Rohini Karte : ఏపీలో భానుడి భీకర రూపం.. మొదలైన రోహిణి కార్తె.. 45 డిగ్రీల దాటే ఎండలు.. ప్రజలకు అలర్ట్! Rohini Karte heatwave. | ఈస్ట్ గోదావరి వార్తలు (East Godavari News)


Last Updated:

ఏపీలో రోహిణి కార్తెతో ఉష్ణోగ్రతలు 45 డిగ్రీలకు చేరువ, గోదావరి జిల్లాల్లో 44 డిగ్రీలు దాటగా, అధికారులు మధ్యాహ్నం బయటకు రావొద్దని, జాగ్రత్తలు పాటించాలని హెచ్చరిక

+

News18

News18

ఏపీలో భానుడు తన అసలు ప్రతాపం చూపించడం ప్రారంభించాడు. ఇప్పటికే 45 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదవుతున్న వేళ.. ఇప్పుడు రోహిణి కార్తె ప్రభావం మొదలవడంతో పరిస్థితి మరింత భయంకరంగా మారే సూచనలు కనిపిస్తున్నాయి. పెద్దలు రోహిణి కార్తెలో రోళ్లు కూడా బద్దలవుతాయి అని చెప్పే సామెత ఈసారి నిజమవుతుందేమో అన్నట్టుగా ఎండలు మండిపోతున్నాయి. వాతావరణ శాఖ అంచనాల ప్రకారం మే 25 నుంచి జూన్ 8 వరకు రోహిణి కార్తె ప్రభావం అత్యధికంగా ఉండనుంది. ఈ కాలంలో సాధారణ రోజులతో పోలిస్తే ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు.

ఇప్పటికే విజయవాడ, విశాఖపట్నం, కాకినాడ, రాజమండ్రి, గుంటూరు, ఏలూరు ప్రాంతాల్లో వడగాల్పులు తీవ్రంగా వీచుతున్నాయి. గోదావరి జిల్లాల్లో ఆదివారం 44 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదవ్వడంతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అయ్యారు. రోహిణి కార్తె పూర్తిస్థాయిలో ప్రారంభమైతే ఈ ఉష్ణోగ్రతలు ఇంకా పెరిగే అవకాశముందని అధికారులు చెబుతున్నారు. ఉదయం 10 గంటలు దాటితే రోడ్లపై జనసంచారం తగ్గిపోతుండగా.. మధ్యాహ్నం సమయంలో బయటికి రావడానికే ప్రజలు భయపడుతున్నారు. ముఖ్యంగా వృద్ధులు, చిన్నపిల్లలు, అనారోగ్య సమస్యలతో బాధపడేవారు అత్యంత అప్రమత్తంగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు.

ఇక మరోవైపు ఉమ్మడి విశాఖ, తూర్పుగోదావరి జిల్లాల్లో సాయంత్రం వేళ పెనుగాలులు ప్రజలను తీవ్రంగా ఇబ్బంది పెడుతున్నాయి. ఒక్కసారిగా ఈదురుగాలులు వీచడంతో చెట్లు విరిగిపడటం, విద్యుత్ స్తంభాలు కూలిపోవడం వంటి ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. అనకాపల్లి జిల్లాలో ఈ పెనుగాలుల కారణంగా ముగ్గురు ప్రాణాలు కోల్పోవడం ఆందోళన కలిగిస్తోంది. అయితే ప్రస్తుతం వీస్తున్న ఈ గాలులు నేరుగా రోహిణి కార్తె ప్రభావం కాదని, కానీ వాతావరణ మార్పుల సంకేతమని నిపుణులు భావిస్తున్నారు. అయినా గాలులు మొదలైన సమయంలో చెట్ల కింద నిలబడకూడదని అధికారులు హెచ్చరిస్తున్నారు.

కాకినాడ జిల్లాలో ఇప్పటికే జిల్లా కలెక్టర్ ప్రత్యేక హెచ్చరికలు జారీ చేశారు. అత్యవసర పరిస్థితులు తప్ప మధ్యాహ్నం వేళ బయటకు రావొద్దని సూచించారు. రోజువారీ కూలి పనులపై ఆధారపడే కార్మికుల పరిస్థితి మాత్రం అత్యంత దయనీయంగా మారింది. పూట గడవాలంటే తప్పనిసరిగా ఎండలోనే పని చేయాల్సి వస్తుండటంతో.. 42 డిగ్రీల వేడినీ లెక్కచేయకుండా కష్టపడుతున్నారు. కొంతసేపు చెట్ల నీడలో విశ్రాంతి తీసుకుంటూ జీవన పోరాటాన్ని కొనసాగిస్తున్నారు.

ఈ పరిస్థితుల్లో ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. ఎక్కువగా నీరు తాగడం, బయటకు వెళ్లేటప్పుడు తల కప్పుకోవడం, చిన్నపిల్లలను ఎండలో తిరగనివ్వకపోవడం వంటి సూచనలు చేస్తున్నారు. ముఖ్యంగా మధ్యాహ్నం 12 నుంచి 3 గంటల మధ్య బయట తిరగకపోవడం మంచిదని చెబుతున్నారు. వడదెబ్బ లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలని సూచిస్తున్నారు.

ఇలాంటి మండే ఎండల్లో ప్రజలకు నిజమైన ఉపశమనం ఇచ్చేది చెట్లేనని మరోసారి స్పష్టమవుతోంది. ఒకప్పుడు గ్రామాల్లో చెట్ల నీడలో ప్రజలు విశ్రాంతి తీసుకునేవారు. ఇప్పుడు పట్టణాల్లో ఆ చెట్లే కనిపించకుండా పోతుండటంతో వేడి మరింత పెరుగుతోంది. అందుకే పర్యావరణ పరిరక్షణ, మొక్కలు నాటడం, చెట్లను కాపాడుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యతగా మారిందని నిపుణులు చెబుతున్నారు. రోహిణి కార్తె ఎండలు ఇంకా రెండు వారాలు తీవ్రంగా ఉండే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

Click here to add News18 as your preferred news source on Google.

ఆంధ్రప్రదేశ్‌లోని ముఖ్యమైన వార్తలు, లేటెస్ట్ న్యూస్, స్థానిక వార్తలు, ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ప్రకటనలు, అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించిన స్టోరీలను న్యూస్18 తెలుగు ఆంధ్రప్రదేశ్ కేటగిరీలో చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *