Last Updated:
వైద్యుల సూచనల మేరకు కొద్దిరోజుల పాటు పూర్తిగా విశ్రాంతి తీసుకున్న పవన్ కళ్యాణ్ ఇప్పుడు పూర్తిగా కోలుకుని మళ్లీ ప్రజల్లోకి వచ్చేందుకు సిద్ధమయ్యారు.
Pawan Kalyan: ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) దూకుడు పెంచారు. మళ్లీ రాజకీయాల్లో ప్రభుత్వ వ్యవహారాల్లో యాక్టివ్ అయ్యారు. గత కొంతకాలంగా సైనసైటిస్ సమస్యతో బాధపడుతున్న ఆయన ఇటీవల దానికి సంబంధించిన శస్త్రచికిత్స చేయించుకున్నారు. వైద్యుల సూచనల మేరకు కొద్దిరోజుల పాటు పూర్తిగా విశ్రాంతి తీసుకున్న పవన్ కళ్యాణ్ ఇప్పుడు పూర్తిగా కోలుకుని మళ్లీ ప్రజల్లోకి వచ్చేందుకు సిద్ధమయ్యారు. ఇందులో భాగంగా ఆదివారం ఆయన రాజమండ్రి పర్యటనకు వెళ్లనున్నట్లు విశ్వసనీయ సమాచారం.
అనారోగ్యం నుంచి కోలుకున్న తర్వాత పవన్ కళ్యాణ్ అధికారికంగా పాల్గొంటున్న మొదటి పబ్లిక్ పర్యటన ఇదే కావడంతో అటు ప్రభుత్వ వర్గాల్లోనూ ఇటు కూటమి నాయకులు జనసేన శ్రేణుల్లోనూ తీవ్ర ఆసక్తి నెలకొంది.
ఉపముఖ్యమంత్రి పర్యటనకు సంబంధించి అధికారిక వర్గాల ద్వారా అందిన సమాచారం ప్రకారం పవన్ కళ్యాణ్ షెడ్యూల్ ఇలా ఉండనుంది.
ఆదివారం సాయంత్రం: పవన్ కళ్యాణ్ ప్రత్యేక మార్గం ద్వారా ఆదివారం సాయంత్రానికి రాజమండ్రి నగరానికి చేరుకుంటారు.
రాత్రి బస: రాజమండ్రి చేరుకున్న అనంతరం ఆయన ఆదివారం రాత్రికి అక్కడే బస చేయనున్నారు. ఈ సందర్భంగా స్థానిక కూటమి నేతలు జనసేన ముఖ్య నాయకులు ఆయనను మర్యాదపూర్వకంగా కలిసే అవకాశం ఉంది.
సోమవారం ఉదయం: సోమవారం ఉదయం నుండి పవన్ కళ్యాణ్ క్షేత్రస్థాయిలో పర్యటించి, అధికారిక సమీక్షా కార్యక్రమాలలో పాల్గొంటారు.
రాజమండ్రి పర్యటనలో భాగంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రధానంగా రాబోయే ప్రతిష్టాత్మక గోదావరి పుష్కరాల ముందస్తు ఏర్పాట్లపై దృష్టి సారించనున్నారు.
సోమవారం ఉదయం ఆయన గోదావరి నదీ పరివాహక ప్రాంతాలలో క్షేత్రస్థాయి పరిశీలన జరుపుతారు. నదిలో వివిధ ఘాట్ల నిర్మాణం పుష్కరాలకు వచ్చే లక్షలాది మంది భక్తులకు కల్పించాల్సిన కనీస అవసరాలు సౌకర్యాలపై స్థానిక అధికారులు, ప్రజాప్రతినిధులతో కలిసి ఆయన సుదీర్ఘ సమీక్ష నిర్వహించనున్నారు. పుష్కరాల నిర్వహణలో ఎలాంటి లోపాలు లేకుండా అంతా పకడ్బందీగా జరిగేలా ఇప్పటి నుంచే కార్యాచరణను సిద్ధం చేయడమే ఈ పర్యటన యొక్క ముఖ్య ఉద్దేశం. పవన్ కళ్యాణ్ రాకను పురస్కరించుకుని రాజమండ్రి జిల్లా యంత్రాంగం కూటమి నేతలు ఇప్పటికే అక్కడ అన్ని రకాల ప్రత్యేక ఏర్పాట్లు పూర్తి చేశారు.
ఆంధ్రప్రదేశ్‌లోని ముఖ్యమైన వార్తలు, లేటెస్ట్ న్యూస్, స్థానిక వార్తలు, ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ప్రకటనలు, అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించిన స్టోరీలను న్యూస్18 తెలుగు ఆంధ్రప్రదేశ్ కేటగిరీలో చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.
Hyderabad,Telangana



