ఇరాన్ పై మళ్లీ దాడులు… భారీ నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు


ఇవాళ్టి ట్రేడింగ్‌లో భారత స్టాక్ మార్కెట్లు భారీ నష్టాలను చవిచూశాయి. మధ్యప్రాచ్యంలో భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు పెరగడం ఇన్వెస్టర్ల సెంటిమెంట్‌ను దెబ్బతీసింది. దక్షిణ ఇరాన్‌లో అమెరికా తాజాగా దాడులు జరపడంతో శాంతి ఒప్పందం ఆశలు సన్నగిల్లాయి. ఈ పరిణామం మార్కెట్లపై తీవ్ర ప్రతికూల ప్రభావాన్ని చూపింది. ట్రేడింగ్ ముగిసే సమయానికి, బీఎస్ఈ సెన్సెక్స్ 479.26 పాయింట్లు (0.63%) నష్టపోయి 76,009.7 వద్ద స్థిరపడింది. అదేవిధంగా, ఎన్ఎస్ఈ నిఫ్టీ 118 పాయింట్లు (0.49%) పతనమై 23,913.7 వద్ద ముగిసింది. అమెరికా దళాలను ఇరాన్ నుంచి కాపాడేందుకే ఈ రక్షణాత్మక దాడులు జరిపినట్లు యూఎస్ సెంట్రల్ కమాండ్ పేర్కొన్నట్లు వార్తలు వెలువడ్డాయి. ఈ అనిశ్చితితో మదుపరులు అప్రమత్తత వహించారు. మార్కెట్ నిపుణుల విశ్లేషణ ప్రకారం, నిఫ్టీకి 24,000 పాయింట్ల స్థాయి తక్షణ నిరోధకంగా మారింది. దీనిపైన 24,100 వద్ద కాల్ రైటింగ్ ఎక్కువగా ఉండటంతో అమ్మకాల ఒత్తిడి కొనసాగవచ్చని అంచనా వేస్తున్నారు. ఇక దిగువన, 23,850 తక్షణ మద్దతుగా, 23,500-23,600 జోన్ కీలక డిమాండ్ ఏరియాగా ఉంది.

సెక్టార్ల వారీగా చూస్తే, నిఫ్టీ కన్స్యూమర్ డ్యూరబుల్స్ ఇండెక్స్ 1 శాతానికి పైగా నష్టపోయి అత్యంత బలహీనంగా నిలిచింది. ఫైనాన్షియల్ సర్వీసెస్, ప్రైవేట్ బ్యాంక్ సూచీలు కూడా క్షీణించాయి. అయితే, మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ సూచీలు వరుసగా 0.54%, 0.35% లాభాలతో రాణించడం విశేషం. మెటల్, కెమికల్ స్టాక్స్ కూడా లాభపడ్డాయి. సెన్సెక్స్‌లో ట్రెంట్, టీసీఎస్, బజాజ్ ఫైనాన్స్, భారతీ ఎయిర్‌టెల్ నష్టపోగా, అదానీ పోర్ట్స్, టెక్ మహీంద్రా లాభపడ్డాయి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *