రేపటి నుంచి సవరించిన భూముల విలువలు


. క్షేత్రస్థాయి అధ్యయనం ఆధారంగా నిర్ణయం
. మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి

విశాలాంధ్ర-హైదరాబాద్: రాష్ట్రంలో భూముల విలువలను సవరించాలని, కొన్ని ప్రాంతాల్లో వాస్తవ ధరలతో పోలిస్తే భారీగా హెచ్చుతగ్గు లున్న భూముల ధరలను క్రమబద్ధీకరించాలని రాష్ట్ర మంత్రివర్గం తీసుకున్న నిర్ణయం మేరకు సవరించిన భూముల విలువలు ఈ నెల 5 నుంచి అమలులోకి తెస్తున్నామని రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి ప్రకటించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆలోచన మేరకు ఆర్థిక నిపుణులు అరవింద్ సుబ్రమణ్యం ఇచ్చిన నివేదిక ప్రకారం ఉన్నతాధికారుల సూచనలు, సలహాలను పరిగణనలోకి తీసుకుని విస్తృత స్థాయిలో అధ్యయనం నిర్వహించిన అనంతరమే ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. ప్రాంతాల వారీగా భూముల మార్కెట్ పరిస్థితులు, రిజిస్ట్రేషన్ల సంఖ్య, బహిరంగ మార్కెట్ ధరలు, ప్రభుత్వ విలువల మధ్య ఉన్న వ్యత్యాసాన్ని సమగ్రంగా పరిశీలించి శాస్త్రీయ పద్ధతిలో కొత్త విలువను నిర్ణయించామని మంత్రి చెప్పారు. గత బీఆరఎస్ ప్రభుత్వం జరిగిన సవరణ వల్ల వాస్తవ మార్కెట్ ధరలకు, ప్రభుత్వ విలువలకు మధ్య భారీ అంతరం ఉండటం వల్ల భూ లావాదేవీలలో అనేక సమస్యలు ఉత్పన్నమవుతున్నాయని అన్నారు. ఈ పరిస్థితులను సరిదిద్దేందుకు రాష్ట్రంలోని అన్ని 144 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల పరిధిలో మార్కెట్ విలువల పునర్విమర్శ చేపట్టామని మంత్రి వెల్లడిం చారు. ప్రాంతాల అభివృద్ధి సామర్థ్యం, వృద్ధి రేటు, ఇటీవల జరిగిన భూముల వేలాలు, మార్కెట్ పరిస్థితులు, డిమాండ్, కొత్త రహదారులు, వృద్ధి కారిడార్లు, ఔటర్ రింగ్ రోడ్, రీజినల్ రింగ్ రోడ్, పారిశ్రామికాభివృద్ధి, మౌలిక వసతుల విస్తరణ వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుని మార్కెట్ విలువలను నిర్ణయించినట్లు మంత్రి తెలిపారు. ఫ్లాట్ల విషయంలో గతంలో కొన్ని ప్రాంతాల్లో క్షేత్రస్థాయి మార్కెట్ ధరలు తక్కువగా ఉన్నప్పటికీ అంతస్తుల వారీగా అధిక రేట్లు నిర్ణయించడం వల్ల అసమానతలు ఏర్పడ్డాయని, అలాంటి ప్రాంతాల్లో అన్ని అంతస్తులకు ఒకే రేటు వర్తింపజేస్తూ మార్కెట్ విలువలను హేతుబద్ధీకరించినట్లు వివరించారు. ఇప్పటికే అధిక మార్కెట్ విలువలు ఉన్న ప్రాంతాల్లో ఎలాంటి పెంపు ప్రతిపాదించలేదన్నారు. అదే విధంగా ప్రాంతాల అభివృద్ధి స్థాయిని బట్టి హైదరాబాద్ మహానగర అభివృద్ధి సంస్థ, క్యూర్ పరిధి రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల్లో వ్యవసాయ భూములు, ప్లాట్లు, ఫ్లాట్లకు కనీస ప్రాథమిక రేట్లను కూడా నిర్ణయించామన్నారు. అనేక మున్సిపాలిటీలు మున్సిపల్ కార్పొరేషన్లుగా అప్‌గ్రేడ్ కావడం, గ్రామ పంచాయతీలు మున్సిపాలిటీల్లో విలీనం కావడం వంటి పరిణామాలను దృష్టిలో ఉంచుకుని ఆర్‌సీసీ, నాన్-ఆర్‌సీసీ నిర్మాణాల రేట్లను గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో సవరించినట్లు మంత్రి పొంగులేటి తెలిపారు. రాష్ట్ర ఆర్థికాభివృద్ధికి, భూ లావాదేవీలలో పారదర్శకత పెంపునకు, ప్రభుత్వ ఆదాయ వృద్ధికి ఈ నిర్ణయం దోహదపడుతుందన్నారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *