OLXలో బైక్, మొబైల్ కొంటున్నారా..? ఒక్క తప్పుతో పోలీస్ కేసుల్లో ఇరుక్కోవచ్చు..! online scams India | చిత్తూరు వార్తలు (Chittoor News)


Last Updated:

చిత్తూరు ఎస్పీ తుషార్ డూడి హెచ్చరిక, OLX, Facebook Marketplaceలో సెకండ్ హ్యాండ్ డీల్స్ పేరుతో సైబర్ మోసాలు, చోరీ సొత్తు విక్రయం పెరుగుదల, జాగ్రత్తగా ఉండమని సూచన

News18
News18

ప్రస్తుతం ఆన్‌లైన్‌లో కొనుగోలు, అమ్మకాలు విపరీతంగా పెరిగిపోతున్న వేళ… అదే స్థాయిలో సైబర్ మోసాలు కూడా పెరుగుతున్నాయని చిత్తూరు జిల్లా ఎస్పీ తుషార్ డూడి హెచ్చరించారు. ముఖ్యంగా OLX, Facebook Marketplace వంటి ప్లాట్‌ఫారమ్‌లలో తక్కువ ధరలకు వస్తువులు అమ్ముతున్నట్లు ప్రకటనలు ఇచ్చి ప్రజలను మోసం చేసే ఘటనలు రోజురోజుకీ పెరుగుతున్నాయని తెలిపారు. కారు, బైక్, మొబైల్ ఫోన్, ల్యాప్‌టాప్, కెమెరా, గృహోపకరణాలు, బంగారు ఆభరణాలు వంటి వస్తువులను మార్కెట్ ధర కంటే చాలా తక్కువకు ఇస్తామని చెప్పి కొందరు మోసగాళ్లు ప్రజలను వలలో వేసుకుంటున్నారని చెప్పారు.

ఇటీవల జిల్లాలో సెకండ్ హ్యాండ్ వస్తువుల కొనుగోలు పేరుతో పలువురు మోసపోయిన ఘటనలు పోలీసుల దృష్టికి వచ్చాయని ఎస్పీ వెల్లడించారు. ముఖ్యంగా ముందుగా అడ్వాన్స్ డబ్బులు తీసుకుని తరువాత ఫోన్లు స్విచ్ ఆఫ్ చేయడం, ఫేక్ లొకేషన్లు చూపించడం, నకిలీ స్క్రీన్‌షాట్లు పంపించడం వంటి పద్ధతులతో మోసాలకు పాల్పడుతున్నారని తెలిపారు. కొందరు అయితే ఆర్మీ ఉద్యోగుల పేర్లు, పోలీసుల ఫోటోలు, నకిలీ ఐడీ కార్డులు ఉపయోగించి ప్రజల నమ్మకాన్ని గెలుచుకునే ప్రయత్నం చేస్తున్నారని హెచ్చరించారు.

ఇక మరో షాకింగ్ విషయం కూడా ఎస్పీ బయటపెట్టారు. చాలా సందర్భాల్లో OLXలో అమ్ముతున్న సెకండ్ హ్యాండ్ వస్తువులు చోరీకి గురైనవిగా ఉండే అవకాశముందని తెలిపారు. చోరీ చేసిన బైక్‌లు, మొబైల్ ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు, ఎలక్ట్రానిక్ వస్తువులను తక్కువ ధరలకు విక్రయిస్తూ అక్రమ లాభాలు పొందేందుకు ప్రయత్నిస్తున్నారని చెప్పారు. తెలియక అలాంటి వస్తువులు కొనుగోలు చేసినవారు కూడా తర్వాత చట్టపరమైన ఇబ్బందుల్లో పడే ప్రమాదం ఉందని స్పష్టం చేశారు.

ఇటీవలే ఇంజనీరింగ్ చదువుతున్న 22 ఏళ్ల యువకుడు సచివాలయాల్లో చోరీ చేసిన ప్రింటర్లు, ల్యాప్‌టాప్‌లను OLXలో విక్రయిస్తున్న కేసును పోలీసులు ఛేదించినట్లు ఎస్పీ వివరించారు. అతడిని అరెస్ట్ చేసి సుమారు రూ.8.5 లక్షల విలువైన చోరీ సొత్తును స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఈ ఘటనతో ఆన్‌లైన్‌లో తక్కువ ధరకు వస్తువులు కొనేటప్పుడు ఎంత జాగ్రత్త అవసరమో స్పష్టమవుతోందన్నారు.

సెకండ్ హ్యాండ్ వస్తువులు కొనుగోలు చేసే ముందు విక్రేత వివరాలు, బిల్లులు, RC పత్రాలు, IMEI నంబర్లు, సీరియల్ నంబర్లు తప్పనిసరిగా పరిశీలించాలని సూచించారు. వాహనాల విషయంలో RTO రికార్డులు చెక్ చేయకుండా కొనొద్దని, మొబైల్ ఫోన్ల విషయంలో IMEI నంబర్ ద్వారా ధృవీకరణ చేసుకోవాలని చెప్పారు. అత్యంత తక్కువ ధర చూసి వెంటనే ఆకర్షితులు కాకుండా మార్కెట్ ధరతో పోల్చి చూసిన తర్వాత మాత్రమే కొనుగోలు చేయాలని సూచించారు.

వస్తువును ప్రత్యక్షంగా పరిశీలించకుండా ఎట్టి పరిస్థితుల్లోనూ అడ్వాన్స్ చెల్లింపులు చేయవద్దని ఎస్పీ స్పష్టం చేశారు. అలాగే తెలియని వ్యక్తులతో ఒంటరిగా వెళ్లి డీల్‌లు చేయకుండా జనసంచారం ఎక్కువగా ఉండే ప్రదేశాల్లోనే కొనుగోలు, అమ్మకాలు నిర్వహించాలని సూచించారు. ఏదైనా అనుమానం కలిగితే వెంటనే సమీప పోలీస్ స్టేషన్‌ను సంప్రదించాలని తెలిపారు. సైబర్ మోసాలకు సంబంధించిన సమాచారం కోసం Dial 112 లేదా సైబర్ క్రైమ్ హెల్ప్‌లైన్ 1930కు ఫిర్యాదు చేయాలని ప్రజలకు సూచించారు.

Click here to add News18 as your preferred news source on Google.

ఆంధ్రప్రదేశ్‌లోని ముఖ్యమైన వార్తలు, లేటెస్ట్ న్యూస్, స్థానిక వార్తలు, ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ప్రకటనలు, అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించిన స్టోరీలను న్యూస్18 తెలుగు ఆంధ్రప్రదేశ్ కేటగిరీలో చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *