుకున్నారు.
సరైన గుర్తింపు పత్రాలు (ID Cards) లేని 18 మందిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. అలాగే 66 మంది వ్యక్తుల వేలిముద్రలను విశ్లేషించి వారి నేపథ్యాన్ని తనిఖీ చేశారు. ఎటువంటి పత్రాలు లేని మూడు వాహనాలను అధికారులు సీజ్ చేశారు. తిరుమల పవిత్ర కొండపై గంజాయి, మద్యం, పొగాకు వంటి వస్తువుల వాడకంపై ఉక్కుపాదం మోపాలని సిబ్బందిని ఆదేశించారు.
ఆపరేషన్ వజ్రపహార్ కేవలం తనిఖీలకే పరిమితం కాకుండా, భవిష్యత్తులో అవాంఛనీయ సంఘటనలు జరగకుండా వ్యాపారులకు పలు సూచనలు జారీ చేశారు. ప్రతి దుకాణంలో విధిగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి, నిరంతర నిఘా ఉంచాలి. షాపుల్లో కొత్తగా చేరే ఉద్యోగుల వివరాలను తప్పనిసరిగా స్థానిక పోలీసు స్టేషన్‌లో నమోదు చేయాలి. అపరిచితులకు లేదా సబ్-లీజులకు దుకాణాలను ఇవ్వకూడదు. భక్తులు లేదా స్థానికులు ఏదైనా అసాధారణ విషయాన్ని గమనిస్తే తక్షణమే 1972 లేదా 112 టోల్ ఫ్రీ నంబర్లకు సమాచారం అందించాలని అవగాహన కల్పించారు.
ఆంధ్రప్రదేశ్‌లోని ముఖ్యమైన వార్తలు, లేటెస్ట్ న్యూస్, స్థానిక వార్తలు, ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ప్రకటనలు, అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించిన స్టోరీలను న్యూస్18 తెలుగు ఆంధ్రప్రదేశ్ కేటగిరీలో చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.
Hyderabad,Telangana
May 03, 2026 11:33 AM IST



