Last Updated:
Simhachalam Temple:సింహాచలంలో ఘనంగా లక్షలాది భక్తులు విచ్చేసి శ్రీ వరాహ లక్ష్మీనరసింహస్వామి నిజరూప దర్శనం చేసుకుంటున్నారు. నిజరూప దర్శనం చేసుకోవడం తాము ఎంతో పుణ్యం చేసుకొని ఉంటామని భక్తులు అంటున్నారు. ఏడాది పొడవున సుగంధభరిత చందనంలో కొలువుండే సింహాద్రి నాథుడు ఒక్కరోజు మాత్రమే తన నిజ రూపదర్శనం భక్తులకు గావిస్తారు.
Simhachalam Temple: సింహాచలంలో ఘనంగా లక్షలాది భక్తులు విచ్చేసి శ్రీ వరాహ లక్ష్మీనరసింహస్వామి నిజరూప దర్శనం చేసుకుంటున్నారు. నిజరూప దర్శనం చేసుకోవడం తాము ఎంతో పుణ్యం చేసుకొని ఉంటామని భక్తులు అంటున్నారు. ఏడాది పొడవున సుగంధభరిత చందనంలో కొలువుండే సింహాద్రి నాథుడు ఒక్కరోజు మాత్రమే తన నిజ రూపదర్శనం భక్తులకు గావిస్తారు. దీనినే భక్తులంతా చందనోత్సవంగా, చందనయాత్రగా పిలుస్తారు. వైశాఖ శుద్ధ తదియనాడు తన దివ్యమైన నిజరూపాన్ని చందనం లేకుండా భక్తులకు ప్రసాదించి, తనకు జరగాల్సిన అన్ని పూజలు, అభిషేకాలు ఆ ఒక్కరోజులోనే జరిపించుకుని రాత్రికి అతి గొప్పగా సహస్రఘటాభిషేకాన్ని పూర్తి చేసుకుని తిరిగి చందనదారుడు కానున్న అప్పన్న చందనోత్సవానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది.
ఆలయ చరిత్రలో చందనోత్సవం ప్రాచుర్యం పొందింది. నాటి పురూరవ చక్రవర్తుల కాలం నుంచి నేటి వరకు క్రమం తప్పకుండా సింహగిరిపై ఈ చందనోత్సవం వైభవంగా కొనసాగుతూ వస్తుంది. తన చల్లని చూపులతో భక్తులపై కరుణా కటాక్షాలు ప్రసరింపజేసి వారికి అండగా ఉంటూ కాపాడుతారని భక్తకోటికి నమ్మకం. ఉగ్రరూపాన్ని తనలోనే దాచిపెట్టుకొని బయటకు మాత్రం చందనదారిగా దివ్యదర్శనం ఇచ్చే ఆ సింహాద్రినాథుడి మహిమలు ఎన్నో. ప్రపంచంలోనే ప్రముఖ పుణ్యక్షేత్రంగా విరాజిల్లి, ప్రజల ఆరాధ్య దైవంగా, భక్త కోటి ఇలవేల్పు సింహాచలం శ్రీవరాహా లక్ష్మీనృ సింహస్వామి నిజరూపదర్శనం ఉత్సవాన్ని సోమవారం వైభవంగా నిర్వహించేందుకు ఆలయ వర్గాలు ఏర్పాట్లు పూర్తి చేశాయి.
పూర్వం పురూరవ చక్రవర్తి ఊర్వశితో కలిసి పుష్పక విమానంపై విహరించడం జరుగుతుంది. అయితే ఆ విమానం సింహగిరిపైకి రాగానే ఉన్నట్టుండి ఒక్కసారిగా నిలిచిపోతుంది. అయితే ఏం జరిగిందన్నది పురూరవ చక్రవర్తికి తెలియని పరిస్థితి. అప్పుడు ఊర్వశి దేవకన్య కావడంతో తన దివ్యదృష్టితో నిశితంగా పరిశీలించి ఇది అత్యంత మహిమాన్వితమైన సింహగిరి పర్వతమని పురూరవ చక్రవర్తికి చెబుతుంది. దీంతో ఆ రోజు వారు అక్కడే బసచేయగా రాత్రికి సింహాద్రినాధుడు పురూరవ చక్రవర్తి కలలో సాక్షాత్కరించి తాను ఇక్కడే ఒక పుట్టలోయలో ఉన్నానని, కావున తనను వెలికితీసి గొప్ప ఉత్సవం నిర్వహించాలని ఆదేశిస్తారు. దీంతో మరుసటిరోజు పురూరవ చక్రవర్తి స్వామివారి కోసం సింహగిరి లోయల్లో వెతుకులాట ప్రారంభిస్తారు. అయినప్పటికి కానరాక పోవడంతో మరోసారి పురూరవ చక్రవర్తికి తాను ఎక్కడ ఉన్నది స్వామి స్పష్టంగా చెబుతారు.
దీంతో మరుసటిరోజు పురూరవ చక్రవర్తి స్వామి విగ్రహాన్ని 12 అడుగుల పుట్టలోయలో నుంచి వెలికితీస్తాడు. ఆ తరువాత స్వామి ఆదేశించిన ప్రకారం అత్యంత గొప్పగా చందనోత్సవ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. అలా నాటి పురూరవ చక్రవర్తుల కాలం నుంచి నేటి వరకు క్రమం తప్పకుండా ఈ చందనోత్సవాన్ని అత్యంత వైభవంగా నిర్వహిస్తూ వస్తున్నారు. స్వామి విగ్రహం 12 అడుగుల పుట్టలో నుంచి వెలికి తీసినందుకు గాను స్వామి దేహంపై 12 మణుగుల చందనం నిత్యం ఉంటుంది. స్వామి నిజ రూపాన్ని నిరంతరం భక్తులు చూడకుండా ఏడాదికి ఒక్కరోజు మాత్రమే స్వామి ఆదేశించిన ప్రకారం వైశాఖ శుద్ద తదియనాడు మాత్రమే భక్తులకు తన దర్శనం గావిస్తారు. ఆ తరువాత మిగిలిన ఏడాది పొడవునా స్వామి ఎల్లప్పుడూ నిండు చందనంతో చల్లగా ఉంటూ ప్రజలను సుభిక్షంగా కాపాడుతారన్నది అప్పన్న భక్తుల నమ్మకం. సాదారణ రోజుల్లో సింహాద్రినాధుడు నిత్యరూపంలో బంగారు శాంతమూర్తిగా భక్తులకు తన దర్శనమిస్తారు.
ఆంధ్రప్రదేశ్లోని ముఖ్యమైన వార్తలు, లేటెస్ట్ న్యూస్, స్థానిక వార్తలు, ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ప్రకటనలు, అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించిన స్టోరీలను న్యూస్18 తెలుగు ఆంధ్రప్రదేశ్ కేటగిరీలో చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.
Visakhapatnam,Andhra Pradesh


