ఈశాన్యంలో సాయుధ బలగాల చట్టం తొలగిస్తాం: అమిత్‌ షా


దిల్లీ: ఈశాన్యంలో ఒకట్రెండు రాష్ట్రాలు మినహా మిగిలిన ప్రాంతం మొత్తం నుంచి వచ్చే ఏడాది సాయుధ బలగాల ప్రత్యేక అధికారాల చట్టం (ఏఎఫ్‌ఎస్‌పీఏ) ఉపసంహరిస్తామని కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా గురువారం ప్రకటించారు. అస్సాం, నాగాల్యాండ్‌ సరిహద్దు ప్రాంతాల్లో ఖనిజ, చమురు కార్యకలాపాలను సులభతరం చేసే త్రైపాక్షిక అవగాహన ఒప్పందంపై సంతకాలు ముగిసిన అనంతరం అమిత్‌ షా మీడియాతో మాట్లాడారు. సాయుధ బలగాల చట్టం అమలులో ఉన్న ప్రాంతాలు తగ్గిపోవడం శాంతి పరిఢవిల్లుతోందనడానికి నిదర్శనమని అన్నారు. తాజాగా కుదిరిన త్రైపాక్షిక ఒప్పందం దేశ చరిత్రలో ఒక చారిత్రక ఘట్టమని వ్యాఖ్యానించారు. ఈ ఒప్పందంతో అభివృద్ధి చెందిన ఈశాన్యం కోసం ప్రధాని మోదీ కన్న కలల సాకారానికి ఉన్న చివరి అవరోధం తొలగిపోయినట్లయిందని అమిత్‌ షా అన్నారు. ఈశాన్యంలో ఖనిజ అన్వేషణకు కొత్త మార్గాలు ఏర్పడతాయన్నారు. అధికార పరిధికి సంబంధించిన వ్యత్యాసాల కారణంగా గడచిన మూడు దశాబ్దాలుగా ఇక్కడ ఖనిజాన్వేషణ నిలిచిపోయిందన్నారు. ప్రస్తుతం 1,000 నుంచి 1,500 బ్యారెళ్ల చమురు వెలికి తీస్తుండగా తాజా ఒప్పందం ఫలితంగా ఆ సామర్థ్యాన్ని పదింతలు పెంచవచ్చని చెప్పారు. ‘‘ఒక్క చమురు క్షేత్రంలోనే రూ.15 వేల కోట్ల విలువైన చమురు వెలువడే అవకాశం ఉంది. నాగాలాండ్‌లోని చమురు నిక్షేపాలను వెలికి తీయగలిగితే ఇంధనం కోసం విదేశాలపై ఆధారపడాల్సిన అగత్యం బాగా తగ్గిపోతుంది’’ అన్నారు. ఈశాన్యంలో వివిధ మిలిటెంట్‌ సంస్థలకూ, రాష్ట్ర ప్రభుత్వాలకూ మధ్య 2019 నుంచీ 12 ఒప్పందాలు కుదిరాయని.. వీటి కారణంగా ఈ ప్రాంతంలో హింసాత్మక ఘటనలు 80 శాతం తగ్గిపోయాయని అమిత్‌ షా వివరించారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *