విశాలాంధ్ర – తాడిపత్రి: అనంతపురం జిల్లాలో వైసీపీ నాయకుల దౌర్జన్యాలు, దాడులను తక్షణమే అరికట్టి, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు భరోసా కల్పించాలని మాజీ ఎమ్మెల్యే, మాజీ మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి రాష్ట్ర మంత్రి టీజీ భరత్‌ను కోరారు. సోమవారం తాడిపత్రి పట్టణంలోని సంజీవ్‌నగర్‌లో ఉన్న జేసీ నివాసానికి అనంతపురం జిల్లా టీడీపీ ఇన్చార్జి, రాష్ట్ర మంత్రి టీజీ భరత్‌తో పాటు టీడీపీ జిల్లా అధ్యక్షుడు పూల నాగరాజు మర్యాదపూర్వకంగా విచ్చేశారు. ఈ సందర్భంగా జిల్లాలో నెలకొన్న రాజకీయ పరిస్థితులు, నియోజకవర్గ అభివృద్ధి అంశాలు, పార్టీ కార్యకర్తలకు సంబంధించిన సమస్యలపై సుదీర్ఘంగా చర్చించారు. ఈ సందర్భంగా జేసీ ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ, టీడీపీ కార్యకర్తలపై గతంలో నమోదు చేసిన కేసులను సమీక్షించి ఉపసంహరించడంతో పాటు, అన్యాయంగా తెరిచిన రౌడీషీట్లను తొలగించేలా చర్యలు తీసుకోవాలని మంత్రి టీజీ భరత్‌ను కోరారు. ఇటీవల జిల్లాలో వైసీపీ నేతలు చేస్తున్న దౌర్జన్యాలు, దాడులు ప్రజాస్వామ్యానికి విరుద్ధమని పేర్కొంటూ, అలాంటి ఘటనలకు అడ్డుకట్ట వేసి టీడీపీ శ్రేణుల్లో ఆత్మవిశ్వాసం పెంపొందేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.అనంతరం మంత్రి టీజీ భరత్‌తో సమావేశం ముగిసిన తర్వాత జేసీ నివాసంలో భోజనం చేసి, విజయవాడకు బయలుదేరి వెళ్లారు.ఈ కార్యక్రమంలో టీడీపీ సీనియర్ నాయకుడు ఎస్.వి. రవీంద్రారెడ్డి, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.


