Last Updated:
ఎన్టీఆర్ స్థాపించిన తెలుగుదేశం పార్టీకి నారా చంద్రబాబు నాయుడు పెద్ద మార్పులు, 83 శాతం కొత్త నేతలకు ఛాన్స్, నారా లోకేష్ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా కీలక భూమికలోకి
1982లో ఎన్టీఆర్ స్థాపించిన తెలుగుదేశం పార్టీ మరోసారి పునరుత్తేజంతో ముందుకు సాగుతున్న సంకేతాలు కనిపిస్తున్నాయి. ఈ నెల 15న ప్రకటించిన జాతీయ, రాష్ట్ర కమిటీలను పరిశీలిస్తే, పార్టీ లోపల భారీ మార్పులకు శ్రీకారం చుట్టినట్లు స్పష్టమవుతోంది. జాతీయ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కార్యవర్గంలో 83 శాతం కొత్తవారికి అవకాశం ఇవ్వడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది.
పార్టీ ఆవిర్భావం నుంచి కీలక పదవులు చేపట్టిన పాత తరానికి చెందిన నేతలను కొంతవరకు పక్కన పెట్టి, కొత్త రక్తాన్ని ప్రవేశపెట్టడం ద్వారా చంద్రబాబు స్పష్టమైన మార్పు దిశగా అడుగులు వేశారు. ముఖ్యంగా తన సొంత జిల్లా చిత్తూరులో మహిళలకు ప్రాధాన్యత ఇవ్వడం విశేషంగా మారింది. చిత్తూరు పార్లమెంటు అధ్యక్షురాలు కె అరుణ, నగరి నుంచి ప్రసన్న లక్ష్మి మీరా నేతాజీ వంటి నేతలకు రాష్ట్ర స్థాయి పదవులు దక్కడం పార్టీ లోపల కొత్త సమీకరణాలకు నాంది పలికింది.
అదే సమయంలో సీనియర్ నేతలకు కూడా ప్రాధాన్యత తగ్గలేదనే సంకేతాలు ఇచ్చారు. మాజీ మంత్రి, పలమనేరు ఎమ్మెల్యే ఎన్ అమరనాథ్ రెడ్డికి మరోసారి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పదవి ఇవ్వడం ద్వారా అనుభవానికి విలువ ఇచ్చారు. అలాగే గంగాధరనెల్లూరు ప్రాంతానికి చెందిన భీమినేని చిట్టిబాబు నాయుడు, పట్టభద్రుల ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ వంటి నేతలకు కీలక బాధ్యతలు అప్పగించడం ద్వారా స్థానిక స్థాయిలో పార్టీ బలోపేతానికి కృషి చేస్తున్నారు.
దశాబ్దాలుగా రాజకీయాల్లో ఒక స్థిరమైన శక్తిగా ఉన్న టీడీపీ, ఇప్పుడు కొత్త దశలోకి అడుగుపెడుతున్నట్లు కనిపిస్తోంది. ఎన్టీఆర్ ఆవిర్భావం నుంచి వచ్చిన సిద్ధాంతాలకు, చంద్రబాబు తీసుకొచ్చిన అభివృద్ధి దృక్పథానికి ఇప్పుడు కొత్త తరం జోడవుతోంది. వర్కింగ్ ప్రెసిడెంట్‌గా నారా లోకేష్ నియామకం ఈ మార్పులో కీలక ఘట్టంగా మారింది.
ప్రతిపక్షంలో ఉన్న సమయంలో యువగళం పాదయాత్ర ద్వారా ప్రజల్లోకి వెళ్లిన లోకేష్, ఇప్పుడు పార్టీ అంతర్గత వ్యవస్థలో కూడా తనదైన ముద్ర వేయడానికి సిద్ధమవుతున్నారు. ఇది కేవలం పదవుల మార్పు మాత్రమే కాకుండా, పాత అనుభవాన్ని కొత్త ఉత్సాహంతో కలిపే ప్రయత్నంగా కనిపిస్తోంది. పార్టీ కష్టకాలంలో వెన్నంటి నిలిచిన నేతలకు ప్రాధాన్యత ఇవ్వడం ద్వారా క్యాడర్‌లో కొత్త ఉత్సాహాన్ని నింపారు.
ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో సోషల్ మీడియా, సాంకేతిక పరిజ్ఞానం కీలక పాత్ర పోషిస్తున్నాయి. ఈ నేపథ్యంలో యువతకు, విద్యావంతులకు పెద్దపీట వేయడం ద్వారా టీడీపీ తన వ్యూహాన్ని సమకాలీనంగా మార్చుకుంటోంది. ఇది రాబోయే ఎన్నికలే కాకుండా, భవిష్యత్తు రాజకీయాలను దృష్టిలో ఉంచుకుని తీసుకున్న నిర్ణయంగా విశ్లేషకులు భావిస్తున్నారు.
మొత్తానికి ఈ కమిటీలు కేవలం పదవుల పంపిణీగా కాకుండా, పార్టీ భవిష్యత్తుకు బలమైన పునాది వేసే మాస్టర్ ప్లాన్‌గా కనిపిస్తున్నాయి. ఎన్టీఆర్ ఆశయాలు, చంద్రబాబు వ్యూహాలు, లోకేష్ నాయకత్వం.. ఈ మూడు కలిసి టీడీపీని మరిన్ని దశాబ్దాలపాటు రాజకీయాల్లో ప్రభావవంతమైన శక్తిగా నిలబెట్టే దిశగా తీసుకెళ్తాయనే అంచనాలు వ్యక్తమవుతున్నాయి.
ఆంధ్రప్రదేశ్‌లోని ముఖ్యమైన వార్తలు, లేటెస్ట్ న్యూస్, స్థానిక వార్తలు, ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ప్రకటనలు, అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించిన స్టోరీలను న్యూస్18 తెలుగు ఆంధ్రప్రదేశ్ కేటగిరీలో చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.
Chittoor,Andhra Pradesh



