మహిళా రిజర్వేషన్ మార్గదర్శి


భారత రాజకీయాల్లో మహిళల హక్కుల కోసం అంకితభావంతో పోరాడిన నేతల్లో గీతా ముఖర్జీ పేరు ప్రత్యేకంగా వినిపిస్తుంది. 1996 సెప్టెంబర్ 12న మహిళలకు లోక్‌సభ , రాష్ట్ర అసెంబ్లీలలో 33% రిజర్వేషన్ కల్పించాలని డిమాండ్ చేస్తూ ప్రైవేట్ మెంబర్ బిల్లును ప్రవేశపెట్టిన తొలి ఎంపీగా చరిత్ర సృష్టించారు. 1996 లో అప్పటి ప్రధాన మంత్రి దేవెగౌడ నాయకత్వంలోని యునైటెడ్ ఫ్రంట్ ప్రభుత్వం ఈ బిల్లును పార్లమెంట్‌లో ప్రవేళపెట్టి మహిళలకు 33 శాతం రిజర్వేషన్ ఇవ్వాలని ప్రతిపాదించారు. ఈ బిల్లును పరిశీలించేందుకు పార్లమెంట్ జాయింట్ సెలెక్ట్ కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కమిటీకి గీతా ముఖర్జీ అధ్యక్షత వహించారు. మొత్తం 31 మంది సభ్యులతో కూడిన ఈ కమిటీకి దేశవ్యాప్తంగా ఉన్న మహిళా సంఘాలు, సామాజిక సంస్థల నుంచి 102 వినతిపత్రాలు వచ్చాయి. కొంతమంది మహిళలు రక్తంతో సంతకాలు చేసి పంపిన వినతులు గీతా ముఖర్జీని భావోద్వేగానికి గురిచేశాయి. దాంతో గీతా ముఖర్జీ ఈ బిల్లును ఆమోదింపజేయాలని సంకల్పించుకున్నారు. మూడు నెలల్లోనే కమిటీ తన నివేదికను అంటే 1996 డిసెంబర్ 9న లోక్‌సభకు సమర్పించింది. అయితే బిల్లుకు తీవ్ర ప్రతిఘటన ఎదురై పార్లమెంట్‌లో గందరగోళం నెలకొంది. దాంతో£ బిల్లు ముందుకు సాగలేదు. గీతా ముఖర్జీ తన లక్ష్యం కోసమే కట్టుబడి ఉంటారు అనడానికి ఎన్నో ఉదాహరణలు ఉన్నారు. బిల్లుపై పూర్తిగా దృష్టి పెట్టాలనే ఉద్ధేశంతోనే ఐకే గుజ్రాల్ ప్రభుత్వం మంత్రి పదవిని ఇచ్చినా ఆమె తిరస్కరించారు. ఆ తర్వాత 1997 ఆగస్టు 14న బిల్లును చర్చకు తీసుకురావాలని ఆమె ప్రయత్నించారు. కానీ అది అజెండాలో 24వ అంశంగా ఉండటంతో ఆ రోజు చర్చకు రాలేదు. ఈ సందర్భంగా ఆమె తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. పార్లమెంట్‌లో విఫలమైనా గీతా ముఖర్జీ వెనక్కి తగ్గలేదు. దేశవ్యాప్తంగా పర్యటిస్తూ మహిళా రిజర్వేషన్ బిల్లుకు మద్దతు కూడగట్టారు. ఒకనొక సందర్భంలో ఆమె భావోద్వేగంతో “నా భర్త చనిపోయినప్పుడు కూడా నేను బాధపడకుండా ధైర్యంగా ఉన్నాను, కానీ ఈరోజు నాకు చాలా బాధకలుగుతోంది” అని ఆవేదన వ్యక్తం చేశారు. ఓబీసీ మహిళలకు ప్రత్యేక కోటా ఇవ్వాలన్న డిమాండ్‌ను ఆమె వ్యతిరేకించారు. శాసనసభలలో లేదా పంచాయతీలలో ఓబీసీ రిజర్వేషన్‌కు ఎలాంటి పూర్వ ఉదాహరణలు లేవని వాదిస్తూ, 33 శాతం కోటాలో ఉప-రిజర్వేషన్ లేదా కోటాకు ముఖర్జీ తన అభ్యంతరాలను వ్యక్తం చేశారు. 1997 కమిటీ నివేదిక ప్రకారం, ఓబీసీ ఆధిపత్యం ఉన్న నియోజకవర్గాలలో ఓబీసీ మహిళలను నియమించడం ద్వారా రిజర్వేషన్ లేకుండానే ఈ సమస్యను పరిష్కరించవచ్చని ఆమె సూచించారు. గీతా ముఖర్జీ ముఖ్యంగా మహిళా బీడీ కార్మికుల రంగంలో మహిళల హక్కుల పోరాటంలో పాల్గొన్న ప్రముఖ వ్యక్తి. ఆమెకు ఉన్న ఆరోగ్య సమస్యలు ఆమె సంకల్పాన్ని అడ్డుకోలేకపోయాయి. 1980ల మధ్యలో ఓపెన్-హార్ట్ సర్జరీ అయ్యాక శరీరం సహకరిచకపోయినప్పటికీ మహిళల రాజకీయ హక్కుల సాధనలో ఆమె తన పాత్రను కొనసాగించారు. మహిళా రిజర్వేషన్‌పై సీపీఐలో ఏర్పాటైన కమిషన్‌కు అధ్యక్షత వహించి, చట్టబద్ధత కోసం కృషి చేశారు. ఇక ఆమె వ్యక్తిగత జీవితం ఉద్యమాలతో ముడిపడి ఉంది. కమ్యూనిస్ట్ నేత విశ్వనాథ్ ముఖర్జీని వివాహం చేసుకుని, స్వాతంత్య్ర పోరాటం, ప్రజా ఉద్యమాల్లో పాల్గొన్నారు. బ్రిటిష్ వ్యతిరేక ఉద్యమాలు, 1946 పోస్ట్స్ అండ్ టెలిగ్రాఫ్ సమ్మె, విద్యార్థి పోరాటాల్లో పాల్గొన్నారు. 1948లో సీపీఐపై నిషేధం విధించినప్పుడు, ఆమెను, ఆమె భర్తను అరెస్టు చేసి జైలులో నిర్బంధించారు. 1978 నుంచి సీపీఐ జాతీయ మండలిలో సభ్యురాలిగా, జాతీయ కార్యవర్గంలో భాగస్వామిగా కీలక పాత్ర పోషించారు. లోక్‌సభలో పార్టీ ఉప నాయకురాలిగా కూడా పనిచేశారు. ఈమె రచయిత్రి కూడా. పిల్లల కోసం ‘భారత్ ఉపకథ’,‘చోటోదేర్ రవీంద్రనాథ’ , ‘హే అతిత్ కథా కావ’ వంటి పుస్తకాలు రచించారు. ‘భారత్ ఉపకథ’ భారతీయ జానపద కథల సంపుటిగా ప్రసిద్ధి చెందింది. అంతేకాక, బ్రూనో అపిట్జ్ రచించిన ‘నేకెడ్ అమాంగ్ వోల్వ్స’ను బెంగాలీలోకి అనువదించారు. ‘గీతా-దీ’గా ప్రజాదరణ పొందిన ఆమె మృదుభాషి, నిరాడంబర మహిళ. పశ్చిమ బెంగాల్‌లోని పాన్‌స్కురా నియోజకవర్గం నుంచి వరుసగా 7 సార్లు లోక్‌సభకు ఎన్నికయ్యారు. 1980 నుంచి 2000లో మరణించే వరకు ప్రతి ఎన్నికల్లోనూ విజయం సాధిస్తూ ప్రజాభిమానాన్ని నిలబెట్టుకున్నారు. 1924 జనవరి 8న కోల్కతాలో జన్మించిన గీతా ముఖర్జీ, అశుతోష్ కళాశాల నుంచి బెంగాలీ సాహిత్యంలో పట్టా పొందారు.
విద్యార్థి దశలోనే అల్ ఇండియా స్టూడెంట్స్ ఫెడరేషన్‌లో చురుకుగా పాల్గొని, కేవలం 15 ఏళ్ల వయస్సులోనే సీపీఐలో చేరడం ఆమె రాజకీయ చైతన్యానికి నిదర్శనం.ఆమె చివరిసారిగా 1999లో ఆ నియోజకవర్గం నుండి ఎన్నికయ్యారు. అయితే, 2000వ సంవత్సరం మార్చి 4న ఆమె మరణించారు. ఒక పార్లమెంటేరియన్‌గా, ప్రజారంగ సంస్థల పార్లమెంటరీ కమిటీ, షెడ్యూల్డ్ కులాలు , షెడ్యూల్డ్ తెగల సంక్షేమ కమిటీ , క్రిమినల్ లా (సవరణ) బిల్లు, 1980 పై సంయుక్త కమిటీలలో సభ్యురాలిగా ఆమె చేసిన సేవలను ఇప్పటికీ స్మరించుకుంటారు. గీతా ముఖర్జీ రాజకీయ నాయకురాలు మాత్రమే కాదు ఒక ఉద్యమం. మహిళల రాజకీయ భాగస్వామ్యానికి ఆమె మార్గదర్శకురాలు. “సమాజ నిర్మాణంలో మహిళలకు సరైన గుర్తింపు రావాలంటే పార్లమెంట్లో తగిన సంఖ్య ఉండాలి” అనే ఆమె విశ్వాసం ఎంతో ప్రేరణాత్మకం. మహిళల రాజకీయ హక్కుల సాధనలో ఆమె చేసిన సేవలు చిరస్మరణీయాలు. మహిళా రిజర్వేషన్ బిల్లు రూపకల్పనలోనూ, పార్లమెంట్ సంయుక్త సెలెక్ట్ కమిటీకి ఆమె అందించిన సేవలలోనూ ఆమె పాత్ర ఎంతో కీలకం. వాస్తవానికి, ఆ చట్టానికి ఆమెయే ప్రధాన రూపశిల్పి. ఆమె ఆ బిల్లుకు బలమైన మద్దతుదారు కూడా, తన జీవితకాలంలోనే దానిని ఆమోదింపజేస్తానని ప్రతిజ్ఞ చేశారు. దురదృష్టవశాత్తు, అది జరగలేదు. అయినప్పటికీ, ఆమె ఆశయం నెరవేరే రోజు మహిళా ఉద్యమ చరిత్రలో ఒక కీలక ఘట్టం అవుతుంది.

The post మహిళా రిజర్వేషన్ మార్గదర్శి appeared first on Visalaandhra.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *