వాలిపోతున్న విద్యుత్ స్తంభాలు… కిందకు వేలాడుతున్న తీగలు…


విశాలాంధ్ర – కనేకల్: కనేకల్ పట్టణంలోని బీఎస్‌ఎన్‌ఎల్ కార్యాలయం నుంచి ఉడేగోళం గ్రామం వరకు ఉన్న విద్యుత్ లైన్ల పరిస్థితి అత్యంత ప్రమాదకరంగా మారిందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మార్గమధ్యంలో పలుచోట్ల విద్యుత్ స్తంభాలు నేలకు వాలిపోతుండగా, భారీ విద్యుత్ తీగలు కిందకు వేలాడుతూ ప్రమాదాలకు కారణమయ్యే పరిస్థితులు నెలకొన్నాయి. స్థానికుల కథనం ప్రకారం, కొన్ని ప్రాంతాల్లో విద్యుత్ తీగలు సడలిపోవడంతో నేలకు అత్యంత సమీపంగా కనిపిస్తున్నాయి. వర్షాకాలం ప్రారంభమైన నేపథ్యంలో గాలివానలు, ఈదురుగాలులకు తీగలు తెగిపడి కిందపడే ప్రమాదం ఉందని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే ఉడేగోళం గ్రామ పరిసరాల్లో విద్యుత్ తీగల కారణంగా ఓ భారీ ప్రమాదం తృటిలో తప్పినప్పటికీ, సంబంధిత విద్యుత్ శాఖ అధికారులు ఇప్పటివరకు స్పందించలేదని ప్రజలు ఆరోపిస్తున్నారు.ముఖ్యంగా కనేకల్ ఎమ్మార్వో కార్యాలయం, పోలీస్ స్టేషన్ సమీప ప్రాంతాల్లో విద్యుత్ స్తంభాలు వాలిపోవడంతో పాటు తీగలు నేలకు దగ్గరగా ఉండటం వల్ల నిత్యం రాకపోకలు సాగించే ప్రజలు, వాహనదారులు భయాందోళనకు గురవుతున్నారు. ఏ చిన్న ప్రమాదం జరిగినా ప్రాణనష్టం సంభవించే అవకాశం ఉందని స్థానికులు హెచ్చరిస్తున్నారు.ప్రజల ప్రాణాలకు ముప్పుగా మారిన ఈ సమస్యపై విద్యుత్ శాఖ ఉన్నతాధికారులు వెంటనే స్పందించి, దెబ్బతిన్న విద్యుత్ తీగలను తొలగించి కొత్త తీగలను ఏర్పాటు చేయడంతో పాటు నేలకు వాలిన స్తంభాలను పునఃస్థాపించి ప్రమాదాలను నివారించాలని స్థానికులు కోరుతున్నారు.

The post వాలిపోతున్న విద్యుత్ స్తంభాలు… కిందకు వేలాడుతున్న తీగలు… appeared first on Visalaandhra.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *