Last Updated:
శ్రీ సత్య సాయి జిల్లా కదిరి కొత్తకోట హరీష్ 15 ఏళ్లుగా కందికుంట బ్లడ్ డోనర్స్ క్లబ్ ద్వారా 7 వేల మందికి పైగా రక్తదానం చేసి, అరుదైన O నెగిటివ్ రక్తం 46 సార్లు ఇచ్చి ప్రాణాలు కాపాడారు
శ్రీ సత్య సాయి జిల్లాలోని కదిరి ప్రాంతానికి చెందిన కొత్తకోట హరీష్ పేరు ఇప్పుడు సేవకు ప్రతీకగా మారింది. కందికుంట బ్లడ్ డోనర్స్ క్లబ్ పేరిట గత 15 సంవత్సరాలుగా ఆయన చేస్తున్న సేవ అనేక కుటుంబాలకు ఆశాకిరణంగా నిలిచింది. దాదాపు 7 వేల మందికి పైగా రక్తదానం చేసి ప్రాణాలు నిలబెట్టడమే కాకుండా, తన అరుదైన O- నెగిటివ్ బ్లడ్ గ్రూప్‌ను ఏకంగా 46 సార్లు డొనేట్ చేయడం ఆయన సేవాభావానికి నిదర్శనం. పుట్టపర్తి, కదిరి, పులివెందుల, హైదరాబాద్, తిరుపతి, అనంతపూర్, కడప వంటి ఎన్నో ప్రాంతాలకు స్వంత ఖర్చుతో వెళ్లి రక్తదానం చేయడం ఆయన ప్రత్యేకత.
హరీష్ కథలో గొప్పదనం ఏమిటంటే.. ఆయన వద్ద ఉన్నది డబ్బు కాదు, కానీ ప్రాణాలు కాపాడే విలువైన రక్తం. నేను ఆర్థికంగా అంత బలంగా లేను. కానీ నా తల్లిదండ్రులు ఇచ్చిన రక్తమే నా సంపద. సరైన సమయంలో రక్తం అందక ఎంతో మంది ప్రాణాలు కోల్పోతున్నారు. నేను డబ్బుతో సహాయం చేయలేను, కానీ నా రక్తంతో ఒక ప్రాణాన్ని కాపాడగలను అని హరీష్ చెప్పిన మాటలు ప్రతి ఒక్కరినీ ఆలోచింపజేస్తాయి.
O- నెగిటివ్ బ్లడ్ గ్రూప్ అత్యంత అరుదైనదిగా ఉండటంతో అత్యవసర సమయాల్లో దీని అవసరం ఎక్కువగా ఉంటుంది. ఈ విషయం తెలుసుకున్న హరీష్, ఎక్కడైనా అవసరం ఉన్నప్పుడు వెంటనే స్పందించి సహాయం చేస్తున్నారు. “నా ప్రాణం ఉన్నంతవరకు వీలైనన్ని సార్లు రక్తదానం చేస్తూనే ఉంటాను అనే ఆయన సంకల్పం, సేవ పట్ల ఉన్న అంకితభావాన్ని తెలియజేస్తోంది.
ప్రత్యేకంగా డెలివరీ సమయాల్లో రక్తం అవసరం ఉన్నప్పుడు హరీష్‌కు వచ్చే ఫోన్ కాల్స్ ఆయనకు మరింత బాధ్యతను గుర్తు చేస్తాయి. అలాంటి సందర్భాల్లో వెంటనే వెళ్లి రక్తదానం చేసి, ఒక తల్లి, బిడ్డ ప్రాణాలను కాపాడిన తర్వాత వారు చూపించే ప్రేమ, కృతజ్ఞతలు ఆయనకు అమూల్యమైన బహుమతిగా మారుతాయి. వాళ్ల ఆనందం చూసినప్పుడు నా కష్టం అంతా మర్చిపోతాను అని హరీష్ చెబుతారు.
ఇప్పటికీ తన సేవను ఆపకుండా కొనసాగిస్తున్న హరీష్, అవసరంలో ఉన్నవారికి ఎప్పుడూ అందుబాటులో ఉంటున్నారు. ఆయనను సంప్రదించాలనుకునే వారు 63050 95556, 9533559838 నంబర్లకు కాల్ చేయవచ్చు. డబ్బు లేకపోయినా మనసుంటే ఎంతటి సేవ చేయవచ్చో హరీష్ జీవితం ఒక గొప్ప ఉదాహరణగా నిలుస్తోంది.
ఆంధ్రప్రదేశ్‌లోని ముఖ్యమైన వార్తలు, లేటెస్ట్ న్యూస్, స్థానిక వార్తలు, ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ప్రకటనలు, అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించిన స్టోరీలను న్యూస్18 తెలుగు ఆంధ్రప్రదేశ్ కేటగిరీలో చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.
Anantapur,Anantapur,Andhra Pradesh
Apr 21, 2026 11:17 PM IST


