విశాలాంధ్ర – యాడికి: యాడికి మండల పరిధిలోని పెద్దపేట గ్రామంలో ఈ నెల 12న జరిగిన పల్లా శివప్రసాద్ హత్య కేసును పోలీసులు ఛేదించారు. ఈ కేసులో నిందితురాలైన అతని భార్య పల్లా హేమావతి (35)ను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు సీఐ శ్రీనివాసులు సోమవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో వెల్లడించారు. సీఐ తెలిపిన వివరాల ప్రకారం.. పల్లా శివప్రసాద్ మద్యానికి బానిసై కుటుంబాన్ని పట్టించుకోకుండా తరచూ భార్య హేమావతిని వేధించేవాడని చెప్పారు. ఈ క్రమంలో ఈ నెల 12న భార్యాభర్తల మధ్య జరిగిన ఘర్షణ తీవ్రరూపం దాల్చగా, ఆగ్రహానికి గురైన హేమావతి ఇంట్లో ఉన్న రోకలిబండతో శివప్రసాద్ తల వెనుక భాగంలో బలంగా కొట్టినట్లు తెలిపారు. తీవ్ర గాయాలపాలైన శివప్రసాద్ అక్కడికక్కడే మృతి చెందినట్లు పేర్కొన్నారు. ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టిన పోలీసులు నిందితురాలు హేమావతిని సోమవారం మధ్యాహ్నం వేములపాడు క్రాస్ వద్ద అదుపులోకి తీసుకుని, అరెస్ట్ చేసి న్యాయస్థానంలో హాజరుపరచగా రిమాండ్‌కు తరలించినట్లు సీఐ వెల్లడించారు.ఈ విలేకరుల సమావేశంలో ఎస్ఐ గోపాల్‌తో పాటు పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.


