తిరుమల: తెలుగు రాష్ట్రాల్లో ప్రముఖ విద్యా సంస్థల ఛైర్మన్ భాష్యం రామకృష్ణ సోమవారం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జన్మదినోత్సవం సందర్భంగా ఆయన ఈ దర్శనం చేశారు. ఈ సందర్భంగా రామకృష్ణ, టీటీడీకి రూ.44 లక్షల విరాళాన్ని అందజేసి, శ్రీవారి పేరు మీద భక్తులకు అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు.
శ్రీవారి రంగనాయకుల మండపంలో వేదపండితులు ఆయనకు వేదాశీర్వచనం అందించారు. ఆలయ అధికారులు తీర్థప్రసాదాలు, పట్టువస్త్రాలతో సత్కరించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై శ్రీవారి కృపాకటాక్షాలు ఎల్లప్పుడూ ఉండాలని రామకృష్ణ ప్రార్థించారు.
ఇదిలా ఉండగా, గతంలో టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్ పుట్టినరోజు సందర్భంగా కూడా రామకృష్ణ టీటీడీకి రూ.44 లక్షల విరాళం అందజేసినట్లు తెలిసింది. సోమవారం శ్రీవారిని 76,406 మంది భక్తులు దర్శించుకున్నారు. హుండీ ఆదాయం రూ.3.45 కోట్లుగా నమోదైంది. భక్తుల రద్దీ కారణంగా 8 వెయిటింగ్ కంపార్ట్‌మెంట్లు నిండిపోయాయి.


