Rajiv Gandhi: ఆ జిల్లాలో ‘రాజీవ్ గాంధీ’ వర్ధంతి వేడుకలకు దూరంగా కాంగ్రెస్ నేతలు.. అసలు కారణం ఏంటంటే.. | చిత్తూరు వార్తలు (Chittoor News)


Last Updated:

రాజీవ్ గాంధీ వర్ధంతి సందర్భంగా దేశంలో కాంగ్రెస్ ఘన నివాళులు, కానీ చిత్తూరులో విగ్రహం వద్ద నేతలు గైర్హాజరు, జిల్లా కాంగ్రెస్ బలహీనతపై రాజకీయ వర్గాల్లో చర్చ

News18
News18

భారత మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ వర్ధంతి సందర్భంగా దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ నేతలు, కార్యకర్తలు ఘనంగా నివాళులు అర్పించారు. ఢిల్లీ నుంచి రాష్ట్ర స్థాయి వరకు పలు చోట్ల స్మారక కార్యక్రమాలు నిర్వహిస్తూ ఆయన సేవలను స్మరించుకున్నారు. అయితే ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరు జిల్లా కేంద్రంలో మాత్రం పూర్తిగా భిన్నమైన పరిస్థితి కనిపించింది. జిల్లా కేంద్రంలో ఉన్న రాజీవ్ గాంధీ విగ్రహం వద్ద ఒక్క కాంగ్రెస్ నాయకుడు కనిపించకపోవడం రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీసింది.

ప్రతి సంవత్సరం మే 21న రాజీవ్ గాంధీ వర్ధంతి సందర్భంగా కాంగ్రెస్ పార్టీ తరఫున జిల్లా కేంద్రాలు, పట్టణాలు, మండల స్థాయిల్లో నివాళి కార్యక్రమాలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. ముఖ్యంగా రాజీవ్ గాంధీ వంటి జాతీయ నాయకుడి వర్ధంతి రోజున పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొని పూలమాలలు వేసి నివాళులు అర్పించడం సాధారణంగా కనిపించే విషయం. కానీ ఈసారి చిత్తూరు నగరంలోని ఎమ్మెస్సార్ సర్కిల్ వద్ద ఏర్పాటు చేసిన రాజీవ్ గాంధీ విగ్రహం పూర్తిగా నిర్లక్ష్యానికి గురైనట్లు కనిపించింది.

జిల్లా కాంగ్రెస్‌కు చెందిన సీనియర్ నాయకులు, యువజన కాంగ్రెస్, మహిళా కాంగ్రెస్, ఎన్‌ఎస్‌యూఐ నాయకత్వం ఎవ్వరూ అక్కడికి రాకపోవడం కార్యకర్తల్లో అసంతృప్తిని కలిగించింది. కనీసం పార్టీ తరఫున ఒక చిన్న కార్యక్రమం నిర్వహించకపోవడం కాంగ్రెస్ పార్టీ ప్రస్తుత పరిస్థితిని స్పష్టంగా చూపిస్తోందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. “చిత్తూరులో కాంగ్రెస్ పార్టీ ఉందా? లేదా?” అనే ప్రశ్నలు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్నాయి.

ఒకప్పుడు చిత్తూరు జిల్లా కాంగ్రెస్‌కు బలమైన కంచుకోటగా ఉండేదని స్థానికులు గుర్తుచేస్తున్నారు. గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు పార్టీ కార్యకలాపాలు ఎంతో చురుకుగా సాగేవని చెబుతున్నారు. కాంగ్రెస్ జెండా కింద పనిచేసే నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో ఉండేవారని, ఎన్నికల సమయంలో పార్టీకి ప్రత్యేక గుర్తింపు ఉండేదని గుర్తు చేస్తున్నారు. కానీ ప్రస్తుతం పార్టీ పూర్తిగా బలహీనపడిపోయిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

జిల్లాలో ఇప్పటికీ కాంగ్రెస్ పేరుతో పదవులు చేపట్టిన నాయకులు ఉన్నప్పటికీ, పార్టీ జాతీయ నాయకుల జయంతులు, వర్ధంతులు వంటి ముఖ్యమైన సందర్భాల్లో కూడా ముందుకు రాకపోవడం విమర్శలకు తావిస్తోంది. కార్యకర్తలను సమన్వయం చేయడంలో నాయకత్వం పూర్తిగా విఫలమైందనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. కొందరు కార్యకర్తలు కూడా పార్టీ కార్యక్రమాల పట్ల ఆసక్తి కోల్పోయారని అంటున్నారు.

మరోవైపు ఇతర రాజకీయ పార్టీలు మాత్రం తమ జాతీయ నాయకుల కార్యక్రమాలను భారీగా నిర్వహిస్తూ ప్రజల్లో తమ ఉనికిని చాటుకుంటున్నాయి. కానీ కాంగ్రెస్ మాత్రం చిత్తూరు జిల్లాలో రోజురోజుకు మరింత నీరసంగా మారుతోందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఇప్పటికైనా జిల్లా కాంగ్రెస్ నాయకత్వం మేల్కొని పార్టీని బలోపేతం చేసే దిశగా కృషి చేయాలని, కార్యకర్తలకు భరోసా కల్పించాలని సూచిస్తున్నారు. లేకపోతే రానున్న రోజుల్లో చిత్తూరు జిల్లాలో కాంగ్రెస్ పార్టీ పూర్తిగా కనుమరుగయ్యే ప్రమాదం ఉందని రాజకీయ వర్గాలు హెచ్చరిస్తున్నాయి.

Click here to add News18 as your preferred news source on Google.

ఆంధ్రప్రదేశ్‌లోని ముఖ్యమైన వార్తలు, లేటెస్ట్ న్యూస్, స్థానిక వార్తలు, ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ప్రకటనలు, అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించిన స్టోరీలను న్యూస్18 తెలుగు ఆంధ్రప్రదేశ్ కేటగిరీలో చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *