రెండు దశాబ్దాల పాటు బిహార్ ముఖ్యమంత్రిగా ఉన్న జనతా దళ్ (యు) నాయకుడు నితీశ్ కుమార్ మంగళవారం రాజీనామా చేశారు. ఆయన స్థానంలో బీజేపీ నాయకుడు, నితీశ్ మంత్రివర్గంలో ఉపముఖ్యమంత్రిగా ఉన్న సమ్రాట్ చౌధŠరి బుధవారం ముఖ్యమంత్రిగా ప్రమాణం స్వీకరించనున్నారు. అయితే నితీశ్ నుంచి బీజేపీకి అధికారం బదలాయించడానికి దాదాపు నెల రోజులు పట్టింది. మార్చి మొదటి వారంలోనే నితీశ్ కుమార్ తనకు రాజ్యసభ సభ్యుడు కావాలన్న కోరిక ఉందని చెప్పారు. నిజానికి నితీశ్‌ను తప్పించి తమ పార్టీ నాయకుడిని ముఖ్యమంత్రిని చేయాలన్న పథకంతోనే బీజేపీ నితీశ్‌ను రాజ్యసభకు వెళ్లేలా చేసింది. ఆయన రాజ్యసభకు ఎన్నికైనట్టు మార్చి 16న అధికారిక ప్రకటన వెలువడింది. కానీ రాజీనామా చేసింది మాత్రం మంగళవారం నాడే. బీజెపీ తరఫున ఎవరు ముఖ్యమంత్రి కావాలో నిర్ణయించుకోవడానికి దాదాపు నెల సమయం పట్టింది. సమ్రాట్ చౌధరి ఎంపిక సునాయాసంగా జరగలేదు. బీజేపీ జె.డి.(యు) మంత్రివర్గంలో ఇప్పటిదాకా భాగస్వామిగా ఉంది తప్ప ప్రభుత్వానికి నాయకత్వం వహించలేదు. నితీశ్ కుమార్ గత 20 ఏళ్ల కాలంలో కొన్ని సార్లు బీజేపీతో పొత్తు కూడి ముఖ్యమంత్రి అయితే మరి కొన్నిసార్లు లాలూ ప్రసాద్ నాయకత్వంలోని రాష్ట్రీయ జనతా దళ్ (ఆర్.జె.డి.)తో కూడిన ప్రభుత్వంలో ముఖ్యమంత్రి. తాను పొత్తు కూడిన పార్టీకే ఎక్కువ స్థానాలున్నా తానే ముఖ్యమంత్రి కాగలిగిన చాకచక్యం నితీశ్ ప్రదర్శించగలిగారు. నితీశ్ కుమార్‌కు పల్టూ రాం అన్న పేరు ఉన్న మాట నిజమే కానీ ఈసారి ఆయన బీజేపీతో పొత్తు రద్దు చేసుకోలేదు. బీజేపీతో మైత్రి కొనసాగినా ఆయన తప్పుకునేట్టు బీజేపీనే మంత్రాంగం నడిపింది. నాలుగు నెలల కింద బిహార్ శాసనసభకు జరిగిన ఎన్నికలలో బీజేపీ 90 స్థానాలు సంపాదిస్తే నితీశ్ పార్టీ 85 సీట్లు సంపాదించగలిగింది. శాసనసభ ఎన్నికలలో నితీశ్ నాయకత్వం లేకపోతే గెలవడం సాధ్యం కాదని బీజేపీ గ్రహించింది. అందుకే జనతాదళ్ (యు)తో పొత్తు నటించింది. ఈ రెండు పార్టీలు కలిసి ఒక్కసారి కూడా ఉమ్మడిగా ఎన్నికల ప్రచార సభల్లో పాల్గొనలేదు. నితీశ్ పార్టీకన్నా అయిదు సీట్లు ఎక్కువ సంపాదించాం కనక ముఖ్యమంత్రి పదవి తమకే దక్కాలన్నది బీజేపీ వాదన. కానీ కారణాంతరాల వల్ల పదో సారి కూడా నితీశ్ ముఖ్యమంత్రి కావడానికి అంగీకరించింది. అప్పటినుంచీ నితీశ్‌ను ఎలా తప్పించాలా అని బీజేపీ వ్యూహాలు పన్నుతూనే ఉంది. చివరకు నితీశ్ బిహార్ రాజకీయాలను వదిలేట్టు చేయడంలో విజయం సాధించింది. దీనితో బిహార్ రాజకీయాల్లో నితీశ్ శకం ముగిసినట్టే. నితీశ్ భుజం మీద తుపాకీ పెట్టి బీజేపీ అధికారంలోకి రాగలిగింది. నితీశ్ కుమార్ రంగులు మార్చి ఉండొచ్చు. బిహార్‌లో అసాధారణమైన అభివృద్ధి సాధించి ఉండకపోవచ్చు. కానీ ఆయన మౌలికంగా సోషలిస్టు భావాల పునాది నుంచి రాజకీయాల్లో ఎదిగిన వారు. 2013లో బీజేపీ నరేంద్ర మోదీని ప్రధానమంత్రి అభ్యర్థిగా ప్రకటించినప్పుడు నితీశ్ అగ్గిమీద గుగ్గిలమైపోయారు. అయినా ఆ తరవాత బీజేపీతో కత్తు కలపడానికి ఆయన వెనుకాడలేదు. బీజేపీతో సంబంధం లేనప్పుడు ఆయన ప్రతిపక్షాలను ఏకం చేయడానికి తీవ్రంగా ప్రయత్నం చేశారు. సఫలం కూడా అయ్యారు. “ఇండియా” ఐక్య సంఘటన ఏర్పాటు కావడంలో ఆయన పాత్ర విశేషమైంది. కానీ ఆ ఐక్య సంఘటనకు నితీశ్‌ను కనీసం సమన్వయకర్తగా కూడా ప్రకటించకపోవడంతో తనకు బాగా అలవాటైన విద్యను ఆచరణలో పెట్టారు. ఏ బీజేపీకి వ్యతిరేకంగా ప్రతిపక్షాలను ఏకం చేయాలనుకున్నారో అదే బీజేపీతో చేయి కలిపారు. ఏం చేసినా ముఖ్యమంత్రి పదవిని నిలబెట్టుకోవడమే నితీశ్‌కు ప్రధాన లక్ష్యమైంది. నితీశ్ బీజేపీతో పొత్తు కూడినా ఎన్నడూ బహిరంగంగా ఆయన కమండల రాజకీయాలు నడపలేదు. విద్వేష రాజకీయాలను అనుసరించలేదు. అంటే ఆయన గణాంకాల మీదే ఎక్కువ ఆధారపడ్డారు. సైద్ధాంతికంగా ఆయన సంఘ్ పరివార్ రాజకీయాల మకిలి అంటించుకోలేదు. బిహార్‌లో ఉత్తరప్రదేశ్‌లో లాగా ‘మేం 80 శాతం, మీరు 20 శాతం’ అన్న నినాదాలు వినిపించలేదు. బుల్డోజర్లు వినియోగించలేదు. బీజేపీ కూడా నితీశ్ సర్కారులో భాగమైనా విద్వేష రాజకీయాలు సాగలేదు. పాకిస్థాన్ వెళ్లిపోండి అని అక్కడి బీజేపీ వారూ నినదించలేదు. గిరిరాజ్ సింగ్ లాంటి కరడు గట్టిన సంఘ్ పరివార్ నాయకులు ఉన్నప్పటికీ వారి సంకుచిత రాజకీయాల ఛాయలు నితీశ్ పాలనలో ఎప్పుడూ కనిపించలేదు. నితీశ్ తాను నమ్మిన సోషలిస్టు విధానాలను అమలుచేసి ఉండకపోవచ్చు. కానీ ఆయన కాషాయ రాజకీయాలను దూరంగా ఉంచగలిగారు. నితీశ్ హయాంలో నిర్వహించిన కులగణన దిగ్భ్రాంతి కలిగించే వాస్తవాలను బయటపెట్టింది. ఆ సమయంలో బీజేపీ కులగణనకు వ్యతిరేకం. ఇప్పుడు రాజకీయ అవసరం కనక అనుకూలం. వెంటనే హిందుత్వ రాజకీయాలను బీజేపీ బహిరంగంగా అనుసరించకపోవచ్చు. పరిపాలనా విధానాలు కూడా కొద్ది కాలమైనా నితీశ్ బాటలోనే నడపక తప్పదు. నితీశ్ మంత్రివర్గంలో ఉపముఖ్యమంత్రిగా ఉన్న సమ్రాట్ చౌధరీనే నితీశ్ తరఫున పరిపాలనలో ప్రధాన పాత్ర పోషించే వారు. అందుకని పాలనా విధానంలో పెద్ద మార్పు ఉండకపోవచ్చు. నితీశ్ కుమార్ పరిపాలనా కౌశలం వల్ల ఏం ఒరిగింది అన్న ప్రశ్న ఉన్నా ఆయనకు ‘సుశాన్ బాబు’అన్న పేరుంది. బీజేపీతో నితీశ్ బంధం ఈనాటిది కాదు. ఆయన అటల్ బిహారీ వాజపేయి మంత్రివర్గంలో రైల్వే, వ్యవసాయ శాఖలు నిర్వహించారు. అప్పుడు గైసల్ రైలు ప్రమాదానికి నైతిక బాధ్యత వహించి రాజీనామా చేశారు. నితీశ్ చేయని పని ఒకటి మిగిలిపోయింది. ఆయన తన రాజకీయ వారసుడిని తయారు చేయలేదు. మొన్న మొన్ననే కొడుకు నిశాంత్‌ను రాజకీయాలలోకి తీసుకొచ్చారు. జె.డి(యు)లోనూ ఫలానా వారు నితీశ్‌కు వారసుడు అని చెప్పే అవకాశం లేదు. బిహార్ రాజకీయాల నుంచి నితీశ్ నిష్క్రమణ తరవాత అక్కడి రాజకీయాలు ఏ మలుపు తిరుగుతాయో చూడాలి. బిహార్‌లో నితీశ్ క్రియాశీలంగా ఉండరు కనక ఆయన నాయకతంలోని జె.డి.(యు) బతికి బట్టకడుతుందా లేదా మిగతా అనేక చోట్ల లాగా ఆ ప్రాంతీయ పార్టీని కూడా బీజేపీ ఛిన్నాభిన్నం చేస్తుందా అన్నది ఆసక్తికరమైన అంశమే. మొట్టమొదటిసారి 1962లో బీహార్ అసెంబ్లీలో మూడు స్థానాలు సంపాదించిన బీజేపీ, 1967లో సంయుక్త విధాయక్ దళ్ మంత్రివర్గంలోనూ భాగస్వామి. బిహార్‌లో ప్రభుత్వ పగ్గాలు చేపట్టాలన్న బీజేపీ కల నెరవేరడానికి అర్ధశతాబ్దం పైగా పట్టింది.
The post నితీశ్ యుగాంతం appeared first on Visalaandhra.


