CM Chandrababu: దుబారా ఖర్చులు వద్దు.. పొదుపు ముద్దు: ప్రధాని మోదీ బాటలో సీఎం చంద్రబాబు | ఆంధ్రప్రదేశ్ వార్తలు


Last Updated:

పశ్చిమ ఆసియా యుద్ధ పరిస్థితుల నేపథ్యంలో ప్రధాని మోదీ ప్రకటించిన ఎనిమిది అంశాల పొదుపు మంత్రానికి ముఖ్యమంత్రి చంద్రబాబు మద్దతు ప్రకటించారు. విదేశీ పర్యటనలు, ఇంధన వినియోగం, కాన్వాయ్ వాహనాలు తగ్గించి దేశాభివృద్ధికి ప్రజలు సహకరించాలని ఆయన పిలుపునిచ్చారు.

సీఎం చంద్రబాబు
సీఎం చంద్రబాబు

పశ్చిమ ఆసియా యుద్ధ పరిస్థితుల నేపథ్యంలో ప్రధాని మోదీ ప్రకటించిన ఎనిమిది అంశాల పొదుపు మంత్రానికి సీఎం చంద్రబాబు మద్దతు ప్రకటించారు. మంగళగిరి మండలం నిడమర్రులో ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడుతూ.. యుద్ధం వల్ల దేశ ఆర్థిక వ్యవస్థపై పడుతున్న భారాన్ని తగ్గించడానికి పౌరులందరూ బాధ్యతగా వ్యవహరించాలని ఆయన పిలుపునిచ్చారు. పెట్రోల్, డీజిల్ వినియోగాన్ని తగ్గించడం ద్వారా విదేశీ మారకద్రవ్యాన్ని ఆదా చేయవచ్చని సీఎం పేర్కొన్నారు. ముఖ్యంగా ప్రజాప్రతినిధులు పెద్ద కాన్వాయ్‌లు, భారీ సెక్యూరిటీని ఫ్యాషన్‌గా భావించకుండా వాటిని తక్షణమే కుదించుకుని ప్రజలకు ఆదర్శంగా నిలవాలని సూచించారు.

ఈ పొదుపు చర్యలపై రాష్ట్ర ప్రభుత్వం తరపున ఒకటి రెండు రోజుల్లో పూర్తిస్థాయి కార్యాచరణను ప్రకటిస్తామని చంద్రబాబు స్పష్టం చేశారు. యుద్ధం తెచ్చే ఇబ్బందులను అధిగమించడానికి ప్రతి ఒక్కరూ ‘నా దేశం – నా బాధ్యత’ అనే నినాదంతో ముందుకు సాగాలని ఆయన కోరారు.

వర్క్ ఫ్రమ్ హోమ్ అనేది ప్రస్తుత కాలంలో ఒక వాస్తవమని, ఇంటి నుంచే ప్రపంచం మొత్తం పనిచేసే పరిస్థితి వస్తోందని ముఖ్యమంత్రి వ్యాఖ్యానించారు. ఈ విధానాన్ని ప్రోత్సహించడం వల్ల అనవసర ప్రయాణాలు, ఇంధన ఖర్చులు తగ్గుతాయని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రభుత్వ కార్యకలాపాల్లో కూడా ఈ తరహా మార్పులు తీసుకువచ్చే దిశగా ఆలోచన చేస్తున్నట్లు వెల్లడించారు. దేశం మొత్తం దుబారాను తగ్గించాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా గుర్తుచేశారు.

విదేశీ పర్యటనలు తగ్గించుకోవాలన్న ప్రధాని సూచనను ప్రజలు పాటించాలని సీఎం కోరారు. మన దేశంలో, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌లో అద్భుతమైన పర్యాటక ప్రాంతాలు ఉన్నాయని, విదేశాలకు వెళ్లే బదులు స్థానిక పర్యాటక రంగాన్ని ఆదరించాలని సూచించారు. దీనివల్ల దేశ సంపద బయటకు పోకుండా ఉంటుందని చెప్పారు. ప్రధాని సూచించిన విధంగా బంగారం కొనుగోలును కూడా నియంత్రించుకోవాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

తాత్కాలికంగా ఎదురయ్యే ఇబ్బందులను భరిస్తూ దేశ ప్రయోజనాల కోసం ప్రతి పౌరుడు సహకరించాలని చంద్రబాబు కోరారు. ఆర్థిక క్రమశిక్షణ పాటించడం ద్వారానే అంతర్జాతీయ సంక్షోభాలను తట్టుకోగలమని ధీమా వ్యక్తం చేశారు. రాబోయే రెండు రోజుల్లో అధికారులతో చర్చించి పొదుపు చర్యలపై స్పష్టమైన ప్రకటన విడుదల చేస్తామని ముఖ్యమంత్రి నిడమర్రు వేదికగా వెల్లడించారు.

Click here to add News18 as your preferred news source on Google.

ఆంధ్రప్రదేశ్‌లోని ముఖ్యమైన వార్తలు, లేటెస్ట్ న్యూస్, స్థానిక వార్తలు, ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ప్రకటనలు, అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించిన స్టోరీలను న్యూస్18 తెలుగు ఆంధ్రప్రదేశ్ కేటగిరీలో చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *