Last Updated:
తాజా నోటీసుల ప్రకారం ఈ నెల 27న ఢిల్లీలోని ఈడీ ప్రధాన కార్యాలయంలో విచారణకు హాజరుకావాలని అధికారుల నుంచి ఆదేశాలు వెళ్లాయి. ముఖ్యంగా ప్రైడ్ ఇన్ఫ్రాకాన్ ఎల్ఎల్పీ సంస్థకు సంబంధించిన ఆర్థిక లావాదేవీలు, ఈ కేసులో కీలకంగా ప్రస్తావనకు వచ్చిన రాజ్ కసిరెడ్డి వ్యాపార సంబంధాలపై అధికారులు ప్రశ్నలు అడిగే అవకాశముందని సమాచారం.
వైసీపీ ప్రభుత్వ కాలంలో వెలుగులోకి వచ్చిన ఆంధ్రప్రదేశ్ లిక్కర్ వ్యవహారంపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ దర్యాప్తు మరింత వేగం అందుకుంది. మనీలాండరింగ్ కోణంలో జరుగుతున్న విచారణలో భాగంగా విజయవాడకు చెందిన టీడీపీ ఎంపీ కేశినేని శివనాథ్ అలియాస్ చిన్ని కుటుంబ సభ్యులకు సంబంధించి కొత్త పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఎంపీ భార్య కేశినేని జానకి లక్ష్మికి ఈడీ మరోసారి సమన్లు జారీ చేయడం రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది.
తాజా నోటీసుల ప్రకారం ఈ నెల 27న ఢిల్లీలోని ఈడీ ప్రధాన కార్యాలయంలో విచారణకు హాజరుకావాలని అధికారుల నుంచి ఆదేశాలు వెళ్లాయి. ముఖ్యంగా ప్రైడ్ ఇన్ఫ్రాకాన్ ఎల్ఎల్పీ సంస్థకు సంబంధించిన ఆర్థిక లావాదేవీలు, ఈ కేసులో కీలకంగా ప్రస్తావనకు వచ్చిన రాజ్ కసిరెడ్డి వ్యాపార సంబంధాలపై అధికారులు ప్రశ్నలు అడిగే అవకాశముందని సమాచారం. లిక్కర్ వ్యాపారానికి సంబంధించిన నిధుల మార్పిడి, వాటాల పంపకం వంటి అంశాలను ఈడీ లోతుగా పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది.
ఇప్పటికే ఈ కేసులో పలువురు వ్యాపారవేత్తలు, మాజీ అధికారుల ఆర్థిక లావాదేవీలను విచారించిన ఈడీ, ఇప్పుడు రాజకీయ నాయకుల కుటుంబ సభ్యుల దిశగా దర్యాప్తును విస్తరించిందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. గతంలో కూడా జానకి లక్ష్మికి సమన్లు జారీ కాగా, తాజా విచారణకు మళ్లీ పిలవడం కేసు తీవ్రతను సూచిస్తోందని న్యాయవర్గాలు భావిస్తున్నాయి.
ఈ కేసుకు సంబంధించి ఇటీవల కేశినేని నాని చేసిన ఆరోపణలు కూడా రాజకీయంగా కలకలం రేపాయి. కేశినేని చిన్ని కుటుంబానికి చెందిన కొన్ని కంపెనీల ద్వారా భారీ మొత్తంలో నిధులు విదేశాలకు మళ్లించబడ్డాయని ఆయన ఆరోపించారు. రాజ్ కసిరెడ్డి, అతని అనుబంధ సంస్థలతో వ్యాపార సంబంధాలు ఉన్నాయని కూడా పేర్కొన్నారు. రియల్ ఎస్టేట్, హవాలా, థర్డ్ పార్టీ ఒప్పందాల పేరుతో అనుమానాస్పద ఆర్థిక లావాదేవీలు జరిగినట్లు ఆరోపణలు వినిపించాయి.
అయితే ఈ ఆరోపణలను కేశినేని చిన్ని తీవ్రంగా ఖండించారు. రాజకీయంగా తన ప్రతిష్ఠ దెబ్బతీయడానికి అసత్య ప్రచారం చేస్తున్నారని ఆయన విమర్శించారు. తప్పుడు ఆరోపణలపై ఇప్పటికే పరువు నష్టం దావా వేస్తూ లీగల్ నోటీసులు పంపినట్లు ఆయన వర్గాలు వెల్లడించాయి.
ఇక ఈడీ విచారణలో వెలుగులోకి వచ్చే వివరాలపై రాజకీయ పార్టీలతో పాటు వ్యాపార వర్గాలు కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి. జానకి లక్ష్మి విచారణ అనంతరం మరికొంత మందికి కూడా నోటీసులు వెళ్లే అవకాశం ఉందన్న ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఏపీ లిక్కర్ వ్యవహారం మరోసారి రాజకీయ వేడిని పెంచుతోంది.
ఆంధ్రప్రదేశ్లోని ముఖ్యమైన వార్తలు, లేటెస్ట్ న్యూస్, స్థానిక వార్తలు, ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ప్రకటనలు, అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించిన స్టోరీలను న్యూస్18 తెలుగు ఆంధ్రప్రదేశ్ కేటగిరీలో చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.
Hyderabad,Telangana
May 25, 2026 11:15 AM IST



