Last Updated:
Water Conservation: జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ నేతృత్వంలో జలధార కార్యక్రమంపై సమీక్ష, 3106 చెరువుల ఫీడర్ కాలువల పునరుద్ధరణకు ఆదేశాలు, పనుల్లో జాప్యం చేస్తే కఠిన చర్యలు హెచ్చరిక
జిల్లాలోని సాగునీటి వ్యవస్థను బలోపేతం చేయడం ద్వారా రైతన్నల జీవితాల్లో వెలుగులు నింపేందుకు జిల్లా యంత్రాంగం నడుం బిగించింది. ముఖ్యంగా శిథిలావస్థకు చేరిన ఫీడర్ కాలువలు (పిల్ల కాలువలు) పునరుద్ధరించడం ద్వారా ప్రతి నీటి బొట్టును చెరువుకు చేర్చి, భూగర్భ జలాలను పెంపొందించడమే లక్ష్యంగా ‘జలధార – నీటి భద్రత’ కార్యక్రమం ఊపందుకుంటోంది.
సోమవారం స్థానిక కలెక్టరేట్లోని నాగార్జున ఐఏఎస్ వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుంచి పలమనేరు నియోజకవర్గ పరిధిలోని జలధార పనులపై జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ సుదీర్ఘ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన అధికారులకు జారీ చేసిన ఆదేశాలు, జిల్లాలోని సాగునీటి పరిస్థితిపై కీలక విశ్లేషణ ఇక్కడ ఉంది.
జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, గత ఆరు నెలల కాలంలో జిల్లాలో భూగర్భ జల మట్టం సగటున ఆరు మీటర్ల మేర పడిపోవడం ఆందోళన కలిగించే అంశమని పేర్కొన్నారు. రాబోయే నెలల్లో వర్షపాతం సాధారణం కంటే తక్కువగా ఉండే అవకాశం ఉందన్న వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో, కురిసిన ప్రతి వర్షపు చుక్కను వృథా పోనివ్వకుండా చెరువులకు మళ్లించాల్సిన బాధ్యత అధికారులపై ఉందన్నారు.
జిల్లాలో ఉన్న మొత్తం 3,106 చెరువుల సమగ్ర నివేదికలను సిద్ధం చేయాలని ఆయన ఆదేశించారు. ప్రతి మండలంలోని మైనర్ ఇరిగేషన్ (MI) ట్యాంకులను క్షేత్రస్థాయిలో పరిశీలించి, వాటి ఫీడర్ కాలువలు ఆక్రమణలకు గురయ్యాయా లేదా పూడికతో నిండిపోయాయా అనే అంశంపై స్పష్టత ఉండాలని స్పష్టం చేశారు.
ఫీడర్ కాలువల పునరుద్ధరణ పనులను పక్కా ప్రణాళికతో చేపట్టాలని కలెక్టర్ సూచించారు. సాధ్యమైనంత వరకు మట్టి పని కింద శ్రామికులను ఉపయోగించి కాలువల పూడికతీత పనులు చేపట్టాలి. శ్రామికులు పని చేయడానికి వీలు లేని కఠినమైన భౌగోళిక ప్రాంతాలలో ప్రత్యేక టీఆర్-27 (TR-27) నిధులను వెచ్చించి యంత్రాల సహాయంతో పనులను సత్వరమే పూర్తి చేయాలని ఆదేశించారు.
ముఖ్యంగా పలమనేరు నియోజకవర్గంలోని పెద్దపంజాణి, పలమనేరు, వి.కోట, బైరెడ్డిపల్లి, గంగవరం మండలాలపై కలెక్టర్ ప్రత్యేకంగా ఆరా తీశారు. కాలువల్లో ఉన్న అడ్డంకులు ఏమిటి అనేటటువంటి అంశాలపై పూర్తి స్థాయి డాక్యుమెంటేషన్ ఉండాలని ఆదేశించారు. కొన్ని మండలాల్లో భూ వివాదాల కారణంగా పనులు ఆగిపోయినట్లు గుర్తించిన కలెక్టర్, రెవెన్యూ అధికారులతో సమన్వయం చేసుకుని ఆ సమస్యలను వెంటనే పరిష్కరించాలని సూచించారు.
వచ్చే సమీక్షా సమావేశానికి వచ్చేటప్పుడు అధికారులు మొక్కుబడి సమాచారంతో కాకుండా, క్షేత్రస్థాయి వాస్తవాలతో కూడిన సమగ్ర నివేదికలతో హాజరు కావాలని కలెక్టర్ హెచ్చరించారు. పనుల్లో జాప్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేశారు. జలధార-జలహారతి కార్యక్రమం కేవలం ఒక ప్రభుత్వ కార్యక్రమం కాదని, ఇది జిల్లా భవిష్యత్తు నీటి అవసరాలకు సంబంధించిన కీలక ఘట్టమని ఆయన వివరించారు.
ఈ కీలక సమావేశంలో డ్వామా పీడీ రవికుమార్, ఇరిగేషన్ ఎస్ఈ వెంకటేశ్వర రాజు, గ్రౌండ్ వాటర్ డిడి గోవర్ధన్, వివిధ మండలాల ఎంపీడీవోలు, ఏపీడీలు, ఇరిగేషన్ ఏఈలు పలమనేరు నియోజకవర్గ సంబంధిత అధికారులు పాల్గొన్నారు. ఈ పనులు గనుక సకాలంలో పూర్తయితే, రాబోయే వర్షాకాలంలో జిల్లాలోని చెరువులన్నీ జలకళను సంతరించుకోవడమే కాకుండా, పాతాళానికి పడిపోయిన నీటి మట్టం మళ్ళీ పైకి వచ్చి రైతన్నల సాగు నీటి కష్టాలు తీరడం ఖాయంగా కనిపిస్తోంది
ఆంధ్రప్రదేశ్లోని ముఖ్యమైన వార్తలు, లేటెస్ట్ న్యూస్, స్థానిక వార్తలు, ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ప్రకటనలు, అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించిన స్టోరీలను న్యూస్18 తెలుగు ఆంధ్రప్రదేశ్ కేటగిరీలో చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.
Hyderabad,Telangana



