విజయవాడలోని ప్రముఖ రెయిన్‌బో చిన్నపిల్లల ఆసుపత్రిలో బుధవారం భారీ ప్రమాదం తప్పింది. విజయవాడ ఆసుపత్రిలోని అత్యవసర వార్డులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. వార్డులోని ఎలక్ట్రికల్ బోర్డులో విద్యుదాఘాతం కారణంగా దట్టమైన పొగలు అలముకున్నాయి. అకస్మాత్తుగా పొగలు, మంటలు వ్యాపించడంతో రోగులు ఆందోళన చెందారు. ప్రమాదం జరిగిన సమయంలో ఎమర్జెన్సీ వార్డులో పలువురు చిన్నారులు, వారి తల్లిదండ్రులు ఉన్నారు. ఎలక్ట్రికల్ బోర్డులో మంటలు ప్రారంభమవడమే కాకుండా, వార్డు మొత్తం దట్టమైన పొగలు అలుముకున్నాయి. ఊపిరాడక, ఏం జరుగుతుందో తెలియక రోగులు, వారి బంధువులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. ఆసుపత్రి ప్రాంగణమంతా కేకలు, ఆర్తనాదాలతో కాసేపు ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. ప్రమాద తీవ్రతను గమనించిన ఆసుపత్రి వైద్యులు, నర్సింగ్ సిబ్బంది వెంటనే అప్రమత్తమయ్యారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను పూర్తిగా ఆర్పివేశారు. అగ్ని ప్రమాదంపై సిబ్బంది చాకచక్యంగా వ్యవహరించడం వల్ల ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని, అంతా సురక్షితంగా ఉన్నారని ఆసుపత్రి వర్గాలు తెలిపాయి.


