Food Donation: మానవత్వానికి నిలువుటద్దం ఈ వ్యక్తి.. 140 రోజులుగా పేదల ఆకలి తీరుస్తున్న ‘నిత్య అన్నదాత’ ఎవరో తెలుసా.. | అనంతపురం వార్తలు (Anantapuram News)


Last Updated:

బడల్ నిసార్ యాసీన్ ఖాన్ 140 రోజులుగా విరామం లేకుండా SIMS హాస్పిటల్ వద్ద పేదలకు ఉచిత అన్నదానం, తన జీతంతోనే ఖర్చు చేసి నిస్వార్థ సేవ కొనసాగిస్తున్నారు

+

అన్నదాన

అన్నదాన ప్రభు…100 రోజుల నిత్య అన్నదానం ఎవరు ఆకలితో ఉండకూడదు…

మానవ సేవయే మాధవ సేవగా భావించి, ఆకలితో ఉన్నవారికి అన్నం పెట్టడమే పరమార్థంగా జీవిస్తున్న వ్యక్తులు ఈ సమాజంలో అరుదుగా ఉంటారు. అటువంటి అరుదైన కోవకు చెందిన వ్యక్తి బడల్ నిసార్ యాసీన్ ఖాన్. మండుటెండలో పని చేసే కూలీ అయినా, ఆసుపత్రి గడప ముందు దిక్కు తోచని స్థితిలో ఉన్న రోగి బంధువైనా.. ఎవరైనా సరే మధ్యాహ్నం వేళ ఆకలితో ఉండకూడదనే ఒకే ఒక్క లక్ష్యంతో ఆయన ‘నిత్య అన్నదాన’ యజ్ఞాన్ని ప్రారంభించారు.

గడిచిన 140 రోజులుగా ఒక్క రోజు విరామం లేకుండా ఈ అన్నదాన కార్యక్రమం కొనసాగుతోంది. ముఖ్యంగా SIMS హాస్పిటల్ పరిసరాల్లో చికిత్స నిమిత్తం వచ్చే రోగులు, వారి వెంట వచ్చే పేద బంధువులు, అలాగే పనుల కోసం నగరానికి వచ్చే రోజువారీ కూలీలే ఈ అన్నదాన కార్యక్రమానికి ప్రధాన లబ్ధిదారులు. సుదూర ప్రాంతాల నుంచి వచ్చే పేదలు హోటళ్లలో అధిక ధరలు పెట్టి భోజనం కొనలేని స్థితిలో ఉన్నప్పుడు, యాసీన్ ఖాన్ అందిస్తున్న ఈ పోషకాహారం వారికి కొండంత అండగా నిలుస్తోంది.

ఈ సేవా కార్యక్రమం వెనుక ఉన్న అత్యంత ఆశ్చర్యకరమైన స్ఫూర్తిదాయకమైన విషయం ఏమిటంటే.. యాసీన్ ఖాన్ దీని కోసం ఎవరి దగ్గర నుంచి ఒక్క రూపాయి విరాళం ఆశించకపోవడం. ఆయన ఒక ప్రైవేట్ ఉద్యోగం చేస్తూ, తనకు వచ్చే జీతంలో కొంత శాతాన్ని ప్రతి నెలా ఈ అన్నదానానికి కేటాయిస్తున్నారు. భోజనానికి కావాల్సిన బియ్యం, తాజా కూరగాయలు, ఇతర దినుసులను ఆయనే స్వయంగా మార్కెట్ నుండి కొనుగోలు చేస్తారు.

“దైవ సంకల్పం ఉంటే నా జీవితాంతం ఈ సేవను ఇలాగే కొనసాగిస్తాను” అని యాసీన్ ఖాన్ లోకల్ 18తో మాట్లాడుతూ తన దృఢ సంకల్పాన్ని చాటుకున్నారు. ఎటువంటి ప్రచారం ఆశించకుండా, కేవలం ఆకలి తీర్చాలనే తపనతో ఆయన చేస్తున్న ఈ కృషి పట్ల స్థానికుల నుంచి ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.

ఈ అన్నదాన కార్యక్రమం కేవలం భోజనం పంపిణీ చేయడానికే పరిమితం కాలేదు. ఇక్కడ శుభ్రతకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నారు. భోజనం చేసే వారికి తాగునీరు, కూర్చోవడానికి వసతులు, పద్ధతిగా భోజనం వడ్డించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. SIMS హాస్పిటల్ సేవా బృందం సభ్యులు యాసీన్ ఖాన్ ఆలోచనకు మద్దతుగా నిలుస్తూ, స్వచ్ఛందంగా పంపిణీ బాధ్యతల్లో పాలుపంచుకుంటున్నారు.

గత మూడు నెలలుగా ప్రతిరోజూ ఇక్కడే భోజనం చేస్తున్నానని జిలాన్ అనే రోజువారీ కూలీ ఎంతో ఆనందంగా తెలిపారు. పనుల కోసం పల్లెల నుంచి నగరానికి వచ్చే తమ వంటి వారికి, మధ్యాహ్నం వేళ కడుపు నిండా భోజనం దొరకడం ఒక పెద్ద భరోసా అని ఆయన లోకల్ 18తో పంచుకున్నారు.

నిస్వార్థంగా సాగుతున్న ఈ అన్నదాన కార్యక్రమం, ఆకలి తీర్చడమే కాకుండా వందలాది మంది పేదలకు “మేమున్నాం” అనే సామాజిక భరోసాను కల్పిస్తోంది. యాసీన్ ఖాన్ వంటి వారు ఉండటం వల్లే మానవత్వం ఇంకా బతికే ఉందని ఈ కార్యక్రమం నిరూపిస్తోంది.

Click here to add News18 as your preferred news source on Google.

ఆంధ్రప్రదేశ్‌లోని ముఖ్యమైన వార్తలు, లేటెస్ట్ న్యూస్, స్థానిక వార్తలు, ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ప్రకటనలు, అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించిన స్టోరీలను న్యూస్18 తెలుగు ఆంధ్రప్రదేశ్ కేటగిరీలో చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *