Last Updated:
పూతలపట్టు యాదమరిలో 23న సీఎం నారా చంద్రబాబు నాయుడు సంజీవని ప్రాజెక్ట్ ప్రారంభం, హెలీప్యాడ్, సభా ఏర్పాట్లు వేగం, కలెక్టర్ సుమిత్ కుమార్ పర్యవేక్షణ, భద్రత కట్టుదిట్టం
పూతలపట్టు నియోజకవర్గంలో రాజకీయ, పరిపాలనా వర్గాల్లో హడావిడి నెలకొంది. ఈనెల 23న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు యాదమరిలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొననుండటంతో జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. ముఖ్యంగా యాదమరి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సంజీవని ప్రాజెక్ట్ ను సీఎం చేతుల మీదుగా ప్రారంభించనుండటంతో స్థానికంగా భారీ ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని స్థానిక ఎమ్మెల్యే కే. మురళి మోహన్ పార్టీ శ్రేణులు, అధికారులకు పిలుపునిచ్చారు.
సీఎం పర్యటన నేపథ్యంలో జిల్లా అధికారులు క్షేత్రస్థాయిలో ఏర్పాట్లను వేగవంతం చేశారు. జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్, ఎమ్మెల్యే మురళి మోహన్‌తో కలిసి యాదమరిలో పర్యటించి కార్యక్రమ ప్రాంగణాలను పరిశీలించారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ప్రారంభోత్సవ ఏర్పాట్లతో పాటు, చిన్నారెడ్డిపల్లె బస్టాప్ సమీపంలో ఏర్పాటు చేయనున్న హెలీప్యాడ్ ప్రాంతాన్ని కూడా అధికారులు నిశితంగా తనిఖీ చేశారు. సీఎం పాల్గొనే బహిరంగ సభా ప్రాంగణం వద్ద భద్రత, ప్రజా సౌకర్యాలు, వేదిక నిర్మాణం వంటి అంశాలపై ప్రత్యేక దృష్టి సారించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ సుమిత్ కుమార్ మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి పర్యటనలో ఎలాంటి లోటుపాట్లు చోటుచేసుకోకుండా అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని స్పష్టం చేశారు. భద్రత నుంచి ట్రాఫిక్ నిర్వహణ వరకు ప్రతి అంశాన్ని పకడ్బందీగా అమలు చేయాలని ఆదేశించారు. ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని సూచించారు.
సీఎం చంద్రబాబు పర్యటన నేపథ్యంలో యాదమరిలో రాజకీయ వాతావరణం కూడా ఒక్కసారిగా వేడెక్కింది. స్థానిక నాయకులు, కార్యకర్తలు భారీగా హాజరయ్యే అవకాశముండటంతో గ్రామాల్లో ఇప్పటికే ప్రచార కార్యక్రమాలు ఊపందుకున్నాయి. సంజీవని ప్రాజెక్ట్ ద్వారా గ్రామీణ ప్రాంత ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందుతాయని అధికార వర్గాలు చెబుతున్నాయి. సీఎం సభకు భారీ సంఖ్యలో ప్రజలను తరలించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ పర్యటనలో జాయింట్ కలెక్టర్ ఏ. రాజేంద్రన్, డీఎస్పీ వెంకట నారాయణ, ఆర్డీవో శ్రీనివాసులు, తహసీల్దార్ పార్ధసారధి, ఎంపీడీవో వీరేంద్రతో పాటు పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. యాదమరిలో సీఎం టూర్ విజయవంతం చేసేందుకు జిల్లా యంత్రాంగం పూర్తిస్థాయిలో రంగంలోకి దిగింది.
ఆంధ్రప్రదేశ్‌లోని ముఖ్యమైన వార్తలు, లేటెస్ట్ న్యూస్, స్థానిక వార్తలు, ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ప్రకటనలు, అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించిన స్టోరీలను న్యూస్18 తెలుగు ఆంధ్రప్రదేశ్ కేటగిరీలో చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.
Chittoor,Chittoor,Andhra Pradesh



