పెన్నహోబిలం బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై సమగ్ర సమీక్ష


విశాలాంధ్ర, ఉరవకొండ (అనంతపురం జిల్లా) : అనంతపురం జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం పెన్నహోబిలం శ్రీ లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాల నిర్వహణకు సంబంధించి ఏర్పాట్లపై గురువారం ఉరవకొండ తాసిల్దార్ కార్యాలయంలో ఆర్డీవో శ్రీనివాసులు అధ్యక్షతన విస్తృత స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఇప్పటికే ఈనెల 28న ప్రారంభమైన బ్రహ్మోత్సవాలు ఉత్సాహభరితంగా కొనసాగుతున్న నేపథ్యంలో, మే 6న జరిగే బ్రహ్మరథోత్సవానికి వేలాది మంది భక్తులు తరలివచ్చే అవకాశముందని అధికారులు అంచనా వేశారు. ఈ సందర్భంగా ఆర్డీవో మాట్లాడుతూ, భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ముందస్తుగా అన్ని శాఖలు సమన్వయంతో పని చేయాలని స్పష్టం చేశారు. ముఖ్యంగా రథోత్సవం రోజున భారీ రద్దీ ఉండే అవకాశముండటంతో ట్రాఫిక్ నియంత్రణ, పార్కింగ్ ఏర్పాట్లు, భద్రత చర్యలు కట్టుదిట్టంగా ఉండాలని పోలీసు శాఖకు ఆదేశించారు. తాగునీరు సరఫరా కోసం ఆర్డబ్ల్యూఎస్ శాఖ ద్వారా తగిన ట్యాంకర్లు ఏర్పాటు చేయాలని, ఆలయ పరిసరాల్లో తాత్కాలిక నీటి నిల్వ సౌకర్యాలు కల్పించాలని సూచించారు. వైద్యశాఖ ద్వారా అత్యవసర వైద్య సేవల కోసం ప్రత్యేక మెడికల్ క్యాంపులు, అంబులెన్స్ సేవలు అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. పారిశుధ్యం రథోత్సవం రోజున పెద్దఎత్తున భక్తులు రాకపోకలు ఉండటంతో పారిశుధ్య నిర్వహణకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని ఎంపీడీవో మరియు పంచాయతీ అధికారులకు సూచించారు. తాత్కాలిక మరుగుదొడ్లు, చెత్త సేకరణ కేంద్రాలు ఏర్పాటు చేసి, నిరంతర శుభ్రత నిర్వహించాలని చెప్పారు. విద్యుత్ శాఖ నిరంతర విద్యుత్ సరఫరా ఉండేలా ప్రత్యేక బృందాలను సిద్ధంగా ఉంచాలని, ఎక్కడైనా అంతరాయం కలగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అగ్నిమాపక శాఖ అత్యవసర పరిస్థితులకు సిద్ధంగా ఉండి ఫైర్ సేఫ్టీ చర్యలను పర్యవేక్షించాలని సూచించారు. ఆలయ ఈఓ సాకే రమేష్ బాబు భక్తుల దర్శనానికి సక్రమ క్యూలైన్లు, ప్రత్యేక దర్శన ఏర్పాట్లు, వాహనాల నియంత్రణ వంటి అంశాలపై చర్యలు తీసుకోవాలని ఆర్డీవో సూచించారు. ముఖ్యంగా వృద్ధులు, మహిళలు, పిల్లలకు అనుకూలంగా ఏర్పాట్లు చేయాలని చెప్పారు.
సమన్వయంతో విజయవంతం చేయాలని అన్ని శాఖలు సమన్వయంతో పని చేస్తేనే బ్రహ్మోత్సవాలను విజయవంతంగా నిర్వహించగలమని ఆర్డీవో పేర్కొన్నారు. భక్తులకు ఆధ్యాత్మిక ఆనందంతో పాటు సౌకర్యవంతమైన అనుభవం కల్పించడం అధికారుల బాధ్యత అని స్పష్టం చేశారు.ఈ సమావేశంలో ఆలయ చైర్మన్ రాయంపల్లి నాగరాజు ఆలయ కార్యనిర్వహణాధికారి సాకే రమేష్ బాబు, సీఐ మహానంది, ఎస్సై జనార్దన్ నాయుడు, ఎంపీడీవో రవిప్రసాద్, అగ్నిమాపక, వైద్య ఆరోగ్య, ఆర్డబ్ల్యూఎస్, ఎంపీడీవో, విద్యుత్ తదితర శాఖలకు చెందిన అధికారులు పాల్గొని తమ శాఖల ఏర్పాట్లపై వివరాలు సమర్పించారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *