. పనికావాలంటే పైసలివ్వాల్సిందే
. 22-ఏ పేరుతో అక్రమ దందా
. తారుమారవుతున్న భూ రికార్డులు
. రాజకీయ నాయకులతో అధికారుల కుమ్మక్కు
విశాలాంధ్ర-సచివాలయం: రాష్ట్రంలో రెవెన్యూ కార్యాలయాలు అక్రమాలకు అక్షయపాత్రలా తయారయ్యాయి. సామాన్యుడి పట్టా భూమిని రాత్రికి రాత్రే పరాధీనం చేసే మాయా లోకాన్ని తలపిస్తున్నాయి. రెవెన్యూ కార్యాలయంలోకి అడుగు పెట్టాలంటే జేబులో నోట్ల కట్టలు ఉండాలి. లేదంటే రాజకీయ అండ ఉండాలి. అక్కడ చట్టం కంటే రాజకీయ నాయకుడి మాటే శాసనం. నిబంధనల కంటే నోట్ల కట్టలకే విలువ ఎక్కువ. పేదవాడి సొంత భూమి రాత్రికి రాత్రే అక్రమార్కుల పరమవుతుంటే… దాన్ని అడ్డుకోవాల్సిన యంత్రాంగం రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గి ఆమోద ముద్ర వేస్తోంది. తిమ్మిని బమ్మిని చేయడంలో సిద్ధహస్తులైన కొందరు అధికారులు, రాజకీయ నేతలతో చేతులు కలిపి వేల ఎకరాల ప్రభుత్వ, పేదల భూములను ధారాదత్తం చేస్తున్నారు.
సామాన్య రైతు తన భూమిని కాపాడుకోవడానికి ఒక యుద్ధమే చేయాల్సి వస్తోంది. బిల్ల బంట్రోతు నుంచి తహశీల్దార్ వరకు మామూళ్ల మత్తులో జోగుతుంటే… రాజకీయ నేతలు రిమోట్ కంట్రోల్‌తో రికార్డులను శాసిస్తున్నారు. నియోజకవర్గాల్లో మంత్రులు, ఎమ్మెల్యేల కనుసన్నల్లోనే ఎమ్మార్వోలు పనిచేయాల్సిన దుస్థితి నెలకొంది. పార్టీల రంగు చూసి మ్యూటేషన్లు ఆపేయడం, అర్హులను కాదని అనర్హులకు పట్టాలు కట్టబెట్టడం నిత్యకృత్యమైంది. ద్వితీయ శ్రేణి నాయకులు ఏది చెబితే అదే వేదం. ఎదురు తిరిగిన సిబ్బందిపై బదిలీల వేటు తప్పదు. 1బి, అడంగల్ రికార్డులను ఇష్టానుసారంగా మార్చేసి…అసలైన యజమానులను వీధుల పాలు చేస్తున్నారని విమర్శలు వస్తున్నాయి. గత ప్రభుత్వం చేసిన తప్పిదాల వల్ల నేడు వందలాది మంది అధికారులు కోర్టు కేసుల్లో చిక్కుకున్నారు. అయినా నేటికీ అదే పంథా కొనసాగుతుండటం గమనార్హం. ప్రభుత్వ గ్రీవెన్స్ కు వస్తున్న దరఖాస్తులే ఈ వ్యవస్థ వైఫల్యానికి నిదర్శనం. రాష్ట్రవ్యాప్తంగా వచ్చిన ఫిర్యాదుల్లో 60 శాతం భూ సమస్యలే ఉంటున్నాయి. మ్యుటేషన్ వివాదాల కోసం 1,97,916 ఫిర్యాదులు వచ్చాయి. రీ-సర్వే తర్వాత తమ భూమి మాయమైందని 1,00,295 మంది రైతులు గగ్గోలు పెడుతున్నారు. జాయింట్ ఎల్పీఎం సమస్యలపై ఏకంగా 2,40,479 ఫిర్యాదులు పెండింగ్‌లో ఉన్నాయి. గత ఏడాది కాలంలో వచ్చిన 5.28 లక్షల దరఖాస్తుల్లో కేవలం 15 శాతం మాత్రమే పరిష్కారమయ్యాయి. మిగిలిన 85 శాతం సమస్యలు గాలిలో దీపాల్లా మారాయి. నిషేధిత జాబితా (22-ఏ)లో ఉన్న భూములను తొలగించాలంటే ఒక్కో ఎకరానికి రూ.లక్షలు సమర్పించుకోవాల్సిందే. క్షేత్రస్థాయిలో అధికారులు ఈ నిబంధనను అడ్డం పెట్టుకుని అక్రమంగా ఆర్జిస్తున్నారు. ఎక్స్ సర్వీస్ మెన్, స్వాతంత్య్ర సమరయోధుల భూములను కూడా వదలకుండా వేధిస్తున్న వైనంపై సీఎం చంద్రబాబు సీరియస్ అయ్యారు. ఈ ‘భూ మాఫియా’కు చెక్ పెట్టేందుకు కఠిన నిర్ణయాలు తీసుకుంటున్నారు. రికార్డుల ట్యాంపరింగ్ జరగకుండా పటిష్టమైన సాంకేతిక వ్యవస్థను తీసుకురావాలని ఆదేశాలు జారీ చేశారు. 22-ఏ భూముల తొలగింపు ప్రక్రియను మరింత పారదర్శకం చేసేందుకు ఆర్డీవో పరిధిలోకి ప్రభుత్వం మార్పు చేసింది. అక్రమాలపై తక్షణమే నివేదిక ఇవ్వాలని కలెక్టర్లకు ఆదేశాలిచ్చారు. ప్రతి నెలా రెవెన్యూ శాఖ పనితీరుపై సీఎం స్వయంగా సమీక్ష జరపనున్నారు. రెవెన్యూ వ్యవస్థలో రాజకీయ జోక్యం ఉంటేనే సమస్య పరిష్కారమవుతుందనేలా పరిస్థితి దిగజారడం ప్రమాదకరం. ‘తమవారైతేనే పని’ అనే పంథా వీడి, సామాన్య రైతుకు న్యాయం జరిగినప్పుడే ఈ వ్యవస్థకు గౌరవం దక్కుతుంది. ప్రభుత్వం కేవలం ఆదేశాలకే పరిమితం కాకుండా… క్షేత్రస్థాయిలో ప్రక్షాళన మొదలుపెట్టాలని ప్రజలు కోరుతున్నారు.
The post అవినీతి ఊబిలో రెవెన్యూ appeared first on Visalaandhra.


