Last Updated:
తుని స్వయంభూ శ్రీ భద్రకాళి అమ్మవారి గంధ అమావాస్య జాతర మూడు రోజులుగా వైభవంగా కొనసాగుతోంది, నిండు తాంబూలం కోసం మహిళలు భారీగా తరలివస్తున్నారు
గోదావరి జిల్లాల ఆధ్యాత్మిక వైభవాన్ని ప్రతిబింబించే తుని స్వయంభూ శ్రీ భద్రకాళి అమ్మవారి క్షేత్రం మరోసారి భక్తిరసంతో కళకళలాడుతోంది. భూమిలోపల స్వయంభుగా వెలిసిన చిన్న విగ్రహ రూపంలో దర్శనమిచ్చే ఈ అమ్మవారు, భక్తుల్లో ప్రత్యేక విశ్వాసాన్ని కలిగించిన దైవంగా పేరుపొందారు. ముఖ్యంగా ఏడాదికి ఒక్కసారి జరిగే గంధ అమావాస్య జాతర మహోత్సవాలు ప్రారంభమవుతూనే క్షేత్రం మొత్తం ఆధ్యాత్మిక వాతావరణంతో నిండిపోయింది.
సాధారణ దేవాలయాలకంటే భిన్నంగా భూమిలో నుంచే వెలిసిన ఈ దివ్య రూపం, భక్తులకు మరింత ఆత్మీయ అనుభూతిని కలిగిస్తుంది. గంధ అమావాస్య రోజున అమ్మవారిని దర్శిస్తే మాంగల్య ఫలం, ఆరోగ్యం, ఐశ్వర్యం కలుగుతాయని ఉన్న గాఢ నమ్మకంతో మహిళలు పెద్ద ఎత్తున తుని వైపు తరలివస్తున్నారు. ఒక్కరోజు దర్శనం చాలు అన్న భావనతోనే వేలాది మంది మహిళలు అమ్మవారి సన్నిధిని చేరుకుంటున్నారు.
ఈ జాతర మూడు రోజుల పాటు వైభవంగా కొనసాగనుంది. తొలిరోజు అమ్మవారి కలశ స్థాపనతో పూజలు ప్రారంభమయ్యాయని ఆలయ అర్చకులు తెలిపారు. ఉదయం నుంచే లలితా సహస్రనామ పారాయణాలతో ఆలయం మార్మోగిపోయింది. భక్తులు భక్తి పారవశ్యంలో మునిగి అమ్మవారిని ప్రార్థించారు.
జాతరలో అత్యంత ప్రత్యేక ఆకర్షణగా నిలిచేది నిండు తాంబూలం. ప్రతి ఏడాది లాగే ఈసారి కూడా మహిళలకు పసుపు, కుంకుమ, గాజులు, జాకెట్ ముక్క, అరటిపండ్లతో కూడిన తాంబూలాన్ని ఆలయ కమిటీ అందించింది. ఈ తాంబూలం స్వీకరిస్తే ఏడాదంతా అమ్మవారి కృప లభిస్తుందని, ఆరోగ్యం, ఐశ్వర్యం కలుగుతాయని భక్తులు విశ్వసిస్తున్నారు. దీంతో తాంబూలం కోసం మహిళలు పెద్ద ఎత్తున క్షేత్రానికి పోటెత్తారు.
జగత్ జనని అయిన శ్రీ భద్రకాళి అమ్మవారి సన్నిధిలో జరుగుతున్న ఈ మహోత్సవాలు భక్తులకు ఒక ఆధ్యాత్మిక అనుభూతిని అందిస్తున్నాయి. రానున్న రోజుల్లో కుంకుమ పూజలు, విశేష అభిషేకాలు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు ఆలయ చైర్మన్ ఎస్.ఆర్.వి.వి. పృధ్వీరాజ్ తెలిపారు. ఏడాదికి ఒక్కసారి జరిగే ఈ గంధ అమావాస్య జాతర, భక్తుల విశ్వాసం, భక్తి, సంప్రదాయాల కలయికగా నిలుస్తోంది. “ఒక్కసారి అమ్మవారిని దర్శిస్తే చాలు.. ఏడాదంతా కాపాడుతుంది” అన్న నమ్మకంతో తుని భద్రకాళి అమ్మవారి క్షేత్రం భక్తులతో నిండిపోతోంది.
ఆంధ్రప్రదేశ్‌లోని ముఖ్యమైన వార్తలు, లేటెస్ట్ న్యూస్, స్థానిక వార్తలు, ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ప్రకటనలు, అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించిన స్టోరీలను న్యూస్18 తెలుగు ఆంధ్రప్రదేశ్ కేటగిరీలో చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.
East Godavari,Andhra Pradesh


