టీఎంసీలో ముదిరిన సంక్షోభం


. మమతకు 20 మంది ఎంపీల ఝలక్
. ఎన్డీఏకు మద్దతు ప్రకటిస్తూ స్పీకర్‌కు లేఖ
. బెనర్జీ ‘ఇండియా’ భేటీలో ఉండగానే కీలక పరిణామం

న్యూదిల్లీ: తృణమÖల్ కాంగ్రెస్ (టీఎంసీ)ని చుట్టుముట్టిన సంక్షోభం సోమవారం మరింత ముదిరింది. పార్టీ చీఫ్‌విప్ కాకోలీ ఘోష్ దస్తిదార్ నేతృత్వంలో 20 మంది లోక్‌సభ ఎంపీలు బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏకు మద్దతు ప్రకటిస్తూ స్పీకర్ ఓం బిర్లాకు సోమవారం లేఖ రాశారు. అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ ఘోర పరాజయం తర్వాత ఈ పరిణామం పార్టీ పార్లమెంటరీ విభాగంలో చీలికకు దారితీసింది. పశ్చిమ బెంగాల్ అసెంబ్లీలో టీఎంసీ నాయకత్వానికి ఎదురుదెబ్బ తగిలిన కొద్దిరోజులకే ఈ పరిణామం చోటుచేసుకుంది. అక్కడ సీనియర్ నాయకుడు శోభన్ దేవ్ చటోపాధ్యాయను ప్రతిపక్ష నాయకుడిగా నియమించాలన్న పార్టీ అధిష్ఠానం నిర్ణయాన్ని ధిక్కరిస్తూ… ఆ పార్టీకి చెందిన 80 మంది ఎమ్మెల్యేలలో 58 మంది కలిసి బహిష్కృత ఎమ్మెల్యే రితబ్రత బెనర్జీని ఆ పదవికి ఎన్నుకున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయం పాలైనప్పటి నుంచి టీఎంసీని పట్టిపీడిస్తున్న రాజకీయ గందరగోళం సోమవారం దాని పార్లమెంటరీ శ్రేణులకు కూడా పాకినట్లు కనిపించింది. బీజేపీకి వ్యతిరేకంగా అఖిల భారత వ్యూహాన్ని రూపొందించేందుకు పార్టీ అధినేత్రి మమతా బెనర్జీ దిల్లీలో ఇండియా ఐక్య సంఘటన సమావేశానికి హాజరయిన సమయంలోనే పార్టీలోని కొందరు అసమ్మతి ఎంపీలు ఎన్డీఏకు మద్దతు ప్రకటించారు. టీఎంసీకి చెందిన 28 మంది లోక్‌సభ ఎంపీలలో సుమారు 20 మంది ప్రస్తుతం రాజధాని నగరంలోని ఒక రహస్య ప్రదేశంలో బస చేశారు. ఎంపీలు ఫోన్లు స్విచ్ ఆఫ్ చేసి… కనిపించకుండా పోయారు. పార్టీ సీనియర్ నాయకులు తమను సంప్రదించలేకపోతు న్నారని వచ్చిన వార్తలతో ఈ వ్యవహారం మరింత చర్చనీయాంశమయింది. ప్రస్తుతం లోక్‌సభలో టీఎంసీకి 28 మంది సభ్యులు ఉండగా, రాజ్యసభలో 12 మంది ప్రతినిధులు ఉన్నారు.
టీఎంసీ ఎంపీ ఘోష్ దస్తిదార్ పీటీఐతో ఫోన్‌లో మాట్లాడుతూ ఎన్డీఏకు మద్దతు ఇవ్వాలన్న తమ నిర్ణయాన్ని ఎంపీలు స్పీకర్‌కు తెలియజేశారని వివరించారు. ‘నాతో సహా దాదాపు 20 మంది టీఎంసీ ఎంపీలు లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాకు లేఖ రాసి… ఎన్డీఏకు లాంఛనంగా మద్దతు ఇవ్వాలని నిర్ణయించుకున్నాం. మేము లోక్‌సభ స్పీకర్‌కు లేఖ పంపి… ఎన్డీఏకు మద్దతు ఇవ్వాలనుకుంటున్నామని అందులో పేర్కొన్నాం’ అని ఆమె తెలిపారు. ఘోష్ దస్తిదార్ లోక్‌సభలో పార్టీకి చట్టబద్ధమైన చీఫ్ విప్‌గా కొనసాగుతున్నారని, పార్టీ నాయకత్వం ప్రకటించిన తదుపరి మార్పులు అవసరమైన పార్లమెంటరీ ప్రక్రియ ద్వారా జరగలేదని స్పీకర్ ముందు వాదించాలని అసమ్మతి ఎంపీలు భావిస్తున్నట్లు అసమ్మతి వర్గాలు తెలిపాయి. 20 మంది ఎంపీల బృందంలో కాకోలి ఘోష్ దస్తీదార్, షర్మిల సర్కార్, పార్థ భౌమిక్, అరూప్ చక్రవర్తి, అసిత్ మాల్, దేవ్, రచనా బెనర్జీ, శతాబ్ది రాయ్, జూన్ మాలియా, యూసుఫ్ పఠాన్ తదితరులు ఉన్నట్లు తెలుస్తోంది. కాగా మమతా బెనర్జీ నేతృత్వంలోని టీఎంసీ ఘోష్ దస్తిదార్‌ను చీఫ్ విప్ పదవి నుంచి తొలగించి… ఆమె స్థానంలో కల్యాణ్ బెనర్జీని నియమించాలని నిర్ణయించింది. ఈ విషయాన్ని లోక్‌సభ సచివాలయానికి తెలియజేయలేదని మరో తిరుగుబాటు ఎంపీ పీటీఐకి తెలిపారు. తాను లోక్‌సభలో పార్టీ చీఫ్‌విప్‌గా కొనసాగుతున్నానని పేర్కొంటూ, తోటి పార్లమెంటు సభ్యులతో సంప్రదింపుల తర్వాతే ఈ నిర్ణయం తీసుకున్నారని ఘోష్ దస్తిదార్ అన్నారు. ‘మేము ప్రజల తీర్పును అంగీకరించాము. మా భవిష్యత్ రాజకీయ గమనం ఎన్డీఏకు అనుగుణంగా ఉండాలని మేము విశ్వసిస్తున్నాము’ అని ఆమె తెలిపారు. అయితే అసమ్మతి వర్గాల వర్గాల సమాచారం ప్రకారం ఎంపీలు వెంటనే టీఎంసీకి రాజీనామా చేయడానికో లేదా బీజేపీలో చేరడానికో నిర్ణయించుకోలేదు. దానికి బదులుగా… ఎన్డీఏకు మద్దతు ఇస్తూనే ఒక ప్రత్యేక పార్లమెంటరీ కూటమిగా పని చేయాలని భావిస్తున్నారు. ఫిరాయింపుల నిరోధక చట్టం కింద రక్షణ పొందేందుకు ఇది ఒక వ్యూహం. ఈ లెక్కకు రాజకీయ ప్రాముఖ్యత ఉంది. బసిర్‌హట్ ఎంపీ హాజీ నూరుల్ ఇస్లాం మరణంతో ఒక స్థానం ఖాళీ అవ్వగా… ప్రస్తుతం టీఎంసీకి 28 మంది లోక్‌సభ ఎంపీలు ఉన్నారు. ఫిరాయింపుల నిరోధక చట్టం కింద రక్షణ పొందడానికి అవసరమైన మూడింట రెండు వంతుల మెజారిటీని 20 మంది ఎంపీల మద్దతుతో సులభంగా దాటవచ్చు. న్యూదిల్లీలో అసమ్మతి ఎంపీలు రహస్య సమావేశం నిర్వహించిన ఒక రోజు తర్వాత ఈ పరిణామం చోటుచేసుకుంది. ఇది తమ ఎన్నికైన ప్రతినిధులపై టీఎంసీ నాయకత్వానికి ఉన్న అధికారంపై ప్రశ్నలను మరింత తీవ్రతరం చేసే అవకాశం ఉంది.

The post టీఎంసీలో ముదిరిన సంక్షోభం appeared first on Visalaandhra.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *