విశాలాంధ్ర_ అనకాపల్లి : కేరళ రాష్ట్రానికి చెందిన తప్పిపోయిన యువకుడును క్షేమంగా అతని బంధువులకు అప్పగించినట్లు పట్టణ సిఐ జి. ప్రేమ్ కుమార్ తెలిపారు. ఈనెల 9న
తుమ్మపాల గ్రామం, వాటర్ వర్క్స్ దగ్గరలో ఉన్న శారదా నది నందు ఒక గుర్తు తెలియని యువకుడు నీటిలో మునిగిపోతుండగా గమనించిన స్థానిక ప్రజలు అతడిని శారద నది నుండి బయటకు తీసి రక్షించి పోలీసులకు అప్పగించారని తెలిపారు. ఆ యువకుడితో అనువాదకుల సహాయంతో మాట్లాడి అతని వివరాలను సేకరించామని దర్యాప్తులో అతని పేరు అభి పాణి పలాత్, ఎర్నాకుళం, కేరళ రాష్ట్రం గా గుర్తించామని తెలిపారు. అనంతరం ఎర్నాకుళం పోలీస్ స్టేషన్ సిబ్బందిని ఫోన్ ద్వారా సంప్రదించి పై యువకుడి వివరాలను తెలియజేయగా, వారి పోలీస్ స్టేషన్లో అభి పాణి గల్లంతైనట్లు, మిస్సింగ్ కేసు కూడా నమోదై ఉన్నట్లు సమాచారం అందించారు. వెంటనే ఈ విషయాన్ని ఎర్నాకుళం పోలీస్ స్టేషన్ సిబ్బంది యువకుడి వివరాలను అతని కుటుంబ సభ్యులకు తెలియజేయగా, వారు కేరళ నుండి ట్రైన్ లో బయలుదేరి గురువారం టౌన్ స్టేషన్ కు వచ్చారని తెలిపారు. యువకుడు మానసిక ఆరోగ్య సమస్యల కారణంగా కేరళ లో ఉన్న తన ఇంటి నుండి బయటకు వెళ్లి పట్టణ పరిధికి చేరుకున్నట్లు తెలిసింది. అవసరమైన ధృవీకరణలు పూర్తి చేసిన అనంతరం అభి పాణిని అతని బంధువులకు గురువారం క్షేమంగా అప్పగించినట్లు సీఐ జి. ప్రేమ్ కుమార్ తెలిపారు.


