Last Updated:
జవహర్ బాలభవన్ రాజాం వేసవి శిక్షణ తరగతులు, 3 నుంచి 18 ఏళ్ల విద్యార్థులకు ఉచిత కళా కోర్సులు, సర్టిఫికెట్లు, భవిష్యత్ అవకాశాల వివరాలు ఇక్కడ తెలుసుకుందాం
విజయనగరం జిల్లా రాజాం పట్టణంలోని జవహర్ బాలభవన్‌లో ఈ నెల 24వ తేదీ నుంచి వేసవి శిక్షణ తరగతులు నిర్వహించనున్నట్లు సంస్థ డైరెక్టర్ డాక్టర్ సుంకరి రమేష్ తెలిపారు. స్కూల్ ఎడ్యుకేషన్ శాఖ ఆధ్వర్యంలో ఈ శిక్షణా కార్యక్రమాలు చేపడుతున్నట్లు ఆయన వెల్లడించారు. ప్రతిరోజూ ఉదయం 7.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు తరగతులు కొనసాగనున్నాయని తెలిపారు.
విద్యార్థులలో సృజనాత్మకత, ప్రతిభ, నైపుణ్యాలను వెలికితీసే ఉద్దేశంతో ఈ వేసవి శిక్షణ తరగతులను ఉచితంగా నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. తబలా వాయిద్యం, చిత్రలేఖనం, నృత్యం, సంగీతం, కుట్లు, అల్లికలు తదితర విభాగాల్లో ప్రత్యేక శిక్షణ అందించనున్నట్లు తెలిపారు. ప్రతీ విభాగానికి అనుభవజ్ఞులైన శిక్షకులను నియమించి, విద్యార్థులకు ప్రాయోగికంగా నేర్పించనున్నట్లు చెప్పారు. 3 సంవత్సరాల నుంచి 18 సంవత్సరాల లోపు విద్యార్థులు ఈ శిక్షణలో పాల్గొనడానికి అర్హులని డైరెక్టర్ తెలిపారు. ఆసక్తి కలిగిన విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ముందస్తుగా పేర్లు నమోదు చేసుకోవాలని కోరారు. వివరాల కోసం 9553123447, 8341643824 నంబర్లను సంప్రదించవచ్చని సూచించారు.
శిక్షణ పూర్తయిన అనంతరం పాల్గొన్న ప్రతి విద్యార్థికి సర్టిఫికెట్లు అందజేయనున్నట్లు వెల్లడించారు. అలాగే శిక్షణలో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు ప్రత్యేక అవకాశాలు కల్పించనున్నట్లు చెప్పారు. ప్రతీ సంవత్సరం ఇక్కడ శిక్షణ పొందిన ప్రతిభావంతులైన విద్యార్థులను జాతీయ, అంతర్జాతీయ స్థాయి పోటీలకు పంపిస్తున్నామని తెలిపారు.
కళారంగంలో ఆసక్తి ఉన్న విద్యార్థులకు సీరియల్స్, సినిమాలు, టీవీ షోలలో అవకాశాలు కల్పించే దిశగా మార్గనిర్దేశనం చేస్తున్నామని చెప్పారు. మంచి గాత్రం కలిగిన వారికి సంగీత కార్యక్రమాలు, మంచి నటన ప్రతిభ ఉన్నవారికి టీవీ షోలు, నాటకాలు, ఇతర వేదికలపై ప్రోత్సాహం అందిస్తున్నామని వెల్లడి చేశారు.
జవహర్ బాలభవన్‌లో శిక్షణ పొందిన అనేక మంది విద్యార్థులు ప్రస్తుతం వివిధ రంగాల్లో రాణిస్తున్నారని డాక్టర్ రమేష్ పేర్కొన్నారు. విద్యార్థులను ఇన్నోవేటివ్‌గా, క్రియేటివ్‌గా తీర్చిదిద్దడమే తమ లక్ష్యమని తెలిపారు.
రాజాం పరిసర ప్రాంతాల విద్యార్థులు ఈ అరుదైన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని తమ ప్రతిభను అభివృద్ధి చేసుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. వేసవి సెలవులను వినోదంతో పాటు విద్యా, కళా అభివృద్ధికి ఉపయోగపడేలా ఈ శిక్షణ తరగతులు ఎంతో దోహదపడతాయని తల్లిదండ్రులు అభిప్రాయపడుతున్నారు.
ఆంధ్రప్రదేశ్‌లోని ముఖ్యమైన వార్తలు, లేటెస్ట్ న్యూస్, స్థానిక వార్తలు, ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ప్రకటనలు, అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించిన స్టోరీలను న్యూస్18 తెలుగు ఆంధ్రప్రదేశ్ కేటగిరీలో చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.
Hyderabad,Telangana


