ఎర్రకోట వద్ద పేలుడుపై ఎనఐఏ ఛార్జిషీటులో వెల్లడి
దిల్లీ: ఎర్రకోటకు సమీపంలో కారు బాంబుతో ఆత్మాహుతికి పాల్పడిన అల్‌ఖైదా అనుబంధ సంస్థ ఉగ్రవాదులు దాని కోసం కృత్రిమ మేధ (ఏఐ) ఆధారిత ప్లాట్‌ఫాంనూ వాడారని ‘జాతీయ దర్యాప్తు సంస్థ’ (ఎనఐఏ) గుర్తించింది. ఉగ్ర కుట్ర రూపకల్పనలో ఏఐని దుర్వినియోగం చేశారని వెల్లడించింది. 2025 నవంబరు 10న జరిగిన పేలుడుపై ఎనఐఏ ప్రత్యేక న్యాయస్థానంలో 7,500 పేజీల భారీ ఛార్జిషీటును అధికారులు ఇటీవల దాఖలు చేసిన విషయం తెలిసిందే. రాకెట్‌తో ప్రయోగించగల బాంబుల్నీ నిందితులు కచ్చితత్వంతో తయారుచేసి, వాటిని జమ్మూ కశ్మీర్ అనంత్‌నాగ్ జిల్లాలోని కాజీగుండ్ అడవుల్లో పరీక్షించారని దర్యాప్తులో తేలింది. దీనికోసం నిందితుల్లో ఒకడు ఇంజినీరు మాదిరిగా పని చేశాడని అధికారులు గుర్తించారు. కుట్రకు కావాల్సిన సాంకేతిక సాయాన్ని అందించడానికి నిందితుడు జసీర్ బిలాల్ వనీ 2024-25లో రెండు మూడు సార్లు ఫరీదాబాద్‌లోని అల్‌ఫలా విశ్వవిద్యాలయ ప్రాంగణంలో బస చేసినట్లు ఛార్జిషీటులో పేర్కొన్నారు.
ìఆన్‌లైన్ సాయంతో పేలుడు పదార్థాల తయారీ…
కారును నడిపి ఆత్మాహుతి చేసుకున్న డాక్టర్ ఉమర్ ఉన్ నబీకి జసీర్‌ను పరిచయం చేసిన వ్యక్తి డాక్టర్ అదీల్ అహ్మద్ రాథెర్ అని, బాంబులకు కావాల్సిన పొటాషియం నైట్రేట్ వంటివి అతడే సమకూర్చాడని గుర్తించారు. రాకెట్లను ఎలా తయారు చేయాలి, దానిలో బాంబులుగా ఏయే పదార్థాలు ఎంతెంత వాడాలి… అనేవి యూట్యూబ్, చాట్ జీపీటీల్లో వెతికిన దాఖలాలు అధికారులకు లభ్యమయ్యాయి. అలా తయారుచేసి అడవుల్లో పరీక్షించిన రాకెట్ల శకలాలు దర్యాప్తు అధికారులకు దొరికాయి. డ్రోన్లు ఎగిరే ఎత్తును, అవి మోసుకుపోగల బాంబుల సామర్థ్యాన్ని ఎలా పెంచాలో జసీర్‌కు డాక్టర్ ఉమర్ సలహాలు ఇచ్చినట్లు గుర్తించారు. కశ్మీర్ సహా దేశంలోని వివిధ ప్రాంతాల్లో వీటితో దాడులు చేయాలనేది వారి పన్నాగం. దర్యాప్తు అధికారుల సమక్షంలో జసీర్ వీటిని మరోసారి తయారుచేసి చూపించాడు. బాంబులకు కావాల్సిన పరికరాలను ఆన్‌లైన్ సంస్థల ద్వారా ఇతడు రప్పించుకుని, అవి చేతికి వచ్చాక డబ్బు చెల్లించేవాడు. బాంబు పేలుడు కోసం వాడిన పదార్థం ‘ట్రై ఎసిటోన్ ట్రై పెరాక్సైడ’ (టీఏటీపీ) అని గుర్తించారు.


