Last Updated:
వేసవిలో టెర్రస్ గార్డెన్లో అధిక ఎండతో మొక్కలు వాడిపోకుండా 50 శాతం షేడ్ నెట్, సరైన నీటిపారుదల, మల్చింగ్, సహజ ఎరువులు, నీం ఆయిల్ స్ప్రే వాడాలని అను సూచించింది
వేసవికాలంలో టెర్రస్ గార్డెనింగ్ చేయడం ఆనందదాయకమే కానీ మొక్కలను ఆరోగ్యంగా ఉంచడం కొంత కష్టంగా ఉంటుంది. అధిక ఉష్ణోగ్రతలు, తీవ్ర ఎండ, నీటి ఆవిరీభవనం వేగంగా జరగడం వల్ల కుండల్లోని మొక్కలు త్వరగా వాడిపోతాయి. సరైన నీటిపారుదల, షేడ్ నెట్ వినియోగం, మల్చింగ్ వంటి జాగ్రత్తలు తీసుకుంటే ఈ సమస్యలను నివారించవచ్చు. అలాగే సహజ ఎరువులు, కీటకాల నియంత్రణ పద్ధతులు పాటిస్తే మొక్కలు బలంగా పెరుగుతాయి. చిన్న చిన్న జాగ్రత్తలతో వేసవిలో కూడా మీ టెర్రస్ గార్డెన్‌ను పచ్చగా, అందంగా ఉంచుకోవచ్చు.
వేసవిలో సూర్యరశ్మి చాలా తీవ్రమైనది. రోజుకు 6–8 గంటల ఎండ పడితే కొన్ని మొక్కలు తట్టుకోలేక వాడిపోతాయి. కాబట్టి 50% షేడ్ నెట్ ఉపయోగించడం మంచిది. ముఖ్యంగా మధ్యాహ్నం 11 నుంచి 3 గంటల మధ్య నేరుగా ఎండ పడకుండా చూసుకోవాలి.
వేసవిలో మట్టి త్వరగా ఎండిపోతుంది. కాబట్టి రోజుకు 1 లేదా 2 సార్లు నీరు పోయాలి. ఉదయం తొందరగా సాయంత్రం సమయంలో నీరు పోయడం ఉత్తమం. మధ్యాహ్నం నీరు పోస్తే అది వెంటనే ఆవిరైపోతుంది. అయితే ఎక్కువ నీరు పోయకుండా, కుండలో నీరు నిల్వ ఉండకుండా జాగ్రత్త పడాలి.
మొక్కల చుట్టూ ఎండిన ఆకులు, గడ్డి లేదా కొకోపీట్ వేసి మల్చింగ్ చేస్తే మట్టి తేమ ఎక్కువసేపు ఉంటుంది. ఇది వేర్లు ఎండిపోకుండా కాపాడుతుంది నీటి వినియోగాన్ని తగ్గిస్తుంది. వేసవిలో పెద్ద కుండలు ఉపయోగించడం మంచిది. చిన్న కుండల్లో మట్టి త్వరగా వేడెక్కి వేర్లు దెబ్బతింటాయి. అలాగే మట్టి మిశ్రమంలో కొకోపీట్, వెర్మికంపోస్ట్ కలిపితే తేమ నిల్వ ఉంటుంది.
వేసవిలో తట్టుకునే మొక్కలను ఎంచుకోవడం మంచిది. టమోటా, మిర్చి, కీరా, పాలకూర, తులసి వంటి మొక్కలు వేసవిలో బాగా పెరుగుతాయి. ఇవి తక్కువ సంరక్షణతో కూడా జీవిస్తాయి. వేసవిలో కీటకాలు వేగంగా పెరుగుతాయి. కాబట్టి వారానికి ఒకసారి నీం ఆయిల్ స్ప్రే చేయడం మంచిది. ఇది సహజ పద్ధతిలో కీటకాలను దూరం చేస్తుంది.
టెర్రస్ మీద వేడి ఎక్కువగా ఉంటుంది. కాబట్టి మొక్కలను గాలి సరిగా వచ్చేలా అమర్చాలి. అవసరమైతే నీడ ఉన్న ప్రదేశంలో పెట్టాలి. కుండలను నేలపై కాకుండా స్టాండ్లపై ఉంచితే వేడి ప్రభావం తగ్గుతుంది. కొన్ని సార్లు వేసవిలో అకస్మిక వర్షాలు పడుతాయి. అప్పుడు కుండల్లో నీరు నిల్వ కాకుండా చూసుకోవాలి. లేకపోతే వేర్లు కుళ్లిపోతాయి.
వేసవిలో టెర్రస్ గార్డెనింగ్‌లో మొక్కలు వాడిపోకుండా ఉండాలంటే నీరు, ఎండ, మట్టి, కీటకాలపై ప్రత్యేక శ్రద్ధ అవసరం. చిన్న చిన్న జాగ్రత్తలు పాటిస్తే వేడి కాలంలో మీ టెర్రస్ గార్డెన్ పచ్చగా, ఆరోగ్యంగా కనిపిస్తుంది. గత 20 సంవత్సరాలుగా శ్రీకాకుళంలో టెర్రస్ గార్డెన్ చేస్తున్న అను ఆమె తన అనుభవంతో వేసవిలో తీసుకోవాల్సిన ఈ చిట్కాలను లోకల్ 18కు వివరించారు.
Hyderabad,Telangana


