ఆర్థిక అసమానతలతో అల్లాడుతున్న ప్రజలు – Visalaandhra


డా.సూర్యదేవర రామకృష్ణ

నేటి భారతదేశంలో ఆందోళనకరమైన సామాజిక వాస్తవికత ఏమిటంటే సంపద. ఇది సమాజంలోని ప్రతి మనిషి దరి చేరడం లేదు. అది కేవలం కొద్దిమంది శక్తుల చేతుల్లోనే పోగుపడుతోంది. ప్రపంచ ప్రసిద్ధ ఆక్స్ఫామ్ నివేదికలు ఏటా ఒకే చేదు సత్యాన్ని చెప్తున్నాయి. ఈ దేశంలోని కేవలం వందమంది కోటీశ్వరుల చేతుల్లో ఉన్న సంపద, దాదాపు 40 కోట్ల మంది అత్యంత పేద భారతీయుల ఉమ్మడి సంపద కంటే చాలా ఎక్కువ. భారతదేశంలో ఒక రోజు మొత్తం చెమటోడ్చే వలస కార్మికుడి జీవితకాల సంపాదనను, ఒక కార్పొరేట్ సంస్థ సీఈఓ కేవలం ఒక్క నిమిషంలో ఆర్జిస్తున్నాడు. సంపద కేంద్రీకరణ పుస్తకాలకే పరిమితమయ్యే సిద్ధాంతం కాదు. అది మీ పిల్లల తిండిని, వారి చదువును దొంగిలించడం. మీ ఆరోగ్యం, మీ ఆత్మగౌరవం, మీ గృహవసతి ప్రతి ఒక్కటి కొందరు పెట్టుబడిదారుల గుప్పిట్‌లో బందీ అయిపోవడం. నేడు ప్రభుత్వ పాఠశాలలు నిధులు లేక శిథిలావస్థకు చేరుతుంటే, ప్రైవేట్ కార్పొరేట్ విద్యాసంస్థలు వేల కోట్ల రూపాయల సామ్రాజ్యాలను ఏలుతున్నాయి. ప్రభుత్వ ఆసుపత్రుల్లో కనీస మందులు, వైద్యులు కరువై రోగులు విలవిల్లాడుతుంటే, ఫైవ్ స్టార్ ప్రైవేట్ ఆసుపత్రులు రోగాలను, మరణాలను లాభదాయక వ్యాపారంగా మార్చేసుకున్నాయి. మన కళ్ల ముందే అన్నదాత ఆత్మహత్య చేసుకుంటుంటూ వేల కోట్ల రూపాయల బ్యాంక్ రుణాలు ఎగ్గొట్టిన బడా కార్పొరేట్ తిమింగలం, ఎలాంటి భయం లేకుండా విలాసవంతమైన జీవితాన్ని గడుపుతోంది. ఇక్కడ చట్టం గుడ్డిది కాదు అది పాలకుల, ధనవంతుల చేతుల్లో ఒక క్రూరమైన ఆయుధంగా మారింది. మహాత్మా గాంధీ ఒక సందర్భంలో అన్నారు. ఈ భూమి మీద ప్రతి మనిషి అవసరానికి తగినంత సంపద ఉంది, కానీ ఒక్క మనిషి ఆత్యాశకు సరిపడా సంపద లేదు. ఎన్నికల సమయం రాగానే కులం, మతం, ప్రాంతం పేరుతో మనల్ని ముక్కలుగా విభజించి విద్వేషాలను రెచ్చగొడుతున్నారు. మన దృష్టి అసలైన సమస్యల నుంచి వేరే వైపునకు మళ్లినప్పుడు, వారి స్వార్థ రాజకీయ పబ్బం సులువుగా గడిచిపోతుంది. మన పన్నుల డబ్బుతో రోడ్లు వేయించుకుని, మన ప్రాకృతిక వనరులను నిలువునా దోచుకుంటున్నాడు. నేడు టెక్నాలజీ విప్లవం వచ్చింది. కానీ, ఆ సంపద అంతా ముగ్గురు నలుగురు టెక్ దిగ్గజాల చేతుల్లోనే బందీ అయింది. ఒక మారుమూల తెలుగు గ్రామంలోని రైతు బిడ్డ ఆన్‌లైన్ క్లాస్ వినడానికి ఇంటర్నెట్ సిగ్నల్ కోసం కొండలు, గుట్టలు ఎక్కుతుంటే సిలికాన్ వ్యాలీ బిలియనీర్లు మాత్రం తమ సొంత రాకెట్లలో అంతరిక్ష విహారయాత్రలకు వెళ్తున్నారు. దీనినేనా మనం ప్రగతి అనాల్సింది ? ఇది అభివృద్ధి కాదు, మానవ అహంకారం యొక్క పరమావధి. ధనస్వామ్యం, భారతదేశంలోని టాప్ 1 శాతం జనాభా, దేశ మొత్తం సంపదలో దాదాపు 40 శాతానికి పైగా వాటాను శాసిస్తున్నారు. సంపద వెల్లువ, ఇటీవలి కాలంలో భారతీయ బిలియనీర్ల సంపద రోజువారీగా వేల కోట్లలో వృద్ధి చెందుతోంది. మరోవైపు 80 కోట్ల మంది పౌరులు ఉచిత రేషన్ బియ్యంపైనే మనుగడ సాగిస్తున్నారు.
ప్రతి పౌరుడూ ఆత్మగౌరవంతో, సమాన అవకాశాలతో జీవించే నవసమాజం గురించి డాక్టర్ బిఆర్.అంబేద్కర్ కలలు కన్నారు. కానీ నేడు రాజ్యాంగపు సువర’ అక్షరాలు గ్రంథాలయాలకే పరిమితమై బూజు పడుతున్నాయి. రాజకీయ నాయకులు చట్టసభల్లో నిలబడి పేదరిక నిర్మూలన గురించి గంటల తరబడి ఉపన్యాసాలు ఇస్తారు. కానీ, అదే రాత్రికి వారి వ్యక్తిగత బ్యాంక్ ఖాతాలు కొత్త జీరోలతో నిండిపోతాయి. ఈ ద్వంద్వ నీతి, ఈ కపట నాటకం ఎంతకాలం సాగుతుంది ? ప్రస్తుతం ప్రజాస్వామ్యానికి, కార్పొరేట్ శక్తులకు మధ్య ఒక అదృశ్య యుద్ధం జరుగుతోంది. ఈ యుద్ధంలో ప్రజాస్వామ్యం ఓడిపోతోంది. ఎన్నికలలో గెలవాలంటే వందల కోట్ల డబ్బు కావాలి ఆ డబ్బు కోసం నాయకులు కార్పొరేట్ అధిపతుల ముందు మోకరిల్లాలి. ఆ తర్వాత, సదరు కార్పొరేట్లకు లబ్ధి చేకూర్చడం కోసం దేశ విధానాలను, చట్టాలను మార్చాలి. ఈ విష వలయంలో సామాన్య పేదవాడి ఓటు ఐదేళ్లకోసారి వాడే ఒక నిరరœక సాధనంగా మిగిలిపోయింది. వాడు ఓటు వేస్తున్నాడు కానీ, ఆ ఓటు వాని జీవితాన్ని ఏమాత్రం మార్చలేకపోతోంది. అందుకే, ఈ దోపిడీ వ్యవస్థను నిలదీయడమే నేడు అత్యంత విప్లవాత్మకమైన చర్య. ఇప్పుడు అసలైన ప్రశ్న సామాన్యులుగా మనం ఏమి చేయాలి ? ఆర్థిక అక్షరాస్యతను పెంపొందించుకోవడం నేడు కేవలం అవసరం మాత్రమే కాదు, అదొక ఆత్మరక్షణ ఆయుధం. మన పన్ను డబ్బు ఎక్కడికి పోతుందో నిలదీయాలి. కార్పొరేట్ లాభాలపై భారీగా పన్నులు విధించాలని డిమాండ్ చేయాలి. సంపద పన్ను, వారసత్వ పన్నుల అమలు నేటి తక్షణ అవసరం. స్వీడన్, నార్వే వంటి దేశాలు ఇదే మార్గంలో నడిచి సామాజిక సమానత్వాన్ని సాధించాయి. మనం ఎందుకు ఆ అడుగులు వేయలేం ? మన పొలం, మన కార్మికుడు, మన చేతివృత్తులు… ఇవే మన నిజమైన ప్రాణాధారాలు. వాటికి మద్దతు ఇవ్వడం ద్వారా సంపద పంపిణీ సహజంగా జరుగుతుంది. మీరు స్థానికంగా ఖర్చు పెట్టే ప్రతి రూపాయి ఒక పేద కుటుంబానికి జీవనరేఖ అవుతుంది. అదే మీరు ఒక బహుళజాతి కంపెనీకి ధారపోసే సొమ్ము, కార్పొరేట్ తిమింగలాల ఆకలిని పెంచేందుకు మాత్రమే ఉపయోగపడుతుంది. మితిమీరిన ఆర్థిక అసమానతలు ఏ సమాజాన్నైనా ఎప్పటికైనా కుప్పకూల్చుతాయి. ఫ్రెంచ్ విప్లవం, రష్యన్ విప్లవం, లాటిన్ అమెరికా ఉదంతాలు అన్నీ ఒకే పాఠాన్ని నేర్పాయి. సంపద కేవలం పైపైకి ప్రవహించి, కింది స్థాయి ఖాళీ అయినప్పుడు సమాజంలో అగ్‌ని రాజుకుంటుంది. ఆ విప్లవాగ్నిని ముందే గుర్తించి, న్యాయమైన విధానాల ద్వారా శాంతింపజేయడమే నిజమైన ప్రభుత్వ లక్షణం. మన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో కూడా ఈ అసమానతల తారతమ్యాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. హైదరాబాద్ లాంటి నగరాల్లో ఒక్క చదరపు అడుగు స్థలం లక్షల రూపాయలకు అమ్ముడవుతుంటే, మారుమూల జిల్లాల్లో ఒక రైతు తన నాలుగు ఎకరాల భూమిని అమ్మినా అప్పులు తీరడం లేదు. సైబరాబాద్‌లోని మల్టీనేషనల్ కంపెనీలు రోజుకు వందల కోట్ల లాభాలు ఆర్జిస్తుంటే, పల్లెల్లో వ్యవసాయ కూలీలు కనీస అవసరాల కోసం అల్లాడుతున్నారు. ఇది మన తెలుగు నేలపై జరుగుతున్న అన్యాయం. దీనిని గుర్తించడం, దీనిపై మాట్లాడడం మన బాధ్యత. ఒక నిజమైన ప్రజాస్వామ్యంలో సంపద జీవనదిలా ప్రవహించాలి. అది ప్రతి పొలాన్ని, ప్రతి ఇంటిని, ప్రతి సామాన్యుడి జీవితాన్ని తడిపి, సారవంతం చేయాలి. ఈ అసమానతల గోడలను బద్దలు కొట్టడం మన తరం యొక్క అత్యున్నత బాధ్యత!
సెల్ : 9490754169



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *