Last Updated:
రాజమండ్రి పరిసరాల్లో సంచరించిన పెద్దపులి రంపచోడవరం వైపు కదలడంతో భయం, అటవీశాఖ ఆపరేషన్ టైగర్ ప్రారంభం, పూణే నిపుణులు, పిసిసిఎఫ్ చలపతిరావు పర్యవేక్షణ
రాజమండ్రి పరిసరాల్లో కొన్నిరోజులుగా ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేసిన పెద్దపులి ఇప్పుడు తన దారి మార్చింది. పాండవులమెట్ట సమీప కొండల్లో తిష్టవేసిన ఈ పులి, గత 24 గంటల్లోనే రంపచోడవరం వైపు కదలడంతో అక్కడి ప్రజల్లో కొత్త ఆందోళన మొదలైంది. పులి మెడలో అమర్చిన డిజిటల్ ట్రాకింగ్ సిగ్నల్ ఆధారంగా అటవీశాఖ అధికారులు ఈ మార్పును ఖచ్చితంగా గుర్తించారు.
రాజమండ్రిలో పరిస్థితి కాస్త సద్దుమణిగినా, దేవీపట్నం మండలం పరిసరాల్లో మాత్రం అలజడి నెలకొంది. పర్యాటక ప్రాంతంగా ప్రసిద్ధి చెందిన ఈ ప్రాంతంలో పులి సంచారం వార్తతో స్థానికులు, పర్యాటకులు అప్రమత్తమయ్యారు. ఎప్పుడెప్పుడు ఏమవుతుందో అనే ఉత్కంఠ వాతావరణం కనిపిస్తోంది.
ఇలాంటి పరిస్థితుల్లో అటవీశాఖ తక్షణమే రంగంలోకి దిగింది. పులిని ఎట్టి పరిస్థితుల్లోనూ సురక్షితంగా బంధించాలనే లక్ష్యంతో నాలుగు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. గతంలో అనుసరించిన విధంగానే మత్తు ఇంజెక్షన్ ద్వారా పట్టుకునే ప్రణాళికతో “ఆపరేషన్ టైగర్”ను ప్రారంభించారు.
ఇది ఒకరోజు సమస్య కాదుగత ఐదు నెలలుగా ఈ పెద్దపులి ఆంధ్రప్రదేశ్‌లో సంచరిస్తూ ప్రజల్లో భయాన్ని సృష్టిస్తోంది. ఒకసారి పశ్చిమగోదావరి, మరోసారి తూర్పుగోదావరి, ఆ తర్వాత గోదావరి దాటి రాజమండ్రి—ఇలా ఎప్పటికప్పుడు తన దారిని మార్చుకుంటూ అధికారులకు సవాల్‌గా మారింది. తాజాగా ఈ పులి పోక్స్‌పేట, రామన్నపాలెం ప్రాంతాల మీదుగా కదులుతోందని సమాచారం. ఇక గంగవరం వైపు వెళ్లే అవకాశం ఉందని అటవీశాఖ అంచనా వేస్తోంది. దీంతో అధికారులు మరింత అప్రమత్తమై ప్రతి కదలికను జాగ్రత్తగా పర్యవేక్షిస్తున్నారు.
ఈ ఆపరేషన్‌లో ప్రత్యేకంగా పూణే నుంచి వచ్చిన నిపుణుల బృందం కూడా పాల్గొంటోంది. పిసిసిఎఫ్ చలపతిరావు స్వయంగా పరిస్థితిని సమీక్షిస్తూ, ఎట్టి పరిస్థితుల్లోనూ పులిని సురక్షితంగా పట్టుకుంటామని స్పష్టం చేశారు. ప్రస్తుతం పులి ఉన్న ప్రాంతాన్ని జల్లెడ పట్టే పనిలో బృందాలు నిమగ్నమయ్యాయి. ఇక ఈ సాయంత్రానికే పులిని బంధించే అవకాశం ఉందా, లేక మరోసారి దారి మళ్లిస్తుందా అన్నది ఉత్కంఠగా మారింది. ఏది ఏమైనా, రంపచోడవరం అడవుల్లో జరుగుతున్న ఈ ఆపరేషన్ ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా ఆసక్తికరంగా మారింది. ప్రజలు మాత్రం ఒక్కటే కోరుకుంటున్నారు.. పులి త్వరగా పట్టుబడి, పరిస్థితి మళ్లీ సాధారణం కావాలని.
ఆంధ్రప్రదేశ్‌లోని ముఖ్యమైన వార్తలు, లేటెస్ట్ న్యూస్, స్థానిక వార్తలు, ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ప్రకటనలు, అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించిన స్టోరీలను న్యూస్18 తెలుగు ఆంధ్రప్రదేశ్ కేటగిరీలో చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.
East Godavari,Andhra Pradesh


