ఆగి ఉన్న లారీని ఢీకొన్న బైక్.. దంపతులకు తీవ్ర గాయాలు


విశాలాంధ్ర – అగళి : మండల పరిధిలోని పి.బ్యాడిగేరా గ్రామం విద్యుత్ సబ్‌స్టేషన్ మలుపు వద్ద ఆగి ఉన్న లారీని ద్విచక్ర వాహనం ఢీకొనడంతో ఇద్దరు తీవ్రంగా గాయపడిన ఘటన చోటుచేసుకుంది. ఈ విషయాన్ని ఏఎస్ఐ వెంకటేశులు తెలిపారు. పోలీసుల వివరాల మేరకు.. కర్ణాటక రాష్ట్రంలోని శిర పట్టణం కోటే ప్రాంతానికి చెందిన తిప్పేస్వామి తన భార్య జయమ్మతో కలిసి అగళి నుంచి స్వగ్రామమైన శిరకు ద్విచక్ర వాహనంపై వెళ్తున్నారు. ఈ క్రమంలో గాయత్రీ కాలనీ మలుపు వద్ద శిర వైపు నుంచి వచ్చిన లారీని రోడ్డుకు కుడి వైపున నిలిపి డ్రైవర్ టీ తాగడానికి వెళ్లాడు.అదే సమయంలో వేగంగా వచ్చిన ద్విచక్ర వాహనం ఆగి ఉన్న లారీని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బైక్ నడుపుతున్న తిప్పేస్వామికి తల, భుజంపై తీవ్ర రక్త గాయాలు కాగా, జయమ్మకు తలకు బలమైన గాయాలు అయ్యాయి. ఇద్దరూ స్పృహ కోల్పోయి రోడ్డుపై పడిపోయారు.స్థానికులు వెంటనే పోలీసులకు, 108 అంబులెన్స్‌కు సమాచారం అందించగా క్షతగాత్రులను హుటాహుటిన శిర ఆసుపత్రికి తరలించారు. అనంతరం ప్రాథమిక చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం తుమకూరుకు తరలించినట్లు సమాచారం.తిప్పేస్వామి శిర ప్రైవేట్ బస్టాండ్ సమీపంలోని ఆంజనేయస్వామి గుడి వద్ద పాన్ బీడా దుకాణం నిర్వహిస్తూ జీవనం సాగిస్తున్నట్లు తెలిసింది. ప్రస్తుతం అతని ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. సమాచారం అందుకున్న అగళి పోలీసులు ఏఎస్ఐ వెంకటేశులు, జమీదార్ బాలాజీలు ఘటనాస్థలానికి చేరుకొని స్థానికులను అడిగి ప్రమాదానికి గల కారణాలను తెలుసుకున్నారు. ప్రమాదానికి కారణమైన లారీతో పాటు ద్విచక్ర వాహనాన్ని పోలీస్ స్టేషన్‌కు తరలించి, లారీ డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు.ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎస్ఐ వెంకటేశులు తెలిపారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *