విధానాల వైఫల్యం! – Visalaandhra


భారతదేశం ప్రస్తుతం ఒక తీవ్రమైన సామాజిక, ఆర్థిక సవాలును ఎదుర్కొంటోంది. అదే దేశాన్ని పట్టిపీడిస్తున్న ‘నిరుద్యోగ మహమ్మారి’. ఇటీవలి కాలంలో విడుదలైన అనేక అంతర్జాతీయ, జాతీయ నివేదికలు భారతదేశంలో నిరుద్యోగ రేటు ఆందోళనకర స్థాయికి చేరుకుందనే చేదు నిజాన్ని స్పష్టం చేశాయి. ప్రపంచంలోనే అత్యధిక యువ జనాభా (డెమోగ్రాఫిక్ డివిడెండ్) కలిగిన దేశంగా ప్రగతి పథంలో దూసుకుపోవాల్సిన భారత్, నేడు అదే యువతకు ఉపాధి కల్పించలేక చేతులెత్తేసే పరిస్థితి రావడం విచారకరం. చదువుకున్న యువత ఉద్యోగాల కోసం రోడ్లపైకి రావడం, ఒక చిన్న ప్రభుత్వ ఉద్యోగానికి కూడా లక్షలాది మంది దరఖాస్తు చేసుకోవడం దేశంలో ఉన్న నిరుద్యోగ తీవ్రతకు అద్దం పడుతోంది. దేశంలో నిరుద్యోగిత రేటు మే నెలలో 11 నెలల గరిష్ఠ స్థాయికి చేరింది. ఇదేదో ప్రైవేటు సంస్థ ఇచ్చిన నివేదికో, మోదీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యమాలు చేసే ప్రతిపక్షాల నివేదికో కాదు. కేంద్రప్రభుత్వ ఆధీనంలోని జాతీయ గణాంకాల కార్యాలయం (ఎన్ఎస్ఓ) స్వయంగా అధ్యయనం చేసి విడుదల చేసిన నివేదిక ఇది. ఎన్ఎస్ఓకు చెందిన పీరియాడిక్ లేబర్ ఫోర్స్‌ సర్వే (పీఎల్ఎఫ్ఎస్) నెలవారీ నివేదిక ప్రకారం, మే నెలలో దేశంలో నిరుద్యోగిత రేటు 5.5 శాతానికి పెరిగింది. ఏప్రిల్లో ఇది 5.2 శాతంగా నమోదైంది. నివేదిక ప్రకారం, ఉద్యోగాల్లో ఉన్న వారి నిష్పత్తిని సూచించే వరక్కర్ పాపులేషన్ రేషియో (డబ్ల్యూపీఆర్) కూడా తగ్గింది. ఏప్రిల్లో 52.2 శాతంగా ఉన్న ఈ సూచీ మే నెలలో 51.4 శాతానికి పడిపోయి 11 నెలల కనిష్ఠ స్థాయిని తాకింది. అలాగే, ఉద్యోగంలో ఉన్నవారు లేదా ఉద్యోగం కోసం చురుక—గా వెతుక—తున్న వారి శాతాన్ని సూచించే లేబర్ ఫోర్స్‌ పార్టిసిపేషన్ రేట్ (ఎల్ఎఫ్పీఆర్) కూడా ఏప్రిల్లో 55 శాతం ఉండగా, మే నెలలో 54.4 శాతానికి తగ్గింది. ఇది కూడా గత 11 నెలల్లో కనిష్ఠ స్థాయి. ఈ పరిణామాలపై ఎన్ఎస్ఓ స్పందిస్తూ… లేబర్ మార్కెట్ పరిస్థితుల్లో కొంత మందగమనం కనిపిస్తోందని పేర్కొంది. ఉద్యోగ అవకాశాలు తగ్గడం, ఆర్థిక కార్యకలాపాల్లో సీజనల్ ప్రభావం కారణంగా నిరుద్యోగుల సంఖ్య పెరిగిందని వివరించింది. ఇక యువత పరిస్థితి కూడా ఆందోళన కలిగిస్తోంది. 15 నుంచి 29 సంవత్సరాల మధ్య వయస్సు గల యువతలో నిరుద్యోగిత రేటు జనవరిమార్చి త్రైమాసికంలో 15 శాతానికి చేరింది. అంతక—ముందు అక్టోబర్డిసెంబర్ త్రైమాసికంలో ఇది 14.3 శాతంగా ఉంది. లింగ ప్రాతిపదికన పరిశీలిస్తే… పురుషుల్లో నిరుద్యోగం రేటు ఏప్రిల్లో 5.1 శాతం ఉండగా, మేలో 5.4 శాతానికి పెరిగింది. మహిళల నిరుద్యోగిత రేటు 5.4 శాతం నుంచి 5.6 శాతానికి చేరింది. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో ఉపాధి, నిరుద్యోగానికి సంబంధించిన సూచీలను ప్రతి నెలా అంచనా వేయడానికి పీఎల్ఎఫ్ఎస్ నమూనా విధానాన్ని గత ఏడాది జనవరి నుంచి సవరించినట్లు ఎన్ఎస్వో వెల్లడించింది. నిరుద్యోగం రేటు పెరగడం, ఉద్యోగాల్లో ఉన్న వారి శాతం తగ్గడం దేశ లేబర్ మార్కెట్ పరిస్థితులపై ఆందోళన రేపుతున్నాయని ఆర్థిక నిపుణులు సైతం అభిప్రాయపడుతున్నారు.నిరుద్యోగం విశృంఖలంగా విజృంభించడానికి విధానపరమైన లోపాలు, వాటి పట్ల విమర్శలు లేకపోలేదు. దేశంలో నిరుద్యోగం ఇంతలా పెరిగిపోవడానికి కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వ ఆర్థిక, పారిశ్రామిక విధానాలే ప్రధాన కారణమనే విమర్శలు బలంగా వినిపిస్తున్నాయి. గత దశాబ్ద కాలంలో తీసుకున్న కొన్ని కీలక నిర్ణయాలు దేశీయ ఆర్థిక వ్యవస్థను, ముఖ్యంగా ఉపాధి కల్పించే రంగాలను దెబ్బతీశాయనేది ఆర్థిక నిపుణుల విశ్లేషణ. ఆనాటి నోట్ల రద్దు, జీఎస్టీ ప్రభావం నేటికీ యువతను వెంటాడుతూనే ఉంది. 2016 నాటి నోట్ల రద్దు, ఆ తర్వాత సరైన ప్రణాళిక లేకుండా అమలు చేసిన వస్తు సేవల పన్ను (జీఎస్టీ), దేశంలో అత్యధికంగా ఉపాధి కల్పించే సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల (ఎంఎస్‌ఎంఈ) నడ్డి విరిచాయి. అసంఘటిత రంగం కుదేలవడంతో కోట్లాది మంది ఉపాధి కోల్పోయారు. కార్పొరేట్ అనుకూల విధానాల ఇంకో దెబ్బ. ప్రభుత్వ విధానాలు కేవలం కొద్దిమంది కార్పొరేట్ దిగ్గజాలకు లేదా పెట్టుబడి ఆధారిత (క్యాపిటల్ ఇంటెన్సివ్) పరిశ్రమలకు మాత్రమే మేలు చేసేలా ఉన్నాయనే ఆరోపణలు ఉన్నాయి. శ్రమ ఆధారిత (లేబర్ ఇంటెన్సివ్) పరిశ్రమలైన వస్త్ర, చర్మ, నిర్మాణ రంగాలకు ఆశించిన స్థాయిలో ప్రోత్సాహం లభించలేదు. ఆటోమేషన్, నైపుణ్యాల కొరత ఇంకో కారణం. సాంకేతికత పెరగడం, పరిశ్రమలలో ఆటోమేషన్ పెరగడం వల్ల మానవ వనరుల అవసరం తగ్గింది. దీనికి తోడు మన విద్యా వ్యవస్థ నేటి మార్కెట్ అవసరాలకు తగ్గ నైపుణ్యాలను యువతకు అందించడంలో విఫలమైంది. చివరకు నిరుద్యోగం భయంకరమైన పర్యవసానాలకు దారితీస్తోంది. నిరుద్యోగం అనేది కేవలం ఒక ఆర్థిక సమస్య మాత్రమే కాదు, అది దేశ భద్రతను, సామాజిక సమతుల్యతను దెబ్బతీసే ప్రమాదకరమైన ఆయుధం. శ్రమించాల్సిన వయసులో ఉపాధి లభించకపోవడం వల్ల యువత తీవ్ర నిరాశ, నిస్పృహలకు లోనవుతోంది. ఇది మానసిక ఒత్తిడిని పెంచి, ఆత్మహత్యలకు దారితీస్తోంది. మరోవైపు, ఖాళీగా ఉన్న యువత తప్పదోవ పట్టి నేరప్రవృత్తి వైపు మళ్లే ప్రమాదం ఉంది. దేశంలో శాంతిభద్రతల సమస్యలు తలెత్తడానికి ఇది కారణమవుతుంది. ఆర్థిక కోణంలో చూస్తే, ప్రజల చేతిలో డబ్బు లేకపోవడం వల్ల కొనుగోలు శక్తి తగ్గి, మార్కెట్‌లో డిమాండ్ పడిపోతుంది. ఇది ఆర్థిక వ్యవస్థను మరింత మందగమనంలోకి నెట్టేస్తుంది. చదువుకున్న ప్రతిభావంతులైన యువత ఉపాధి కోసం విదేశాలకు వలస వెళ్లడం (బ్రెయిన్ డ్రెయిన్) వల్ల దేశం తన మేధోసంపత్తిని కోల్పోతోంది. ఈ నిరుద్యోగ సంక్షోభం నుంచి గట్టెక్కడానికి ప్రభుత్వం తక్షణమే మేల్కొని, స్వల్పకాలిక, దీర్ఘకాలిక వ్యూహాత్మక చర్యలు చేపట్టాల్సి ఉంది. ఎంఎస్ఎమ్ఈ రంగానికి ఊతమివ్వాల్సిన తరుణమిది. దేశంలో అత్యధిక శాతం మందికి ఉపాధి కల్పించే చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు పన్ను రాయితీలు, సులభతర రుణ సౌకర్యాలు కల్పించాలి. ఈ రంగాన్ని బలోపేతం చేస్తేనే గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో తక్షణ ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. శ్రమ ఆధారిత రంగాలపై దృష్టి పెట్టాల్సిన సమయం ఆసన్నమైంది. టెక్స్టైల్స్‌, లెదర్, ఫుడ్ ప్రాసెసింగ్, పర్యాటక రంగం వంటి ఎక్కువ మంది కార్మికులు అవసరమయ్యే రంగాలలో పెట్టుబడులను ప్రోత్సహించాలి. మౌలిక వసతుల కల్పన (రోడ్లు, పోర్టులు, గృహ నిర్మాణం)పై ప్రభుత్వ వ్యయాన్ని పెంచాలి. విద్యావ్యవస్థలో సంస్కరణలు రావాల్సిందే. అంటే దానరœం విద్యావ్యవస్థను మనుచరిత్ర కాలం నాటికి మోసుకుపోవడం కాదు. ఉపాధి కల్పించే విధమైన శాస్త్రీయ విధానాలు కావాలి. డిగ్రీలు మాత్రమే ఇచ్చే విద్యా విధానం మారాలి. పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌, డేటా సైన్స్‌, డిజిటల్ మార్కెటింగ్, వృత్తి విద్యా కోర్సుల్లో యువతకు ఉచిత లేదా రాయితీతో కూడిన శిక్షణ ఇవ్వాలి. ‘స్కిల్ ఇండియా’ వంటి పథకాలను క్షేత్రస్థాయిలో మరింత పారదర్శకంగా అమలుచేయాలి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న లక్షలాది పోస్టులను తక్షణమే, ఎటువంటి అవినీతికి తావులేకుండా, నిర్దిష్ట కాలపరిమితిలో భర్తీ చేయాలి.కేవలం జీడీపీ గణాంకాల వృద్ధిని చూపిస్తూ దేశం ప్రగతి సాధిస్తోందని సరిపెట్టుకుంటే సరిపోదు. ఆ వృద్ధి ‘ఉపాధి రహిత వృద్ధి’ (జాబ్లెస్ గ్రోత్) కాకూడదు. మానవ వనరులే దేశానికి అసలైన సంపద. యువత శక్తిసామర్థ్యాలను సరైన దిశలో ఉపయోగించుకోకపోతే, దేశ భవిష్యత్తు అంధకారంలో పడే ప్రమాదం ఉంది. ఇప్పటికైనా పాలకులు తమ రాజకీయ ప్రయోజనాలను పక్కనపెట్టి, నిరుద్యోగ నిర్మూలనను ఒక జాతీయ ఎజెండాగా స్వీకరించాలి. అప్పుడే నిజమైన ఆత్మనిర్భర్ భారత్ సాధ్యమవుతుంది.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *