ఎం విజయ్ కీలక నిర్ణయం.. OSD రికీ రాధన్ పండిట్ వెట్రివేల్ నియామకం రద్దు


తమిళనాడు ప్రభుత్వంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. సీఎం రాజకీయ విభాగానికి ప్రత్యేక విధుల అధికారి (OSD)గా నియమితులైన రికీ రాధన్ పండిట్ వెట్రివేల్ నియామకాన్ని ప్రభుత్వం రద్దు చేసింది. ఈ మేరకు పబ్లిక్‌ డిపార్ట్‌మెంట్‌ కార్యదర్శి ఉత్తర్వులు జారీ చేశారు.

ముఖ్యమంత్రి కార్యాలయంలో రాజకీయ వ్యవహారాల కోసం ప్రత్యేక అధికారిని నియమించడంపై తమిళనాడు రాజకీయ వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చ మొదలైంది. ఈ నియామకాన్ని ప్రతిపక్ష నేత ఉదయనిధి స్టాలిన్ తీవ్రంగా తప్పుపట్టారు. ప్రభుత్వ యంత్రాంగంలో రాజకీయ ప్రయోజనాల కోసం ప్రత్యేక అధికారులను నియమించడం రాజ్యాంగ విరుద్ధమని, ఇది కొత్త సంప్రదాయానికి తెరలేపుతోందని ఆయన విమర్శించారు. మరోవైపు డీఎండీకే అధినేత్రి ప్రేమిలత విజయకాంత్ కూడా ఈ నియామకంపై ఘాటుగా స్పందించారు. ప్రభుత్వ నిధులతో రాజకీయ కార్యకలాపాలు సాగించేందుకు ఇలాంటి పదవులను సృష్టించడం సరికాదని ఆమె అభిప్రాయపడ్డారు. సోషల్ మీడియాలో కూడా ఈ నియామకంపై నెటిజన్ల నుంచి మిశ్రమ స్పందన లభించింది.

శాసనసభలో బలపరీక్ష నెగ్గిన ఆనందంలో ఉన్న విజయ్ సర్కార్‌కు.. ఈ ఓఎస్‌డీ నియామకం ఒక తలనొప్పిగా మారింది. విపక్షాల విమర్శలు ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు పంపుతాయని భావించిన ముఖ్యమంత్రి తక్షణమే స్పందించారు. పరిపాలనలో పారదర్శకతకు పెద్దపీట వేస్తామని ఇప్పటికే ప్రకటించిన విజయ్.. వివాదాలకు తావు లేకుండా ఉండేందుకు రిక్కీ రాధన్ పండిట్ వెట్రివేల్ నియామకాన్ని రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు.

అసెంబ్లీ వేదికగా కూడా విజయ్ ఈ విషయంపై క్లారిటీ ఇచ్చారు. నియామకాల విషయంలో వస్తున్న అభ్యంతరాలను తాము పరిగణనలోకి తీసుకుంటామని.. అవసరం అయితే నిర్ణయాలను పునఃసమీక్షిస్తామని ఆయన స్పష్టం చేశారు. కేవలం 24 గంటల వ్యవధిలోనే తన నిర్ణయాన్ని మార్చుకోవడం ద్వారా.. విమర్శలను స్వీకరించే మనస్తత్వం తనకే ఉందని విజయ్ నిరూపించుకున్నారని ఆయన మద్దతుదారులు చెబుతుండగా.. విపక్షాలు మాత్రం ఇది తమ పోరాట విజయమని పేర్కొంటున్నాయి. మొత్తానికి తమిళనాడు రాజకీయాల్లో తన ప్రయాణాన్ని ప్రారంభించిన విజయ్.. మొదటి రోజే విపక్షాల నుంచి గట్టి సవాలును ఎదుర్కొని, చాకచక్యంగా దాని నుంచి బయటపడ్డారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *