విశాలాంధ్ర, పెనుకొండ: పెనుకొండ మండల పరిధిలోని కొండంపల్లి గ్రామంలో మంగళవారం విషాద ఘటన చోటుచేసుకుంది. రైతు వేణుగోపాల్ రెడ్డి వ్యవసాయ పొలానికి పశువుల ఎరువు తోలుతుండగా, ఎరువును కిందికి వేయడానికి లిఫ్ట్ ఎత్తిన సమయంలో అది విద్యుత్ తీగలకు తగిలింది. దీంతో విద్యుత్ షాక్ సర్క్యూట్ కావడంతో ట్రాక్టర్ డ్రైవర్‌గా పనిచేస్తున్న వేణుగోపాల్ రెడ్డి అక్కడికక్కడే మృతి చెందాడు.సంఘటనను గమనించిన పక్క పొలాల రైతులు వెంటనే విద్యుత్ శాఖ అధికారులకు, పోలీసులకు సమాచారం అందించారు. విద్యుత్ సరఫరా నిలిపివేయడంతో పాటు మంటలు అంటుకున్న ట్రాక్టర్ పై రైతులు నీళ్లు పోసి మంటలను ఆర్పారు.మృతుడు వేణుగోపాల్ రెడ్డికి భార్య అనిత, ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. కుటుంబ యజమాని మృతితో కుటుంబ సభ్యుల రోదనలు హృదయ విదారకంగా మారాయి.సమాచారం అందుకున్న విద్యుత్ శాఖ అధికారులు, అగ్నిమాపక సిబ్బంది ఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. పెనుకొండ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతదేహాన్ని శవపరీక్ష నిమిత్తం పెనుకొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.అనంతరం పలువురు తెలుగుదేశం పార్టీ, కూటమి నాయకులు ఆసుపత్రికి చేరుకుని మృతదేహాన్ని సందర్శించి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.


